Sunday, December 7, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుతగ్గేదే లే..!

తగ్గేదే లే..!

- Advertisement -

ప్రధాన పార్టీలకు రెబెల్స్‌ బెడద
ఉపసంహరణకు ఒప్పుకోని తిరుగుబాటుదారులు
పార్టీ అభ్యర్థి ఎవరో తెలియని అయోమయం
గెలిచాక తమ అభ్యర్థులుగా ప్రకటించుకునే యోచన
పార్టీల గుర్తులు కాకపోవటంతో గందరగోళ స్థితి

నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికల్లో రెబెల్స్‌ బెడద తీవ్రంగా ఉంది. నాయకులు బుజ్జగించినా కొందరు నామినేషన్‌ ఉపసంహరణకు ఒప్పుకోని పరిస్థితి ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో ఓటర్లు ఓ పార్టీకి ఓటేద్దామని అనుకున్నారు. ఇంతలోనే ఆ పార్టీ నుంచి ఒక్కో పంచాయతీలో నలుగురు సర్పంచ్‌ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోలేని స్థితి ఓటర్లలో నెలకొంది. తనకు ఆ స్కీం అందడానికి కారణమైన నాయకునికి వేయాలా? లేక పార్టీ అధికారికంగా నిర్ణయించిన అభ్యర్థికా…? సర్పంచ్‌కు ఒకరికి, వార్డుమెంబర్‌కు మరొకరికి వేద్దామా..? కుటుంబంలో నాలుగు ఓట్లు ఉంటే తలా ఒక్కరికి వేద్దామా…? ఈ గొడవంతా ఎందుకని నోటాకు వేయాలా..? తేల్చుకోలేని స్థితిలో గ్రామీణ ఓటర్లు కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే తొలివిడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. గుర్తుల కేటాయింపు కూడా పూర్తయింది. రెండో దఫా నామినేషన్ల ఉపసంహరణల ప్రక్రియ కూడా శనివారంతో సమాప్తం అయింది. మూడో విడత కోసం ఆదివారం నుంచి నామినేషన్‌ పత్రాలు స్వీకరిస్తారు.

17వ తేదీ నాటికి మూడు విడతల పోలింగ్‌ కూడా పూర్తవుతుంది. ఒక్కో దఫాలో అభ్యర్థుల నిర్ణయం.. ప్రచారం.. పోలింగ్‌కు పదిరోజుల వ్యవధి కూడా లేకపోవటంతో ఏ పార్టీ అభ్యర్థి ఎవరనేది తెలిసే అవకాశం లేకుండా పోయింది. దీనిని ఆసరా చేసుకుని ప్రధాన పార్టీల నుంచి ఒక్కో పంచాయతీకి నలుగురి వరకు పోటీలో ఉంటున్నారు. దాంతో పార్టీ అభ్యర్థి ఎవరనేది ఓటర్లకు తెలియని గందరగోళ స్థితి నెలకొంది. ముఖ్యంగా రాష్ట్రంలోని అనేక పంచాయతీల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముగ్గురు, నలుగురు అభ్యర్థులు బరిలో ఉంటున్నారు. ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులు, పార్టీ నియోజకవర్గ కార్యాలయాల నుంచి ఓ అభ్యర్థిని అధికారికంగా సర్పంచ్‌ క్యాండిడేట్‌గా ప్రకటించినా.. అదే పార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకులు తమ అనుచరులను అభ్యర్థులుగా నిర్ణయిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ నాటికి వెనక్కు తీసుకునేలా రెబెల్‌ అభ్యర్థుల తాలూకు లీడర్లపై ఒత్తిడి చేస్తున్నా అనేకచోట్ల వినే పరిస్థితి లేదు. కొన్నిచోట్ల మంత్రులు చెప్పినా సరే వెనక్కు తగ్గట్లేదు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారికి సంబంధించిన ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో పది మండలాలు ఉన్నాయి. దాదాపు అన్ని గ్రామాల్లోనూ అధికార పార్టీకి రెబెల్స్‌ బెడద ఉంది.

చిత్రవిచిత్ర పొత్తులు
స్థానిక సంస్థల్లో పార్టీ గుర్తులతో కూడిన ఎన్నికలు కాకపోవడంతో పొత్తుల విషయంలోనూ చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కూడా కొన్నిచోట్ల ఒక్కటిగా పోటీ చేస్తున్నాయి. అనేక చోట్ల కమ్యూనిస్టులతో ఈ రెండు పార్టీలూ జత కట్టాయి. ఉత్తర తెలంగాణలో కొన్నిచోట్ల బీజేపీతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఏకమై పోటీ చేస్తున్నాయి. ఇలా దేశ, రాష్ట్ర రాజకీయాలతో పొంతన లేని పొత్తులతో ఆయా పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో మంత్రులు సైతం మిన్నకుండక తప్పని స్థితి. చేసేది లేక కొన్నిచోట్ల ఎవరు గెలిస్తే వారినే తమ అభ్యర్థులుగా ప్రకటించుకునే యోచనలోనూ పార్టీల నాయకత్వం ఉంది. అయితే, అభివృద్ధి పనుల పేరు చెప్పి గెలిచాక పలువురు మూడు రంగుల కండువా కప్పుకునే ప్రయత్నాల్లోనూ ఉండటం గమనార్హం.

క్రమశిక్షణ చర్యలకూ చాన్స్‌
గ్రామ స్వపరిపాలన స్ఫూర్తి, స్థానిక ఐకమత్యం- సామరస్యం, పాలనా వ్యవహారాల్లో నిష్పక్షపాత నిర్ణయాలు తీసుకోవడానికి జాతీయ, రాష్ట్రస్థాయి ఎజెండాలతో నిమిత్తం లేకుండా ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రాంతీయ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో పంచాయతీరాజ్‌ వ్యవస్థ గ్రామ పాలకులను ఎన్నిక చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసమే పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తోంది. అధికార, ప్రతిపక్షాలు తమ మద్దతుదారులను ప్రోత్సహిస్తూ పరోక్షంగా ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. దీనిలో భాగంగా ఫలానా అభ్యర్థులు తమ పార్టీవారని అధినాయకత్వం అధికారికంగా ప్రకటనలు చేస్తోంది. నాయకత్వం ఎంపిక చేసిన అభ్యర్థులు నచ్చనిపక్షంలో గ్రామస్థాయి నాయకులు స్వచ్ఛందంగా అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. తాము సూచించిన వారిని కాదని మరొకర్ని పోటీ చేయిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయా పార్టీల జిల్లా, రాష్ట్రస్థాయి నాయకత్వం హెచ్చరికలు చేస్తోంది. అయినా కొందరు వెనక్కు తగ్గకపోవటంతో సంబంధిత గ్రామస్థాయి నాయకులపై క్రమశిక్షణ చర్యలు సైతం తీసుకోవాలని ప్రధాన పార్టీలు నిర్ణయానికి వచ్చాయి. జిల్లా స్థాయి నాయకత్వం సైతం గ్రూపులవారీగా విడిపోయి ఉండటం గ్రామ నాయకులకు కలిసి వస్తోంది.

ఓ నియోజకవర్గంలో ఇంకో సెగ్మెంట్‌ నాయకులు జోక్యం చేసుకోవద్దనే నిబంధన దాదాపు అన్ని పార్టీల్లో ఉన్నా ఏదో ఒక రకంగా తమ గ్రూపు లీడర్‌తో మాట్లాడించొచ్చనే భావనలో తిరుగుబాటుదారులు ఉన్నారు. పరిస్థితులను బట్టి చూస్తుంటే మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఈ పరిణామాలను సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. తిరుగుబాటు నాయకులపై క్రమశిక్షణ చర్యలు తప్పకపోవచ్చని కాంగ్రెస్‌ శ్రేణులు అంటున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఆర్థిక సహాయం కూడా అధికారికంగా ప్రకటించిన వారికే లభించే అవకాశం ఉంది. కొన్నిచోట్ల అధికారపార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన వారిని ఓడించేందుకు ప్రధాన ప్రతిపక్షం రెబెల్స్‌తోనూ చేతులు కలుపుతోంది. అవసరమైతే ఆర్థిక చేయూత కూడా అందించే యోచనలో ఉంది. కాబట్టి గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత స్థానిక రాజకీయ సమీకరణాలు కూడా మారక తప్పని స్థితి నెలకొంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి మూడేండ్ల పదవీకాలం ఉండటంతో వివిధ పార్టీలు, రెబెల్స్‌ నుంచి విజేతలు అధికార పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరిషత్‌ ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని గందరగోళం ఉంది. మొత్తమ్మీద ఈ పరిణామాలు ఓటర్లను మాత్రం పూర్తి అయోమయానికి గురిచేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -