ఫోన్ ‘లొకేషన్ ఆన్’కు మోడీ సర్కారు చర్యలు?
మొబైల్ యూజర్లపై నిఘా.. గోప్యతకు లేని భరోసా
రాయిటర్స్ కథనం వెల్లడి
ఇది ప్రమాదకరం : టెక్ నిపుణులు
దిగ్గజ కంపెనీల నుంచి వ్యతిరేకత
భారత్‌లో ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో లొకేషన్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచే ఆలోచనను కేంద్రంలోని మోడీ సర్కారు చేస్తున్న దని ప్రముఖ అంతర్జాతీయ వార్త సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎక్కడా అమలు కాని ఈ ప్రతిపాదన భారత్‌లో తీవ్రమైన గోప్యతా వివాదానికి దారి తీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం ఆలోచనపై యాపిల్, శాంసంగ్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఫోన్‌లలో ఏ-జీపీఎస్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచాలని సూచించే ఈ ప్రతిపాదన.. యూజర్ల కదలికలను ప్రతీ క్షణం ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా డేటా లీకులు పెరుగుతోన్న సమయంలో ఫోన్ లొకేషన్‌ను ఎప్పుడూ ఆన్ చేయాలన్న మోడీ సర్కారు ఆలోచన ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనపై కేంద్రం నుంచి తుది నిర్ణయం వెలువడలేదు.
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలోని పౌరుల గోప్యతకు భంగం వాటిల్లే చర్యలు తీసుకుంటున్నది. గత దశాబ్ద కాలంగా పలు సందర్భాల్లో ఈ విషయం వెల్లడైంది. తాజాగా మొబైల్ ఫోన్‌ల ద్వారా యూజర్లపై నిఘా పెట్టే చర్యలకు కేంద్రం దిగుతున్నదన్న కథనాలు బయటకు వచ్చాయి. భారత్‌లో తయారయ్యే అన్ని స్మార్ట్‌ఫోన్లలో లొకేషన్ ఫీచర్ ఎప్పటికీ(24 గంటలూ) ఆఫ్ చేయకుండా ఉంచే కొత్త నిబంధనలపై మోడీ సర్కారు ఆలోచిస్తున్నట్టు అంతర్జాతీయ వార్తా సంస్థ ఆధారాలతో తెలిపింది. అంటే యూజర్ తన ఫోన్‌లో లొకేషన్‌ను ఆఫ్ చేసినా.. ఫోన్ మాత్రం ఎప్పటికప్పుడూ ట్రాకింగ్ చేస్తుందన్నమాట. ఇప్పుడీ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నది.
సంచార్‌సాథీ వివాదం చల్లారగానే…
యాపిల్, శాంసంగ్, గూగుల్ వంటి పెద్ద టెక్ కంపెనీలు ఆ ఆలోచనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయంపై చర్చించేందుకు కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ఒక సమావేశాన్ని పెట్టాలని భావించినా.. ఆ తర్వాత అది వాయిదా పడింది. తాజా ప్రతిపాదనను ఒకవేళ అమలు చేసినట్టయితే ప్రపంచంలో నే ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి దేశంగా భారత్ అవుతుందని నివేదికలు చెప్తున్నాయి. ఇటీవల సంచార్‌సాథీ యాప్‌పై దేశంలో తీవ్ర దుమారం చెలరేగిన విషయం విదితమే. స్మార్ట్‌ఫోన్లలో ప్రభుత్వ యాప్ ‘సంచార్‌సాథీ’ని కేంద్రం తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గోప్యత సమస్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ వివాదం ముగిసిన వెంటనే మోడీ ప్రభుత్వం మరొక వివాదాస్పద ప్రతిపాదనతో ముందు కొస్తున్నదన్న కథనం బయటకు రావటం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది.
స్పందించని ప్రభుత్వం
కాగా తాజా ప్రతిపాదనను ఐటీ, హౌం మంత్రిత్వ శాఖలు ఇంకా అధ్యయనం చేస్తున్నాయని రాయిటర్స్ వివరించింది. అయితే ఈ వ్యవహారంపై ప్రభుత్వం, కంపె నీలు, లాబీ గ్రూపులు… ఎవరూ ఇప్పటి వరకు స్పందించ లేదని పేర్కొన్నది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమాచార రక్షణలో భారత ప్రభుత్వ రికార్డు అంత గొప్పగా లేదని రాయిటర్స్ వివరించింది. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం సేకరించిన డేటా అనేక సార్లు లీక్ అయిన ఘటనలూ ఉన్నాయని విశ్లేషకులు గుర్తు చేస్తు న్నారు. వీటిన్నిటి దృష్ట్యా మొబైల్ ఫోన్‌లలో లొకేషన్ ఆన్ ఫీచర్ ప్రతిపాదన మరింత ఆందోళనను పెంచిందని రాయిటర్స్ నివేదిక వివరించింది.
సీఓఏఐ ప్రతిపాదన.. ఐసీఈఏ అభ్యంతరం
జియో, ఎయిర్టెల్ వంటి కంపెనీలకు ప్రాతినిథ్యం వహించే సంఘం సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) చేసిన ప్రతిపాదనతో తాజా ఆలోచనకు బీజం పడిందని రాయిటర్స్ వివరించింది. ఇందుకు ఐటీ మంత్రిత్వ శాఖలోని ఒక అంతర్గత ఈ-మెయిల్‌ను ఉటంకించింది. అయితే మోడీ సర్కారు చేసిన ఆలోచనను యాపిల్, గూగుల్ వంటి కంపెనీల సంఘం ఇండియా సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) స్పష్టంగా తిరస్కరించింది. తాము అలా చేయబోమని తేల్చి చెప్పినట్టు తెలిసింది. ”ఏ-జీపీఎస్ సేవలు నిఘా కోసం రూపొందించినవి కావు. ఇలాంటి ఆదేశం ఇవ్వడం రెగ్యులేటరీ ఓవర్‌రీచ్ అవుతుంది” అని లేఖలో పేర్కొన్నది. ఈ ఫీచర్ వల్ల సైనిక అధికారులు, న్యాయమూర్తులు, కార్పొరేట్ ఉన్నతాధికారులు, జర్నలిస్టులు వంటి సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉన్న వ్యక్తుల భద్రత, గోప్యతకు ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించింది.
ఏమిటీ ఏ-జీపీఎస్?
ఏ-జీపీఎస్ అంటే సాధారణ జీపీఎస్ సిగల్స్‌కు అదనంగా సెల్‌టవర్లు, మొబైల్ నెట్‌వర్క్ డేటా, ఇంటర్నెట్ ద్వారా ఫోన్ లొకేషన్‌ను మరింత వేగంగా గుర్తించే వ్యవస్థ. సాధారణ జీపీఎస్ కంటే ఎక్కువ
కచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. యూజర్ లొకేషన్‌ను కొద్ది సెకన్లలోనే ట్రాక్ చేస్తుంది. సాధారణంగా కొన్ని ప్రత్యేక యాప్‌లు ఓపెన్ ఉన్నప్పుడు, లేదా ఎమర్జెన్సీ కాల్ చేసినప్పుడు మాత్రమే ఇది పని చేస్తుంది. అంటే కేవలం యూజర్ అనుమతితోనే ఇది సాధ్యం. కానీ దీనిని ఎల్లప్పుడూ ఆన్ చేయాలనంటే ఫోన్‌ను పూర్తిగా నిఘా పరికరంగా మార్చినట్టే అవుతుందని టెక్ నిపుణులు ఆందోళన
వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా భయంకరమైనదని హెచ్చరిస్తున్నారు.



