Tuesday, December 9, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిరాజ్యాంగ నిబంధనలకు ప్రగతిశీల వ్యాఖ్యానాలు అవసరం

రాజ్యాంగ నిబంధనలకు ప్రగతిశీల వ్యాఖ్యానాలు అవసరం

- Advertisement -

గవర్నర్‌, రాష్ట్రపతి అధికారాలపై భారత సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన సూచనాత్మక అభిప్రాయం, భారత ప్రజాస్వామ్య,సమాఖ్య వ్యవస్థ లకు ఇబ్బందికర మైన పరిస్థితిని సూచిస్తుంది. కోర్టు ఇచ్చిన అస్పష్టమైన సమాధానం, ఎన్నికైన శాసనసభల ప్రాధాన్యతను బలపరిచి, రోజు రోజుకూ పెరుగుతున్న గవర్నర్‌ వ్యవస్థ పక్షపాత ధోరణిని నియంత్రిం చడానికి బదులుగా,ఈ సంక్షోభానికి కారణమైన విధివిధానాలకు మరింత బలం చేకూర్చుతోంది.

రాష్ట్రం తర్వాత రాష్ట్రంలో, కేంద్ర ప్రభుత్వ నియమిత గవర్నర్లు,రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లుల్ని నెలలు, సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్న ఫలితంగా, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఒక రాజ్యాంగ పదవిని వీటో అధికార కేంద్రంగా మార్చుతుంది. శాసనసభ ఆమోదించి, రాజ్‌భవన్‌కు పంపబడిన బిల్లులు, శూన్యంలోకి పంపిన విధంగా ఉన్నాయి. వాటిని ఆమోదించడం, తిప్పి పంపడం లేదా రిజర్వేషన్‌ వంటి చర్యలేవీ లేకుండా, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200లో ఉన్న ‘వీలైనంత త్వరగా చర్య తీసుకోవాలనే’ నిబంధనను ప్రత్యక్షంగా ఉల్లంఘించే పరిస్థితి కొనసాగుతోంది.
ఇదేదో పాలనాపరమైన యాదచ్ఛిక సంఘటన కాదు, కానీ ఒక రాజకీయ నమూనా. ప్రధానంగా కేంద్ర పాలకవర్గ కూటమిలో లేని రాష్ట్ర ప్రభుత్వాల పైనే గవర్నర్లు అడ్డంకులు సష్టిస్తున్నారు. బీజేపీ, దాని మిత్ర పక్ష పార్టీల పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు తమ శాసన సంబంధిత విషయాల్లో ఇలాంటి అడ్డంకుల్ని ఎదుర్కోవడం లేదు.ఆ విధంగా గవర్నర్‌ పదవి, పక్షపాత నియంత్రణకు ఉపయోగించే ఆయుధంగా ఉపయోగించబడుతోంది. ఫలితంగా రాజ్యాంగం ఊహించిన సమాఖ్య సమతుల్యత బలహీనపడు తుంది. అదే విధంగా ఎన్నుకోబడిన శాసనసభలు సార్వభౌమ ప్రజాభీష్టాన్ని వ్యక్తీకరిస్తాయనే మౌలికసూత్రం క్రమంగా క్షీణిస్తుంది.

రాజ్యాంగ వినాశనకర పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించేట్టు చేసింది. బిల్లుల ఉద్దేశపూర్వక నిలిపివేతను నిరోధించాలని కోరుతూ రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి.ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏప్రిల్‌ 8న ఇచ్చిన తీర్పు, అసాధారణ సంక్షోభానికి సాహసోపేత జోక్యంతో స్పందిం చింది. గవర్నర్లు, బిల్లుల్ని నిరవధికంగా జాగు చేయడం ‘చట్ట విరుద్ధమని’, రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకమని గుర్తిస్తూ,రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, బిల్లులపై నిర్దిష్ట కాలవ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు,కార్యనిర్వాహక అడ్డంకుల నుండి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సంసిద్ధతను సూచించింది.

ఆర్టికల్‌ 200 ప్రకారం గవర్నర్‌కు మూడు ఎంపికలు మాత్రమే ఉన్నాయి: ఆమోదించడం,నిరాకరించడం, తిప్పి పంపడం లేక రాష్ట్రపతికి రిజర్వ్‌ చేయడం.శాసనసభచే తిరిగి ఆమోదించబడిన బిల్లుల్ని తప్పకుండా ఆమోదించాలనే స్పష్టత ఇవ్వడంతో కోర్టు,రాష్ట్రాల్లోని చట్ట నిర్మాణ ప్రక్రియకు వివేకాన్ని పునరుద్ధరించి నట్టు కనిపించింది.న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ మౌనాల్ని రాష్ట్ర స్వయం ప్రతిపత్తి,ప్రజాసార్వభౌమత్వంపై దాడిచేసే ఆయుధాలుగా మార్చేందుకు అనుమతించదనే ఆశను ఈ తీర్పు కలిగించింది.

1949 మే 31న అంబేద్కర్‌ ఈ విధంగా పేర్కొన్నాడు: ”ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసినట్టు, గవర్నర్‌ కు ఏ విధమైన అధికారాలు ఉండకూడదని ముసాయిదా కమిటీ భావించింది.మామూలుగా చెప్పాలంటే, గవర్నర్‌ తన విచక్షణతో గానీ,వ్యక్తిగత అభిప్రాయంతోగానీ నిర్వహించాల్సిన విధులు ఏవీ ఉండకూడదు.నూతన రాజ్యాంగ నిబంధనల ప్రకారం,ఆయన అన్ని విషయాల్లో తన మంత్రిమండలి సలహాను అనుసరించాల్సిన అవసరం ఉంటుంది.” అంబేద్కర్‌ ఇంకా స్పష్టంగా ఇలా అన్నాడు: ”నేనిదివరకు చెప్పిన విధంగా,ఈ పదవిలో ఉన్న వ్యక్తి పూర్తిగా అలంకారప్రాయమైన వ్యక్తి మాత్రమే.” గవర్నర్లు స్థానిక రాజకీయాలకు దూరంగా ఉండి, ఉన్నతస్థాయి వ్యక్తులుగా ఉండాలని,వారి జ్ఞానం, అనుభవం వైరుధ్యాలకు కారణం కాకుండా మార్గదర్శక శక్తిగా ఉండాలని చర్చల్లో పాల్గొన్న సభ్యులు నొక్కిచెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే,వారికి నిష్కళంకమైన నైతికత ఉండాలి.

అయితే,రాజ్యాంగ పరిషత్‌ చర్చల్లో వ్యక్తమైన ఆందోళనలు నేడు పూర్తిగా నిజమవుతున్నాయి.గవర్నర్లు, కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి రాజకీయ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారు.వారు, రోజువారీ పాలనలో జోక్యం చేసుకోవడం,బిల్లుల్ని అడ్డుకోవడం లేక జాగు చేయడం, రాజకీయ పక్షపాతాన్ని చూపించే బహిరంగ ప్రకటనలు చేయడం పెరుగుతోంది.వారి నియామకంలో లేక ఎంపికలో ఎలాంటి ప్రజాస్వామిక విధానం లేకుండా పోయింది.తమ పదవిని పూర్తిగా కేంద్ర కార్యనిర్వాహకుల నిర్ణయానికే వదిలేశారు.
గవర్నర్ల వలె కాక, రాష్ట్రపతిని పరోక్ష పద్ధతిలో పార్లమెంట్‌ ఉభయసభల,శాసనసభల ప్రతినిధులు ఎన్నుకుంటారు.దీని వలన కనీసం రాష్ట్రపతి పదవి,విశాల ప్రజాస్వామిక బాధ్యతకు లోబడి ఉంటుంది.అధికార పార్టీ మద్దతుతో ఎన్నికైన రాష్ట్రపతులైనా, పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాల్ని నిరవధి కంగా ఆమోదించకుండా అడ్డుకోవడం,రాష్ట్రపతి భవన్‌ను ఘర్షణల కేంద్రంగా మార్చడం వంటి చర్యలను చారిత్రాత్మకంగా నివారించారు.

అయితే రాజ్యాంగ ధర్మాసనం ఇప్పుడు ఈ రెండు పదవులు ఒకే విధమైన మినహాయింపులు పొందుతున్నట్లుగా,వారి శాసన సంబంధిత విధుల్ని న్యాయపరంగా పరిశీలించడం అనేది అధికార విభజన సూత్రాలకు విరుద్ధమవుతున్నట్టు వ్యవహరించింది. దీని వలన రాజకీయంగా ఆధారపడి, నియమించబడిన గవర్నర్‌ పదవి, రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునే సాధనంగా ఉపయోగపడుతుంది.
ఇంత స్పష్టంగా అధికార దుర్వినియోగం కనపడు తున్నప్పటికీ, రాజ్యాంగ ధర్మాసనం అధికారాల విభజన,సంస్థాగత సామరస్యం, న్యాయ నియంత్రణ లాంటి ఉన్నతమైన తాత్విక అంశాలపై చర్చను ఎంచుకుంది.ఆర్టికల్‌ 200,201 కింద గవర్నర్‌, రాష్ట్రపతి వినియోగించే అధికారాల్ని న్యాయపరంగా ప్రశ్నించలేమని తేల్చింది.గవర్నర్‌ నిర్ణయం తీసుకోవడానికి స్పష్టమైన కాల పరిమితిని నిర్దేశించిన తన పూర్వ తీర్పును కోర్టు ‘న్యాయ సంబంధమైన అతిక్రమణ’గా పేర్కొంటూ తిరస్కరించింది. రాజ్యాంగ వ్యవస్థ స్తంభించకుండా నివారించే తన బాధ్యత నుండి కోర్టు తప్పుకొని చేతులు దులిపేసుకుంది.

కోర్టులు రాజ్యాంగ పదవిలో ఉన్న వారిని ‘సహేతుకమైన కాల వ్యవధిలో’ చర్య తీసుకోవాలని ‘పరిమితమైన మార్గదర్శ కాలను’ మాత్రమే ఇవ్వగలవని, ఆ ‘సహేతుకమైన సమయం’ అంటే ఏమిటి, లేక అనవసరమైన జాగుకు పరిణామాలు ఏమిటో కోర్టులు నిర్దేశించవని ధర్మాసనం సూచించింది.నిర్దిష్టమైన కాల పరిమితి, లేక అమలు చేయగల ప్రమాణాలు లేకుండా ”సహేతుకత” అనే పదం నిరర్ధక పదంగా మారుతుంది.దీని వలన గవర్నర్లు బిల్లుల్ని తమ వద్దే నిలిపివేస్తారు.
ఈ పిరికి ధోరణి,ఎస్‌.ఆర్‌.బొమ్మై తీర్పు లాంటి చారిత్రక జోక్యాలతో పోలిస్తే పూర్తిగా విరుద్ధమైనది.ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అన్న విషయాన్ని గవర్నర్‌ సంతప్తి చెందడంపై ఆధారపడడం కాక, సభలో పరీక్షించాలని బొమ్మై తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది.ఆ నిర్ణయం,ఆర్టికల్‌ 356ను రాజకీయ దుర్వినియోగం చేయడం పై న్యాయ వ్యవస్థ యొక్క దఢమైన వైఖరిని సూచించింది. అది, కేంద్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగంలోని వికత రూపాన్ని నియం త్రించడంలో ప్రముఖ పాత్ర పోషించింది.
నేడు,గవర్నర్లు మళ్లీ సమాఖ్య ఉద్రిక్తతల కేంద్ర బిందువుగా మారారు.ఈసారి ప్రభుత్వా ల్ని బర్తరఫ్‌ చేయకుండా చట్ట సభల వ్యవహారాలకు అడ్డుపడుతున్నారు.అయితే కోర్టు,రాజ్యాంగ సమాఖ్య వ్యవస్థను దఢంగా రక్షించిన బొమ్మై తీర్పు మార్గాన్ని ఎంచుకోలేదు.ఎన్నుకోబడిన శాసనసభ అభీష్టం రాజ్యాంగ విరుద్ధం కానంతవరకు పైచేయిగా ఉండాలని నొక్కి చెప్పడానికి బదులుగా, ఈ సూచనాత్మక అభిప్రాయ తీర్పు, గవర్నర్‌ మౌనాన్ని సమీక్షించ వీలులేని ఒక రాజ్యాంగ విధానంగా మార్చుతుంది.

గడచిన పదకొండున్నరేండ్ల మోడీ ప్రభుత్వ పాలనలో భారతదేశ సమాఖ్య వ్యవస్థ నిరంతర ఒత్తిడికి గురైంది. అధికార కేంద్రీకరణకు,ఆర్థిక స్వతంత్రతను బలహీన పరిచేందుకు, సంస్థల స్వాధీనం ద్వారా,ఆర్థిక ఒత్తిడి ద్వారా రాజకీయ ప్రత్యర్ధులను బలహీనపరచడానికి వ్యవస్థాగతమైన ప్రయత్నా లతో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ఆటంకాలకు గురవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల నియంత్రణ కోసం గవర్నర్లను అదనపు సాధనంగా ఉపయోగిస్తూ ఉన్నారు.సంక్షేమం,విద్య,ఆరోగ్యం,సామాజిక న్యాయం లాంటి రంగాల్లో ప్రత్యామ్నాయ విధానాల్ని రూపకల్పన చేసే శాసనాల్ని, రాజ్యాంగపరమైన కారణాలతో కాక,కేంద్రంలో ఉన్న పాలక పార్టీ భావజాలానికి భిన్నంగా ఉన్నాయనే కారణంతో నిలిపి వేయడం, ప్రశ్నించడం జరుగు తోంది.రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్రం చెప్పుచేతల్లో ఉంటే మాత్రమే సమాఖ్య ఒడంబడిక గౌరవించబడుతుందనే సందేశం ఇక్కడ స్పష్టమవుతోంది. ఈ నిర్బంధ సమాఖ్య వ్యవస్థ,దూకుడు తనంతో కూడిన కేంద్రీకరణ ఉన్న పరిస్థితుల్లో అధికారాలను విభజించి,సంకుచిత వ్యాఖ్యలకు పరిమితం కావడం సుప్రీంకోర్టు బాధ్యత కాకూడదు. ప్రజాస్వామిక ఎంపికను బలోపేతం చేసి,రాష్ట్ర స్వతంత్రతను కాపాడే విధంగా కోర్టు,రాజ్యాంగాన్ని విశ్లేషించాలి.

ఆర్టికల్‌ 200,201లను వాస్తవంగా ప్రగతిశీలంగా వివరించి ఉండి ఉంటే, రాజ్యాంగ మౌనాలు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ఉపయోగించకూడదని గుర్తించేవి. గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్టమైన సమయ పరిమితి లోనే చర్యలు చేపట్టాల్సి ఉంటుందని,దానిలో విఫలమైతే,అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని,దానికి కోర్టులు సమర్ధవంతమైన పరిష్కారాల్ని రూపొందించగలవని అది ధ్రువీకరించి ఉండెడిది. కాల పరిమితుల్ని నిర్దేశించడానికి నిరాకరించడం ద్వారా,ఈ విషయంలో గవర్నర్‌ చర్యలు న్యాయ సమీక్ష పరిధికి అతీతమని ప్రకటించడం ద్వారా,సుప్రీంకోర్టు సలహా,ప్రస్తుత రాజకీయ తరుణం విసిరిన సవాలుకు ప్రతిస్పందన ఇవ్వడంలో విఫలమైంది.ఇది అధికారాల విభజన అనే సిద్ధాంతం పేరుతో ప్రజాస్వామ్య అస్తిత్వాన్ని త్యాగం చేసింది.అలా చేయడం ద్వారా రాజ్యాంగ సంస్థల్ని పక్షపాత ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్న వారికి మరింత ఊతం ఇచ్చింది.
గవర్నర్‌ పదవితో సహా రాజ్యాంగ పదవులన్నీ ప్రజాభీష్టానికి బాధ్యత వహించే రూపంలో ఉండాలని డిమాండ్‌ చేసే బాధ్యత ఇప్పుడు ప్రజాస్వామిక ఉద్యమం,ప్రగతిశీల రాజకీయశక్తులు, స్వతంత్ర మీడియా,ప్రజలపై ఉంది. రాజ్యాంగం ప్రజలది. ఎన్నుకోబడని వ్యక్తులు,లేక పక్షపాత ధోరణితో పార్టీ ప్రయోజనాల కోసం వ్యవహరించే వారి రాజ్యాంగం కాదు.దాని శక్తిని తిరిగి పొందడానికి రాజకీయ పోరాటం మాత్రమే కాదు,ప్రతీ ప్రభుత్వ, ఉన్నత న్యాయస్థానాలు సహా ప్రజాస్వామ్యం,ఫెడరలిజం,లౌకిక తత్వం,సామాజిక న్యాయ సూత్రాలకు అనుగుణమైన తమ వ్యాఖ్యానాలు, ఆచరణను పునర్నిర్మించే పట్టుదల కూడా అవసరం.
(”పీపుల్స్‌ డెమోక్రసీ” సౌజన్యంతో)
అనువాదం : బోడపట్ల రవీందర్‌, 9848412451

ఎం.ఏ.బేబి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -