Sunday, December 7, 2025
E-PAPER
Homeజాతీయంనగరం నుంచి అడవికి..

నగరం నుంచి అడవికి..

- Advertisement -

హాలీడే స్పాట్‌లుగా వన్య ప్రాంతాలు
వాయు కాలుష్యానికి విసిగిన ప్రజలు
ఏక్యూఐ ఆధారంగా సెలవులు ప్లాన్‌
ఖర్చుతో సంబంధం లేదు.. స్వచ్ఛమైన గాలి, మానసిక ప్రశాంతతే ముఖ్యం
భారత్‌లో మారుతోన్న ట్రెండ్‌
మార్పు మంచిదేనంటున్న వైద్య నిపుణులు

భారత్‌లో కాలుష్యం ఒక పెద్ద సమస్యగా తయారైంది. నగరాల్లో ఊపిరి తీసుకోవడం రోజురోజుకూ కష్టమవుతున్నది. ఇలాంటి తరుణంలో ప్రజలు ఇప్పుడు ‘లగ్జరీ హాలీడే’లు కాకుండా.. స్వచ్ఛమైన గాలి లభించే అడవులను తమ కొత్త విశ్రాంతి కేంద్రాలుగా ఎంచుకుంటున్నారు. గాలి నాణ్యతా సూచీ (ఏక్యూఐ) ఆధారంగా హాలీడేలు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ కొత్త ట్రెండ్‌ భారత్‌లో వేగంగా పెరుగుతూ ఒక జీవనశైలి మార్పుని సూచిస్తోంది. మహారాష్ట్రలోని తడోబా, గొథంగావ్‌ వంటి అటవీ ప్రాంతాలు తక్కువ కాలుష్యంతో, ప్రశాంత వాతావరణంతో సెలవుల్లో సుదూర ప్రయాణాలకు ప్రధాన గమ్య స్థానాలుగా మారుతున్నాయి. కాలుష్యం నుంచి దూరంగా అటవీ ప్రాంతాల్లో ప్రకృతి మధ్య గడిపే కొన్ని రోజులు ప్రజలకు శారీరకంగా, మానసికంగా ఒక సహజమైన శాంతిని అందిస్తున్నాయి.

న్యూఢిల్లీ : నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యంతో ప్రజలు తమ హాలీడే స్పాట్‌ల కోసం అడవుల వైపు పరుగులు తీస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదపరిచే పచ్చదనం ఇప్పుడు భారతీయులకు కొత్త విలాసం (లగ్జరీ)గా మారింది. మహారాష్ట్రలోని తడోబా, గొథంగావ్‌, పలు రాష్ట్రాల్లోని నేషనల్‌ పార్కుల వంటి అటవీ ప్రాంతాలు గత కొన్ని నెలలుగా అత్యధిక హాలిడే బుకింగ్స్‌ను నమోదు చేస్తున్నాయి. గాలి నాణ్యతను ఆధారంగా చేసుకొని సెలవులను గడిపే ‘ఏక్యూ ఐ హాలిడే’ అనే కొత్త ట్రెండ్‌ దేశంలో వేగంగా పెరుగుతోంది.

‘అక్కడ ఏక్యూఐ ఎంత?’
భారత్‌లో ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలలో గాలి కాలుష్యమూ తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నది. ప్రజలు ఊపిరాడక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు రోగాల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవటమే వారికి ఒక విలువైన అంశంగా మారింది. అందుకే.. సెలవులను ప్లాన్‌ చేసుకునే సమయంలో ‘హౌటల్‌ ఎలా ఉంది?’ అని ఆలోచించడానికి ముందు ‘అక్కడ ఏక్యూఐ ఎంత?’ అని చూడటం చాలా మందికి అలవాటైంది.

ప్రకృతి ఒడిలో విరామం ఒక సహజ థెరపీ
అడవుల్లోని చిన్న రిసార్టుల్లో అందే అనుభవం చాలా సాదాసీదాగా కనిపించినా.. దాని ప్రభావం ఎంతో లోతుగా ఉంటుందని వైద్య, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అడవిలో ఉండే నిశబ్ద వాతావరణం.. మనం నగరాల్లో ఎన్నడూ అనుభవించని ప్రశాంతతను కలిగిస్తుంది. రోజంతా కార్ల హరన్‌ శబ్దాలు, సైరన్ల మోత, యంత్రాల రణగోన చప్పుళ్లతో అలసిపోయిన మనసుకు.. అడవి ప్రాంతాల్లో గాలిలో ఊగే ఆకుల చప్పుడు, పక్షుల మధుర గానాలు, సెలయేటి గలగలలు ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఈ సహజ ధ్వనులు మన నాడీ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడంలో శాస్త్రీయంగా కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెప్తున్నారు. ప్రకృతితో గడపడం వల్ల కార్టిసోల్‌ స్థాయిలు (స్ట్రెస్‌ హార్మోన్‌) తగ్గుతాయనీ, హృదయ స్పందన స్థిరంగా మారుతుందని వైద్యులు చెప్తున్నారు. మెదడుకు ప్రశాంతత అందుతుందని అంటున్నారు. అందుకే చాలా మంది అడవిలో రెండు రోజులు గడిపి వచ్చినా.. వారాల తరబడి ఉల్లాసంగా ఉంటారని వారు వివరిస్తున్నారు.

లగ్జరీ నిర్వచనమే మారింది
ఒకప్పుడు లగ్జరీ అంటే పెద్ద స్విమ్మిగ్‌పూల్‌, బఫే, డిన్నర్లు, నైట్‌ పార్టీలు, ఖరీదైన స్పా ట్రీట్‌మెంట్‌లు. కానీ ఇప్పుడు దాని అర్థం మారిపోయింది. లగ్జరీ అంటే.. స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం, ప్రకృతి ఒడిలో సేద తీరడం, ఫోన్‌, సోషల్‌ మీడియా నుంచి దూరంగా గడపడంగా మారిపోయింది. ప్రజలు ఈ మార్పును ఆహ్వానిస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు.

ఏక్యూఐ హాలిడే.. భారతీయుల కొత్త జీవనశైలి
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, పెరుగుతోన్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో ప్రజలు ప్రధానంగా దృష్టిని సారిస్తున్నారు. సెలవులు దొరికితే వాటిని క్వాలిటీగా గడపాలని చూస్తున్నారు. విమానం టికెట్‌ ధర ఎంత? హౌటల్‌ ఎలా ఉంది, దాని రేటు ఎంత? వంటి ప్రశ్నలను దూరం పెట్టి.. గాలి నాణ్యత ఎలా ఉంది? అనే విషయం ఆధారంగా ప్రజలు వారి టూర్లను ప్లాన్‌ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు, పిల్లలతో ఉన్న కుటుంబాలు, ఒత్తిడితో బాధపడేవారు ఇందులో ముందున్నారు. ఇది కేవలం ఒక ట్రెండ్‌ కాదు, ఒక జీవనశైలి మార్పు అని విశ్లేషకులు చెప్తున్నారు. భారత్‌లో వస్తున్న ఈ మార్పు వ్యక్తిగతంగానే కాకుండా పర్యాటక రంగానికి ఊతమిస్తుందని అంటున్నారు.

కొత్త వెల్‌నెస్‌ హబ్‌లుగా తడోబా-గొథంగావ్‌
మహారాష్ట్రలోని తడోబా టైగర్‌ రిజర్వ్‌, గొథంగావ్‌ వంటి ప్రాంతాలు ఇప్పుడు అత్యంత ప్రాచ్యుర్యం పొందుతున్నాయి. ఇక్కడి వాతావరణం, పచ్చదనం, రకరకాల వృక్షాలు, పక్షులు, జంతువులు, ప్రశాంత సాయంకాలాలు చాలా మందికి మానసిక శాంతిని ఇస్తున్నాయి. విలాసవంతమైన సౌకర్యాలు లేకున్నా.. ప్రశాంత వాతావరణం, స్వచ్ఛమైన గాలి, సహజ ధ్వనులు వంటివే ఇప్పుడు అత్యంత విలువైన విశ్రాంతి అంశాలుగా మారాయని మానసిక నిపుణులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -