Sunday, December 7, 2025
E-PAPER
Homeఆటలుసిరీస్‌ సొంతమాయె

సిరీస్‌ సొంతమాయె

- Advertisement -

2-1తో వన్డే సిరీస్‌ భారత్‌ వశొంఛేదనలో శతకబాదిన యశస్వి
రోహిత్‌, కోహ్లి అర్థ సెంచరీలుొదక్షిణాఫ్రికా 270/10, భారత్‌ 271/1

విశాఖలో మనదే విజయం. ఛేదనలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (116 నాటౌట్‌), రోహిత్‌ శర్మ (75) సహా కింగ్‌ కోహ్లి (65 నాటౌట్‌) రాణంచటంతో ఓ టూర్‌లో వరుస సిరీస్‌ ఓటమి ప్రమాదం నుంచి ఆతిథ్య జట్టు గట్టెక్కింది. 2-1తో దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ విజయాన్ని అందుకుంది.
రికార్డు 20 మ్యాచ్‌ల్లో టాస్‌ ఓడిన భారత్‌.. విశాఖలో టాస్‌తో పాటు మ్యాచ్‌ను ఖాతాలో వేసుకుంది. తొలుత బౌలర్లు దక్షిణాఫ్రికాను 270 పరుగులకు కట్టడి చేయగా.. ఊరించే లక్ష్యాన్ని బ్యాటర్లు అలవోకగా ఛేదించారు. విశాఖలో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం సాధించింది.
నవతెలంగాణ-విశాఖపట్నం

విశాఖలో టీమ్‌ ఇండియా వీర విహారం. పేసర్‌ ప్రసిద్‌ కష్ణ (4/66), స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (4/41) నాలుగు వికెట్ల ప్రదర్శనతో రెచ్చిపోయారు. ప్రసిద్‌, కుల్‌దీప్‌ మ్యాజిక్‌తో తొలుత దక్షిణాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (106, 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) అదిరే సెంచరీతో మెరువగా.. కెప్టెన్‌ తెంబ బవుమా (48, 67 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. ఓపెనర్‌ రియాన్‌ రికెల్టన్‌ (0), ఎడెన్‌ మార్‌క్రామ్‌ (1), మాథ్యూ (24) డెవాల్డ్‌ బ్రెవిస్‌ (29) తేలిపోయారు. ఊరించే లక్ష్యాన్ని భారత్‌ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (116 నాటౌట్‌, 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కదం తొక్కాడు. సీనియర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ (75, 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (65 నాటౌట్‌, 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) సమయోచిత ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. టాప్‌-3 బ్యాటర్లు చెలరేగటంతో విశాఖలో సఫారీ బౌలర్లు తేలిపోయారు. 39.5 ఓవర్లలోనే 271 పరుగులు చేసిన భారత్‌ విశాఖ వన్డేలో మరో 61 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. విశాఖ వన్డేలో ఛేదనలో సెంచరీ బాదిన యశస్వి జైస్వాల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. రెండు సెంచరీలు, ఓ అర్థ సెంచరీతో పరుగుల వరద పారించిన విరాట్‌ కోహ్లి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచాడు.

జైస్వాల్‌ శతకబాదగా..
మంచు ప్రభావం ఎక్కువగా కనిపించిన సిరీస్‌లో తొలిసారి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 271 పరుగుల లక్ష్యాన్ని ఊదేసింది. 39.5 ఓవర్లలోనే 271 పరుగులు బాదేసి మరో 61 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కొత్త బంతితో సఫారీ పేసర్లు భారత ఓపెనర్లను ఇరకాటంలో పడేసేందుకు చూశారు. కానీ రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌ అనవసర దూకుడు చూపించలేదు. ఆచితూచి ఆడుతూనే చెత్త బంతులను బౌండరీ లైన్‌ దాటించారు. పవర్‌ప్లేలో వికెట్‌ నష్టపోకుండా 48 పరుగులు జోడించిన ఓపెనర్లు.. ఆ తర్వాత గేర్‌ మార్చారు. రోహిత్‌ శర్మ 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో దండెత్తాడు. సహజశైలికి భిన్నంగా ఆరంభం నుంచీ నెమ్మదిగా ఆడిన యశస్వి జైస్వాల్‌ 75 బంతుల్లో అర్థ సెంచరీ..111 బంతుల్లో సెంచరీ సాధించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోని జైస్వాల్‌… విశాఖలో సూపర్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రోహిత్‌ నిష్రమణతో క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లి విశాఖలో మరో మరుపురాని ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు. 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన కోహ్లి… లక్ష్యం చిన్నది కావటంతో హ్యాట్రిక్‌ సెంచరీ మిస్‌ అయ్యాడు. ఆఖర్లో యశస్వి, విరాట్‌ జోరు పెంచగా 39.5 ఓవర్లలోనే భారత్‌ లాంఛనం ముగించింది. 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది.

డికాక్‌ మెరువగా..
విశాఖపట్నం కీలక టాస్‌ నెగ్గిన భారత్‌.. 20 మ్యాచ్‌ల వరుస నిరాశకు తెరదించింది. కొత్త బంతితో పేస్‌ దాడిని మొదలెట్టిన అర్ష్‌దీప్‌ సింగ్‌ ఇన్నింగ్స్‌ బంతికే భారత్‌కు బ్రేక్‌ అందించాడు. వికెట్ల వెనకాల క్యాచౌట్‌గా అవుటైన రియాన్‌ రికెల్టన్‌ (0) పరుగుల ఖాతా తెరవనేలేదు. మరో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (106)తో జతకలిసిన కెప్టెన్‌ తెంబ బవుమా (48) రెండో వికెట్‌కు విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు వేగంగా 113 పరుగులు జోడించారు. క్వింటన్‌ డికాక్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 42 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన డికాక్‌… 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 80 బంతుల్లో వంద పరుగులు చేశాడు. అర్థ సెంచరీ ముంగిట బవుమా వికెట్‌ కోల్పోవటంతో సఫారీ కష్టాలు మొదలయ్యాయి. రవీంద్ర జడేజా మ్యాజిక్‌తో సఫారీ పతనానికి నాంది వేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఎవరూ నిలదొక్కుకోలేదు. ఓ ఎండ్‌లో డికాక్‌ నిలిచినా.. మాథ్యూ (24), ఎడెన్‌ మార్‌క్రామ్‌ (0), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (29), మార్కో యాన్సెన్‌ (17), కార్బన్‌ బాచ్‌ (9)లను భారత బౌలర్లు చుట్టేశారు. ప్రసిద్‌ కష్ణ, కుల్‌దీప్‌ యాదవ్‌లు మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ను చకచకా పడగొట్టారు. 47.5 ఓవర్లలో ఆలౌటైన దక్షిణాఫ్రికా 270 పరుగులు చేసింది.

స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ : 270/10 (47.5 ఓవర్లు) (క్వింటన్‌ డికాక్‌ 106, తెంబ బవుమా 48, ప్రసిద్‌ కష్ణ 4/66, కుల్‌దీప్‌ యాదవ్‌ 4/41)
భారత్‌ ఇన్నింగ్స్‌ : 271/1 (39.5 ఓవర్లు) (యశస్వి జైస్వాల్‌ 116 నాటౌట్‌, రోహిత్‌ శర్మ 75, విరాట్‌ కోహ్లి 65 నాటౌట్‌, మహరాజ్‌ 1/44)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -