రెండ్రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
27 ప్రత్యేక సెషన్లకు వేదిక కానున్న ఫ్యూచర్‌సీటీ
ఆయా రంగాలపై చర్చలు
తరలిరానున్న దేశ, విదేశీ ప్రముఖులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025కు దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలిరానున్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో రెండు రోజులపాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరగనున్నాయి. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ-సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్‌లు వంటి విభిన్న రంగాలపై చర్చల్లో నిపుణులు పాల్గొంటారు.
ప్రముఖ సంస్థలు
వరల్డ్ హెల్త్ ఆర్డనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, యూనీసెఫ్ ప్రతినిధులతో పాటు టీఈఆర్‌ఐ, బీసీబీ, మైక్రాన్ ఇండియా, హిటాచీ ఎనర్జీ, ఓ2పవర్, గ్రీన్‌కో, అపోలో హాస్పిటల్స్, ఐఐటీ హైదరాబాద్, నాస్కామ్, సఫ్రాన్, డీఆర్‌డీవో, స్కైరూట్, ధృవస్పేస్, అమూల్, లారస్ ల్యాబ్స్, జీఎంఆర్, టాటా రియాల్టీ, కోటక్‌బ్యాంక్, గోల్డ్‌మ్యాన్ సాచ్, బ్లాక్‌స్టోన్ సాచ్, డెలాయిట్, కాపిటా ల్యాండ్, స్విగ్గీ, ఏడబ్ల్యూఎస్, రెడ్.హెల్త్, పీవీఆర్ ఇనాక్స్, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్, తాజ్ హోటల్స్ తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు.
ప్రముఖులు
ఈ సమ్మిట్‌లో ఆయా రంగాల్లో నిష్ణాతులైన పివి సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వంటి క్రీడా ప్రముఖులు, ఒలంపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్‌లో పాల్గొంటారు. అలాగే రాజమౌళి, రితేష్ దేశ్‌ముఖ్, సుకుమార్, గుణీత్ మోంగా, అనుపమా చోప్రా వంటి సినీ ప్రముఖులు క్రియేటివ్ సెంచరీ-సాఫ్ట్ పవర్, ఎంటర్‌టైన్‌మెంట్ చర్చలో పాల్గొంటారు.
సీఎం పర్యవేక్షణలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు సదస్సుకు తరలివచ్చే ప్రతినిధులను సమన్వయం చేస్తున్నారు. దావోస్‌లో ప్రతియేటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ను తలపించేలా అంతర్జాతీయ స్థాయిలో ఈ సదస్సు జరగాలని ముఖ్యమంత్రి స్వయంగా ఈ సదస్సు ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తున్నారు. అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
సమగ్ర ప్రణాళికలు
ఈ సమ్మిట్‌లో రెండో రోజైన డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరిస్తుంది. 2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్‌ను ఈ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌లో అన్ని రంగాల్లో భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, నూతన ఆవిష్కరణల దిశగా సమగ్ర ప్రణాళికలను పొందుపరిచారు.



