Monday, December 8, 2025
E-PAPER
Homeజాతీయంకారులోనే మైనర్‌పై దారుణం

కారులోనే మైనర్‌పై దారుణం

- Advertisement -

భారత సంతతి క్యాబ్‌ డ్రైవర్‌కు ఏడేండ్లు జైలుశిక్ష
న్యూజిలాండ్‌ కోర్టు తీర్పు
అక్లాండ్‌:
కారులోనే యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో భారత సంతతికి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ 37 ఏండ్ల సత్విందర్‌ సింగ్‌కు న్యూజిలాండ్‌ కోర్టు ఏడేండ్ల 2 నెలల జైలుశిక్ష విధించింది. 2023 ఫిబ్రవరి 11న హామిల్టన్‌ జిల్లా పరిధిలో తన క్యాబ్‌లోకి ఎక్కిన 17 ఏండ్ల యువతిపై అతడు లైంగికదాడికి పాల్పడినట్టు దర్యాప్తులో రుజువు అయింది. దీంతో సత్విందర్‌కు ఈ మేరకు జైలుశిక్షను విధిస్తూ హామిల్టన్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తి టిని క్లార్క్‌ తీర్పును వెలువరించారు.వాస్తవానికి తొలుత సత్విందర్‌కు ఎనిమిదేండ్ల జైలుశిక్షను విధిస్తానని జడ్జి చెప్పారు. అయితే న్యాయమూర్తి ఎదుట సత్విందర్‌ తరఫు న్యాయవాది నాదైన్‌ బాయెర్‌ పలు కీలక అంశాలను లేవనెత్తారు. సిక్కు మతస్తుడైన సత్విందర్‌ సింగ్‌, 11 ఏండ్లుగా చాలా కష్టాల నడుమ న్యూజిలాండ్‌లో జీవితాన్ని వెళ్లదీస్తున్నందున అతడి జైలుశిక్షను కొంత తగ్గించాలని జడ్జీని కోరారు. ఈ ఒక్క కేసును మినహాయిస్తే, గతంలో సత్విందర్‌పై ఎలాంటి నేరాభియోగాలు లేవన్నారు. జైలుశిక్షను మరీ ఎక్కువగా విధిస్తే, సత్విందర్‌ ఎక్కువ ఇబ్బందులు పడతాడని న్యాయవాది తెలిపారు.

‘సిక్కు మతస్తుడని, శిక్షను తగ్గించలేం’
సిక్కు మతస్తుడు అనే అంశం ప్రాతిపదికన దోషికి విధించే శిక్షా కాలాన్ని తగ్గించడం కుదరదని జడ్జి టిని క్లార్క్‌ తేల్చి చెప్పారు. ఉబర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న సత్విందర్‌కు న్యూజిలాండ్‌ చట్టాలు తెలుసని, అతడిని ప్రత్యేకంగా పరిగణించలేమని స్పష్టం చేశారు. కుటుంబీకులకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నందున, తన ఫొటో మీడియాకు విడుదల కాకుండా ఆపాలంటూ దోషి చేసిన విన్నపాన్ని సైతం జడ్జి తిరస్కరించారు. సత్విందర్‌ క్రూరమైన చేష్టల వల్ల బాధిత యువతి భయాందోళనలో మునిగిపోయిందని, ఇంటి నుంచి బయటికి వచ్చేందుకూ ఇప్పుడు ఆమె జంకుతోందని న్యాయమూర్తి గుర్తు చేశారు. తనకు ఏదైనా ముప్పు జరుగుతుందనే ఆందోళనతో బాధితురాలు అసురక్షితంగా ఫీల్‌ అవుతోందన్నారు. కానీ గత సత్ప్రవర్తన, మంచి కుటుంబ నేపథ్యం ప్రాతిపదికన సత్విందర్‌ జైలుశిక్షా కాలాన్ని 10 శాతం తగ్గించేందుకు న్యాయమూర్తి టిని క్లార్క్‌ అంగీకరించారు. ఈవిధంగా అతడి జైలుశిక్షా కాలం ఏడేండ్ల రెండు నెలలకు పరిమితమైంది.

ఏం జరిగిదంటే?
న్యూజిలాండ్‌లోని హామిల్టన్‌ జిల్లా పరిధిలో సత్విందర్‌ సింగ్‌ నివసించే వాడు. అతడికి రోజు మాదిరిగానే 2023 ఫిబ్రవరి 11న కూడా యాప్‌లో ఒక క్యాబ్‌ బుకింగ్‌ ఆర్డర్‌ వచ్చింది. దీంతో హామిల్టన్‌ నగరంలోని స్పైట్స్‌ ఆలే హౌజ్‌ రెస్టారెంట్‌ వద్దకు వెళ్లాడు. అక్కడ ఓ 17 ఏండ్ల యువతి క్యాబ్‌లోకి ఎక్కింది. హామిల్టన్‌ ఈస్ట్‌ ఏరియాలో ఉన్న వైకతో నదికి 7 కి.మీ దూరంలో తనను డ్రాప్‌ చేయాలని డ్రైవరు సత్విందర్‌కు చెప్పింది. యాప్‌లోనూ అదే లొకేషన్‌ను ఆమె సెలెక్ట్‌ చేసింది. అయితే మార్గం మధ్యలో తన కారు జీపీఎస్‌ను సత్విందర్‌ ఆఫ్‌ చేశాడు. పీచ్‌గ్రోవ్‌ రోడ్‌ అనే వీధిలోకి కారును తీసుకెళ్లాడు. దీంతో ఆ ట్రిప్‌ అంతటితో ముగిసిందనే సమాచారం ఆ యాప్‌కు చేరింది. ఆ తర్వాత కారు డోర్స్‌ను లాక్‌ చేసి, యువతిపై సత్విందర్‌ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తదుపరిగా బాధిత యువతిని ఓ స్నేహితురాలి ఇంటి వద్ద వదిలాడు. జీపీఎస్‌ను అతడు ఆఫ్‌ చేసినప్పటికీ, కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీ ఆధారంగా కారు కదలికలను పోలీసులు ట్రాక్‌ చేయగలిగారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -