Sunday, December 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంశాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డులది కీలకపాత్ర

శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డులది కీలకపాత్ర

- Advertisement -

త్వరలో ప్రత్యేక కో-ఆపరేటివ్‌ సొసైటీ ఏర్పాటు
ప్రభుత్వ పరిశీలనలో వారికి ఇండ్ల మంజూరు అంశం :హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌
ఘనంగా హోంగార్డుల రైజింగ్‌ డే వేడుకలు


నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తూ హోంగార్డులు కీలకపాత్ర పోషిస్తున్నారని పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. వారి సంక్షేమం కోసం త్వరలోనే సిటీ పోలీస్‌ విభాగంలో ప్రత్యేకంగా ‘హోంగార్డ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ’ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. పేట్లబుర్జులోని సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సిటీ పోలీస్‌ ఆధ్వర్యంలో శనివారం ‘హోంగార్డ్స్‌ రైజింగ్‌ డే’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీపీ పరేడ్‌ను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. నగరంలో సుమారు 5 వేల మంది హోంగార్డులు అంకితభావంతో పనిచేస్తున్నారని వివరించారు. వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న కో-ఆపరేటివ్‌ సొసైటీలో ఇప్పటికే 2,000 మంది చేరారని, మిగిలిన వారు కూడా సభ్యత్వం తీసుకోవాలని సూచించారు.

అర్హులైన హోంగార్డులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని తెలిపారు. ప్రతి ఒక్క హోంగార్డు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను విధిగా రెన్యూవల్‌ చేసుకోవాలని సూచించారు. లైసెన్స్‌ రెన్యూవల్‌ చేసుకోని పక్షంలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బీమా మంజూరులో ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. విధి నిర్వహణలో అలసత్వం వహించినా, అవినీతి, అక్రమాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రమశిక్షణతో మెలిగి పోలీస్‌ శాఖకు మంచిపేరు తేవాలన్నారు. అనంతరం పరేడ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారితోపాటు, విధి నిర్వహణలో ప్రతిభ చూపిన 25 మందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. విధి నిర్వహణలోనూ, ఇతర కారణాలతో మృతిచెందిన 18 మంది హోంగార్డుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ (సీఏఆర్‌) రక్షిత కృష్ణమూర్తి, హోంగార్డ్స్‌ కమాండెంట్‌ కిషన్‌ రావు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -