నవతెలంగాణ – సదాశివపేట
సదాశివపేట మండల కేంద్రంలో ప్రొసీడింగ్ అధికారులకు నిర్వహించిన ఎన్నికల శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం పరిశీలించారు. మద్దికుంట చౌరస్తాలోని కింగ్స్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, సజావుగా నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఎన్నికల సమయంలో ప్రతి అధికారి పూర్తి జాగ్రత్తతో, బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరాన్ని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, బ్యాలట్ బాక్స్‌ల నిర్వహణ, ఓటర్లకు సౌకర్యాలు, ఎన్నికల నియమావళి వంటి అంశాలపై ఆమె వివరణాత్మకంగా సూచనలు అందించారు. చిన్నపాటి లోపాలు కూడా ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రతి దశలో అప్రమత్తత అవసరమని ప్రావీణ్య అన్నారు. అధికారులు తమ పాత్రను సమయానుకూలంగా, నిపుణంగా నిర్వహించి ప్రజల్లో నమ్మకం పెంపొందించాలని ఆమె సూచించారు. తర్వాత శిక్షణలో పాల్గొన్న అధికారులకు సంబంధిత పాఠ్యాంశాలపై మాస్టర్ ట్రైనర్లు వివరణలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మి, నోడల్ అధికారి రామాచారి, మాస్టర్ ట్రైనర్ డాక్టర్ తులసీరామ్ రాథోడ్, శ్రీకాంత్ జోషి, కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.




