కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం
పాత పది జిల్లాల్లో అవగాహనా కార్యక్రమాలు
ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పించాలి
కేంద్ర కార్మిక మంత్రి, స్టాండింగ్ కమిటీ చైర్మెన్‌ను కలుద్దాం
ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా చట్టాలు చేస్తే ప్రతిఘటించాలి
ప్రపంచబ్యాంకు ఒప్పందాలకు లోబడి సంస్కరణలు
కార్మికుల శ్రమదోపిడీ వల్లే ఇండిగో విమానాలు రద్దు : బీఆర్టీయూ రౌండ్‌టేబుల్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పార్లమెంటులో లేబర్ కోడ్‌లను ఆమోదించినా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయొద్దని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) డిమాండ్ చేశారు. పార్లమెంటులో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ వాటిని వ్యతిరేకించారని గుర్తు చేశారు. లేబర్ కోడ్‌లను అమలు చేయొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్టీయూ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నామని చెప్పారు. ఈ దేశంలో ప్రపంచంలోనే కుబేరులున్నారనీ, అత్యంత పేదరికం కూడా ఇక్కడే ఉందని అన్నారు. ‘ప్రపంచమే కుగ్రామం’ అనే పేరుతో అమెరికా, ఐరోపాలో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస్తే కుదరదని చెప్పారు.
సంస్కరణలు అవసరమే కానీ ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని బలోపేతం చేసే దిశగా ఉండాలన్నారు. ప్రపంచబ్యాంకు ఒప్పందాలకు లోబడి సంస్కరణలను తెస్తున్నారని విమర్శించారు. కొందరు ఉచిత పథకాలు మంచివి కాదంటూ బీహార్ ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరి అకౌంట్‌లో రూ.పది వేలు జమ చేశారని గుర్తు చేశారు. దేశ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా చట్టాలను తెస్తే నిర్ద్వంద్వంగా ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. చేసే చట్టాల్లో మానవీయ కోణం ఉండాలన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మంచిదే కానీ నాణ్యతతో కూడిన వ్యాపారం జరగాలని సూచించారు. నాలుగు దశాబ్దాల క్రితం చైనా జీడీపీ భారత్‌కన్నా తక్కువగా ఉండేదని చెప్పారు. ఇప్పుడు భారత్ నాలుగు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అయితే, చైనాది 60 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందిందని అన్నారు. చైనా ఎప్పటికప్పుడు ప్రజలకు అనుగుణంగా నూతన విధానాలను తీసుకురాబట్టే ఈ ఫలితాలు సాధించిందని వివరించారు. అలాంటి అభివృద్ధిపై ఈ దేశంలో చర్చ జరగబోదని అన్నారు. కార్మికుల శ్రమదోపిడీ వల్లే ఇండిగో విమానయాన సంస్థ వల్ల ప్రయాణికులకు ఐదు రోజులుగా అసౌకర్యం కలుగుతోందని చెప్పారు.
ఐదు రోజుల్లో వెయ్యి విమానాలు రద్దయ్యాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల సంస్థలు కొంతమంది చేతుల్లో పెట్టడం వల్ల ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయని చెప్పారు. ఇండిగో ఒత్తిడికి కేంద్రమే తలొగ్గింది తప్ప, ఇండిగో తగ్గలేదని అన్నారు. కొత్త లేబర్ కోడ్‌లు అమల్లోకి వస్తే ఇండిగో వల్ల జరిగిన అసౌకర్యం మిగతా రంగాలకూ విస్తరిస్తుందని చెప్పారు. ఈ కోడ్‌లకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలతో బీఆర్టీయూ కలిసి పనిచేయాలని సూచించారు. లేబర్ కోడ్‌లు రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకుంటే దేశానికి దిక్సూచి అవుతుందన్నారు. పాత జిల్లా కేంద్రాల్లో అవగాహనా సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేయాలని కోరారు. రాజ్యసభలో ప్రయివేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి, స్టాండింగ్ కమిటీ చైర్మెన్‌ను కలిసి వినతిపత్రాలను అందజేయాలని చెప్పారు. లేబర్ కోడ్‌లను అమలు చేయకుండా ఉండే వరకు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలను స్తంభింపజేస్తామని అన్నారు.
ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయాలి : మల్లారెడ్డి
లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. సినిమాధరలు పెంచితే అందులో 20 శాతం సినీ కార్మికులకు ఇస్తున్నట్టే పారిశ్రామికవేత్తలు పరిశ్రమల భూమిని అమ్ముకుంటే కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీమంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కార్మికులకు సమ్మె హక్కు లేకుండా చేసేందుకు ప్రమాదకరమైన లేబర్‌కోడ్‌లను తెచ్చిందని అన్నారు. మాజీ ఎంపీ బి వినోద్‌కుమార్ మాట్లాడుతూ రైతు చట్టాల ను పోరాడి వెనక్కి కొట్టినట్టే లేబర్ కోడ్‌లను వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేయాలన్నారు. ఉద్యోగ జేఏసీ మాజీ చైర్మెన్ జి దేవీప్రసాద్ మాట్లాడుతూ బడాబాబుల కోసమే కేంద్రం ఈ కోడ్‌లను తెచ్చిందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ లేబర్ కోడ్‌లు దుర్మార్గంగా ఉన్నాయని అన్నారు. కార్మికులకు ఈ కోడ్ ఉద్యోగ భద్రతను దూరం చేస్తుందన్నారు. బీఆర్టీయూ అధ్యక్షులు రాంబాబు యాదవ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కార్మిక, ప్రభుత్వరంగ సంస్థల నాయకులు పాల్గొన్నారు.



