తరగతి గదిని నిర్లక్ష్యం చేసిన దేశానికి మనుగడ ఉండదు. దేశాభివద్ధి, సంస్కతి, చరిత్ర, సామాజిక మూల సంపదలు, సకల వత్తులు, సబ్బండ వర్ణాల మనుగడకు భవిష్యత్తు దారిచూపే దిక్సూచి తరగతిగది. తరగతిగది పిల్లలకు, ఉపాధ్యాయులకు సంబంధించినది కాదు. సమస్త దేశం, ప్రపంచానికి సంబంధించిన జ్ఞానశాల. ఇక్కడ జరిగే జ్ఞానసాగర మథనం, చర్చలు, పరిశోధనలు అన్నీ మానవ కళ్యాణం కోసమన్న విషయాన్ని మరిచిన దేశాన్ని చీకటినావరిస్తుంది. సకలశాస్త్రాల అధ్యయనంతోపాటు ఆయా శాస్త్రాలను విస్తరింపచేసుకునిపోయే విజ్ఞానాలయం కదా తరగతిగది.
ఒక బుద్ధుడు, ఒక కబీరు, ఒక అశోకుడు, ఒక జ్యోతిభాపూలే, ఒక గాంధీ, ఒక అంబేద్కర్ తరగతిగది నుంచి ప్రభవించిన జ్ఞాన సూర్యులేనన్నది మరువరాదు. తరగతిగది ఒకరకంగా కాలాన్ని నడిపే గడియారం లాంటిది. విస్మరణకు గురైన సమాజాలు, జాతులు అన్నీ తిరిగి స్వాతంత్య్రాలను పొందటానికి దారిచూపే జ్ఞానకేంద్రం తరగతిగది. కాలం ఎట్లా ఉందో, దాన్ని ఎట్లా నడపాలో చెప్పి దేశాన్ని సరైన మార్గంలో నడిపే సామూహిక పనిముట్టు తరగతిగది. నిత్యనూతనత్వ మార్పుల కేంద్రమైన తరగతిని సంరక్షించే బాధ్యతను పాలకులే చేపట్టి ముందుకు నడిపించాలి. ఒకవేళ ఆ పనిని విస్మరిస్తే సమస్త పౌరసమాజం చ్కెతన్యంతో ముందుకు అడుగేసి ఆ పనిని పాలకులు చేపట్టేలా చేయాలి. ఆకలికి అన్నం లాంటిది, చీకటికి వెలుగు లాంటిది తరగతిగది. భావితరాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దే శక్తి తరగతిగదికి ఉంది.
నలభ్కెయాభ్కె ఏళ్లకింద మాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు ఒకరొకరుగా వయో భారంతో కన్నుమూస్తుంటే బాధేస్తుంది. ఈ కాలానికి సంబంధించిన వివిధ రంగాలను తీర్చిదిద్దుతున్న వాళ్లందరినీ తీర్చిదిద్ది పంపింది ఆ ఉపాధ్యాయులేనన్నది నిజం. ఉపాధ్యాయులు త్యాగధనులు వాళ్లు కనిపించరు కానీ వ్యవస్థను నిలబెట్టే యోధుల్ని తీర్చిదిద్ది పంపిస్తారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత బిడ్డలను తీర్చిదిద్దే కార్యశాల తరగతిగది అలాంటి తరగతి గదులు ప్రభుత్వ స్కూళ్లు మారిన కాలంలో చివికిపోయే దశకు రావటం విచారకరం. ప్రభుత్వబడి కూలిపోయే దశకు రావటానికి కారణం దానివెనుక దశాబ్ధులుగా పాలకులు అవలంభించే విధానాలవల్ల జరిగింది. మనందరం మాల్స్‌కు, బిగ్‌బజార్లకు పోయి సరుకులు తెచ్చుకుంటున్నట్లుగానే మన పిల్లలను ప్రభుత్వ బడికి కాకుండా కార్పోరేట్ ప్రైవేట్ స్కూల్స్‌వైపుకు పంపిచేస్తున్నాం. హైదరాబాద్‌లో మాడపాటి హనుమంతరావు స్కూలో, రైల్వేస్కూలో ఆదిహిందూ స్కూళ్లు ఇపుడు అంతగా ప్రచారంలో కూడా లేకుండా పోయాయి. కార్పోరేట్ స్కూళ్లు మన ఇంట్లో చిన్నతెరలలో వూదరకొట్టే శబ్దాలతో వ్యాపార ప్రకటనలుగా చెవుల్లో మారుమ్రోగుతాయి.
ప్రభుత్వ స్కూళ్ల పేర్లు కనుమరుగై పోతున్నాయి. మా మునగాల పరగణా నడిగూడెం కొల్లు పాపయ్యచౌదరి ప్రభుత్వ స్కూళ్లు చూస్తే గుండె చివిక్కుమంటుంది. అది మావూరే కాదు అది ఏ వూరు ప్రభుత్వ బడిద్కెనా అదే కథ కదా!! కొన్ని తేడాలుండొచ్చు. కొన్ని మార్పులుండవచ్చును. మొత్తంగా ప్రభుత్వబడి బాగా చిక్కిపోయింది. అది బడుగు జీవుల దీనుల బడిగా మారింది. జన్మనిచ్చిన తల్లి దండ్రులను చివరి దశలో చూడకుండా వదిలి పెట్టిబోయే బిడ్డల్లాగా, ఊర్లలో ప్రభుత్వబడులు చితికిపోతుంటే వూరు కూడా చూసి చూడనట్లు ఉండటం పరమ బాధాకరం. ఒక వూర్లో ప్రభుత్వ బడి ఆలనాపాలనా లేకుండా చివికిపోవటం ఆ వూరి ఆత్మగౌరవానికి అవమానంగా భావించాలి. వూర్లో అత్యాధునిక టెక్నాలజీతో ఇళ్లను అలంకరించుకోవటం మన అభివద్ధికి చిహ్నమే. అందరం బాగుండాలి కానీ మన ఇళ్ల మధ్యలో బడి అనాథలాగా ఉంటే చూస్తూ ఉండటం ఎంతవరకు నాగరికమో మనందరం ప్రశ్నించుకోవాలి. ఇది ప్రభుత్వం పని అని ఒక్కమాటలో చెప్పవచ్చును. అది నిజంకూడానూ, మన బిడ్డల్ని చదువుకు ప్రైవేట్ స్కూళ్లకు డబ్బిచ్చి, అప్పుచేసి, ఆస్తులమ్మి పంపే దశకు వచ్చాం కానీ అంతకంటే గొప్పగా తరాలను తాతల, దండ్రులను తీర్చిదిద్దిన బడి కూలిపోయే దశకు వచ్చినా మౌనంగా చూస్తూ పోతున్నాం.
ఈ స్థితి మారాలి. మన బడిని మనం తీర్చిదిద్దుకునేందుకు వూరంతా ఒక్కట్కె కదలాలి. రాజకీయాలను పక్కన బెట్టాలి. బడి సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తమ భుజాలపై వేసుకోవాలి. ప్రభుత్వం మౌళిక వసతులు కల్పించాలి. స్కూళ్లు, కాలేజీలకు 60 ఏళ్ల క్రితం కనీస వసతులు కూడా అంతగాలేని కాలంలో విద్యార్థులను తీర్చిదిద్దిన ఆనాటి ఉపాధ్యాయ లోకం ఎంత గొప్పదో ఈనాటి కాలానికి అన్వయించుకుని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. పలకలమీద అక్షరాలు దిద్దుకున్న వారి నుంచి దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, గొప్ప నాయకులు, అన్ని రంగాలను తీర్చిదిద్దగల సమర్థులు రాగలగటానికి ఆనాటి ఉపాధ్యాయుల అకుంఠిత దీక్ష వెలకట్టలేనిది. తరగతి గదిలో దేశం రూపురేఖలు రచించబడతాయన్న కొఠారి చెప్పిన మాటలు ఆ తరం ఉపాధ్యాయులకు సరిపోతాయి. తరగతిగదే జీవితంగా మలుచుకుని వారుచెప్పిన పాఠాలు, వాళ్లు పిల్లల్ని ప్రయోజకుల్ని చేయటానికి పడ్డ తపన వారిసేవలను మననం చేసుకుంటే గర్వమేస్తుంది. స్కూల్‌కే పూర్తి సమయాన్ని కేటాయించి సేవలందించారు. మార్నింగ్ అసెంబ్లీ నుంచి బడి చివరి గంట మోగేవరకు వత్తి పనుల్లో మునిగిపోవటం చూశాం. అది తెలుగు పద్యమైన, జాన్‌కిట్స్ షెల్లీ కవితల్కెనా షెక్స్‌స్పియర్ డ్రామా అయినా, సైన్సు, సోషల్ స్టడీస్ పాఠాల్కెనా, హిందీ ఇంగ్లీషు తెలుగు త్రిభాషా పాఠాలను చెప్పే టీచర్‌ల పాఠాలు, తరగతిగదికే అంకితమైన గురుశిష్య బంధాలు చాలా బలంగా ఉండేవి. బ్లాక్ బోర్డు, చాక్‌పీస్‌లు, ప్రపంచ పటాలు, గ్లోబ్, ల్యాబ్‌ల్లో వసతులు అంతంత మాత్రమే ఉండేవి. పాఠాన్ని మాత్రం పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పటం, అర్థంకాని విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా చెప్పేవారు. బడి సమయమంతా బడికే కేటాయించినా తిరిగి రాత్రిపూట అందరు టీచర్ల ఇళ్లకాడ ఉచితంగా ట్యూషన్‌లు చెప్పేవారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన పిల్లలు ఆ టీచర్ ఇంట్లోనే ఉండేవారు. అక్కడే నిద్రించేవారు. అవసరమైతే ఉపాధ్యాయుడే పిల్లలకు అన్నం పెట్టేవారు. ఒకరకంగా అది ట్యూషన్‌గా కాకుండా పిల్లలు, టీచర్లు కలగలిసిన భోదనా కుటుంబంగా ఉండేది. పిల్లల దగ్గర్నుంచి ఒక్కపైసా తీసుకునేవారు కాదు. 50 ఏళ్లు వెనక్కుపోయి వెనుతిరిగి చూస్తే ఆ బడుల నుంచి వచ్చిన పిల్లలే కదా నేడు అన్ని రంగాలను నడిపిస్తున్నారని గర్వం అనిపిస్తుంది. తెలుగు మీడియం చదువుకుని వచ్చిన ఈ పిల్లలే నేడు దేశ దేశాల్లోని ఆర్థిక వ్యవస్థలకు ఇంజన్లుగా మారారు. ఆనాటి తరం ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ గత కాలాన్ని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. ఆనాటి ఉపాధ్యాయ తరంలో తరగతి గదిని వదిలి వెళ్లిన వారిని చూడటం కష్టం. ఉపాధ్యాయ వత్తిలోనే ఉండి ఆ వత్తిలోనే చివరిదాకా కొనసాగిన వాళ్లున్నార.్న కానీ ఎలాంటి ప్రైవేట్ వ్యాపారాలు చేయలేదని గట్టిగా చెప్పగలం.
ఆటపాటమాట… హైస్కూల్ స్థాయిలో అన్ని రకాల ఆటలు ఆడుకోవటానికి విస్తతమైన క్రీడామైదానాలున్నాయి. క్రాఫ్ట్ టీచర్, డ్రిల్ మాస్టర్లు ఉండేవారు. భోదనా టీచర్లతోపాటు వాళ్లపాత్ర ఎంతో ముఖ్యమైనది. స్కూల్ స్థాయిలో పలు ఉత్సవాల సందర్భంగా సాంస్కతిక కార్యక్రమాలు ఘనంగా జరిగేవి. వ్యక్తిత్వ, వ్యాసరచన, ఆటల పోటీలు జరిగేవి. ఆటపాటమాటలు నేర్చుకునే వేదికగా తరగతిగది ఉండేది. జూనియర్, డిగ్రీ కాలేజీకి వచ్చే సరికి రీజనింగ్, క్వశ్చనింగ్, అంశాలపై లోత్కెన చర్చలు, విద్యార్థుల ఇష్టంతో ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులను ఎంచుకోవటం జరిగేది. కళాశాలల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయుల మధ్య పలు అంశాలపై జరిగే చర్చల నుంచి ప్రాపంచిక విషయాల వైపు దష్టిమళ్లి అది అధ్యాయానికి, భవిష్యత్ ఆచరణకు బలమైన బాటలు వేసింది.
గుర్తుకొస్తున్నాయి… ఈ మధ్య కాలంలో 50 ఏళ్ల క్రితం పాఠాలు చెప్పిన టీచర్లు ఒకరొకరు కన్నుమూస్తుంటే వాళ్లను తలుచుకుంటుంటే బాల్యంనాటి తరగతి గదులు, ఆనాటి బడుల స్థితిగతులు గుర్తుకొచ్చేస్తున్నాయి. పండుగ సెలవులు, వేసవి సెలవులలో మాత్రమే ఉపాధ్యాయులు ఊరిడిచిపోయేవారు. స్థానికంగా చుట్టుపక్కల ఊర్లనుంచే మాకు ఎక్కువగా ఉపాధ్యాయులుండటం వల్ల సెలవుల్లో కూడా కనిపించేవారు. ఆనాడు టీచర్లకు సైకిళ్లపైననే తిరిగేవారు. హౌంవర్క్‌పైన ప్రత్యేక శ్రద్ద చూపేవారు. అందువల్ల పిల్లలు ఇంటి దగ్గర బాగా చదువుకుని వచ్చేవారు. ఉపాధ్యాయుల భోదన, విద్యార్థుల సాధనవల్ల మంచి ఫలితాలు వచ్చేది సజనాత్మకత పిల్లల్లో వెల్లివిరియటానికి తరగతి ఆనాడు చేసినపని మామూలుది కాదు. మూడు తరాలను ప్రభావితం చేసిన ఆ ఉపాధ్యాయులు వెళ్లిపోతుంటే వారి సేవలను, కషిని మననం చేసుకుని స్ఫూర్తిపొందాలి. ఒక వత్తిని ఎంచుకుని ఆ వత్తిలోని జీవితకాలం చిత్తశుద్దితో పనిచేయటం మామూలు విషయం కాదు. ఎన్ని కష్టాలన్కెనా, వొత్తిడులన్కెనా, వొడిదొడుకులన్కెనా ఎదుర్కొని భావితరాల కోసమే జీవితాలను అంకితం చేసిన ఉపాధ్యాయులు ధన్యులు. వత్తికి అంకితమైన టీచర్లను కాలం ఎప్పటికీ మరవదు.
ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న విశంఖలత్వాలను, పెడధోరణులను, హింసను, కన్జుమరిజాన్ని, మార్కెట్ విషసంస్కతిని తిప్పికొట్టి మనిషిని మనిషి గౌరవించే మానవీయ సంస్కతిని ప్రతిష్ఠించగల శక్తి తరగతిగదికి ఉంది. దేశసమగ్రత, హింసావాదం, కరిగిపోతున్న మానవ బంధాలను నిలిపేశక్తి తరగతి గదికే ఉంది. సమాజ సమతుల్యతతో నిలిపేందుకు మానవ విలువల సైన్యాన్ని నిర్మించటం ఉపాధ్యాయుల వల్లనే జరుగుతుంది. మనం బడిని రక్షిస్తే అది వూరిని, దేశాన్ని రక్షిస్తుంది. చదువులంటే బతుకు తెరువులను చూపేది మాత్రమే కాదు. బతుకును బతికించేది.
(వత్తికే అంకితమై ఇటీవల కన్నుమూస్తున్న మూడుతరాల గురువులకు వినమ్రంగా నివాళులు).
- జూలూరు గౌరీశంకర్, 9440169896



