భారతీయ న్యాయవ్యవస్థ దారితప్పుతోంది : నిఖిలేశ్వర్ పుస్తకావిష్కరణ సభలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మనుషులను చంపితే ఉద్యమాలు ఆగవని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి అన్నారు. ప్రముఖ కవి నిఖిలేశ్వర్ రాసిన ”ఎక్కిడికీ గమనం? ఎంత దూరమీ గమ్యం?.. ఎవరిదీ ప్రజాస్వామ్యం? ఏ విలువలకీ ప్రస్థానం?, గోడల వెనుక” అనే మూడు పూస్తకాలను ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్‌కౌంటర్లు కాలం చెల్లిన విధానమని అభిప్రాయపడ్డారు. సాటి వ్యక్తి సాయం లేకుండా నడవలేని సాయిబాబాను ఎందుకు బంధించారని అడిగిన సందర్భంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. అయన అచేతనుడైనా… ఆయన మెదడు పనిచేస్తుంది కదా? అది ఎంతటి వింధ్వంసాన్నైనా సృష్టిస్తుందని చెప్పడం దేనికి సంకేతమని నిలదీశారు. తుపాకి పట్టిన వారిని, ఆలోచించే వారిని, ప్రశ్నించే వారిని అందరినీ చంపుకుంటూ పోతారా అంటూ ప్రశ్నించారు. భారతీయ న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికి లోబడి కాకుండా, నమ్మకాల నుంచి, దేవాలయాల ధ్వజ స్తంభాల నుంచి స్ఫూర్తి పొంది తీర్పులిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యమంటేనే మార్కెట్.. మార్కెట్ అంటేనే రాజ్యం అనే స్థాయికి ప్రజాస్వామ్యాన్ని నేటి పాలకులు తీసుకొచ్చారని అన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీని ఈ దేశం నుంచి తరిమి కొట్టడానికి 180 ఏండ్లు పట్టిందని మర్చి పోయిన పాలకులు, పెట్టుబడుల పేరిట అదే వలస వాదులకు ఎర్రతివాచి పరుస్తున్నారని విమర్శించారు. ఇండిగో ఉదంతమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ చెగువేరాను పక్కన పెట్టి… సావర్కర్‌ను ముందు పెడితే మనిషి ఆలోచనలు, సమాజం తీరు మారుతుందనుకోవడం మూర్ఖత్వమన్నారు. అంతా అయిపోయిందనే నిరాశావాదం నుంచి బయపట పడాలని అభిప్రాయపడ్డారు. డోనాల్డ్ ట్రంప్ గెలిచిన చోటే మమ్దాని గెలిచాడని గుర్తు చేశారు. సమాజపు ఒడిదొడుకుల్ని, దారితప్పుతున్న ప్రజాస్వామ్య విలువలను నిఖిలేశ్వర్ తన రచనల ద్వారా చెప్పారని అన్నారు. అయితే చీకటి ఎప్పుడూ ఉండదనే శ్రీశ్రీ వ్యాఖ్యలను ఉదహరించారు. ప్రముఖ కవి నందిని సిధారెడ్డి మాట్లాడుతూ ”సాహిత్యంలో రసజ్ఞులుంటారు.. వినిమయ దారులుంటారు. కెరీరిజం లేకుండా కవి లేడు. కవుల్లో గ్రూపులు, విభేదాలు ఇప్పటివి కాదు. ఆది కవి నన్నయ నుంచి నేటి వరకు ఉన్నారు. భవిష్యత్‌లో కూడా ఉంటారు. నిఖిలేశ్వర్ విబేదించినా ఇదే వాస్తవం” అని సిధారెడ్డి అభిప్రాయపడ్డారు. ఎమెస్కో ఎడిటర్ చంద్రశేఖర్‌రెడ్డి పుస్తకాలను సభకు పరిచయం చేయగా, ప్రొఫెసర్ కల్పనా కన్నబిరాన్ జైలు వెనుక పుస్తకాన్ని, ప్రొఫెసర్ కట్టా ముత్యం రెడ్డి విద్యారంగ సమస్యలను ప్రస్తావించారు. అనంతరం పుస్తకాల రచయిత నిఖిలేశ్వర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలుంటాయనీ, విమర్శకుల అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకుంటానని తెలిపారు. డాక్టర్ జతిన్ సమన్వయం చేయగా, కె.రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు.
మనుషులను చంపితే ఉద్యమాలు ఆగుతాయా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



