రాజ్యాంగ రక్షణకు అందరూ ఐక్యం కావాలి : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు
ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులు
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
మనువాదమే దేశ ఐక్యతకు విఘాతం కలిగిస్తోందని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు అన్నారు. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో 12ఏండ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాలకు మొక్కుతూనే ఆయన ఆశయాలను పాతాళంలోకి తొక్కుతోందని విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అంకితమిస్తే.. దాన్ని రద్దు చేయడానికి కేంద్రం కుట్రలు చేస్తున్నదన్నారు. మనుస్మృతిని తమ పవిత్ర గ్రంథం గా ప్రకటించుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్.. రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నదన్నారు. కేంద్రం కార్పొరేట్ దిగ్గజాలకు ఊడిగం చేయటం ద్వారా కష్టజీవుల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఐదేండ్ల కాలంలో ఎన్‌ఆర్‌బీ గణాంకాల ప్రకారం దళితులపై 6,46,318 దౌర్జన్యాలు జరిగాయని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, మహిళాలు, మైనారిటీలకు ఏమాత్రం రక్షణ లేదన్నారు. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై చెప్పు దాడి, హర్యానాలో ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య ఇవన్నీ దేశంలో పెరుగుతున్న విద్వేషానికి పరాకాష్ట అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి భారత పౌరుల ఓటు హక్కునూ లేకుండా చేస్తున్నారన్నారు. ప్రయివేటు రంగాన్ని వేగంగా పెంచుతున్న బీజేపీ ప్రభుత్వం సామాజిక న్యాయా న్ని సమాధి చేస్తున్నదన్నారు. కులదురహంకార హత్యలు పెట్రేగిపోతున్నప్పటికీ కులాంతర వివాహితులకు రక్షణ చట్టం చేయడం లేదన్నారు.
ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజిక న్యాయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు దేశంలో ప్రజాస్వామిక అభ్యుదయ, సామాజిక శక్తులు ఐక్యం కావాలన్నారు. కులవ్యవస్థ రహిత సమాజం కోసం సాగే పోరాటంలో ప్రతిఒక్కరూ పాల్గొనడం ద్వారా అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించి నట్టవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్షులు ఎం.దశరథ్, కేవీపీఎస్ నగర కార్యదర్శి బి.సుబ్బారావు, ఎం.మహేందర్, సీఐటీయూ, కేవీపీఎస్ నగర నాయకులు జి.రాములు, మహేందర్, మల్లయ్య, బి.పవన్, వెంకటయ్య, సోమయ్య, అర్జున్, కిషన్, మాధవ్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
మనువాదమే దేశ ఐక్యతకు విఘాతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



