ఇండిగో సంక్షోభంలో విమానయాన సంస్థల లాభార్జన శవాలపై పేలాలు ఏరుకున్నట్టు ఉంది. ఇండిగో విమానాలు వారం రోజులుగా వేల సంఖ్యలో రద్దయ్యాయి. లక్షలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు పడుతూ పడిన అవస్తలు అన్నీ ఇన్ని కావు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఇతర విమానయాన సంస్థలు టికెట్ల రేట్లను విపరీతంగా పెంచేయడంతో ప్రయాణికులది దిక్కుతోచని పరిస్థితి. రైల్వే స్టేషన్లకన్నా విమానాశ్రయాలు రద్దీగా మారిపోయాయి. ఎక్కడ చూసినా సూట్ కేసులే.. జనసమ్మర్దమే, విమానాలు అందని ప్రయాణీకులు ఇండిగో సిబ్బందిపై విరుచుకుపడ్డారు. అత్యవసర వైద్యచికిత్సలు, పెండ్లిళ్లు, పరీక్షలు, ఆఫీసు మీటింగులు, అంత్యక్రియలకు వెళ్లేవారు, ఇతర తప్పనిసరి పనులతో ప్రయాణాలు పెట్టుకున్నవారి నష్టాన్ని ఎవరు భర్తీచేస్తారు? భర్త మృతదేహన్ని అంత్యక్రియలకు స్వగ్రామానికి తీసుకెళ్తూ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న మహిళ ఆవేదన ఎంతటి హృదయ విదారకం. పైగా, వేచిఉన్న వారిని సత్వరం వారి గమ్యస్థానాలకు పంపాల్సిన ఇండిగో ఈ గిరాకీని కూడా సొమ్ముచేసుకోవడానికి ఇతర సంస్థల్లా భారీ ధరలకు టిక్కెట్లు విక్రయించడం ఎంతటి దారుణం! దగాకోరుతనం. ప్రజలు ఇన్నీ ఇక్కట్లు పడుతున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తూ ఉండటం మరీ ఘోరం.
పౌరవిమానయాన రంగంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఆ సంస్థ ముందస్తు సమాచారం లేకుండా సర్వీసులను ఇష్టారీతిగా నిలిపేస్తూ ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తోంది. చెకిన్ అయ్యాక విమానాల రద్దు తెలియడంతో గత్యంతరంలేక ప్రయాణికులు రోజుల తరబడి విమానాశ్రయాల్లో పడిగాపులు పడిన దుస్థితి. దేశీయ వైమానిక రంగంలో ఇండిగో గుత్తాధిపత్యం కారణంగానే ప్రస్తుత సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది? వైమానిక రంగం ఒక్కరిద్దరి చేతుల్లో ఉంటే ప్రమాదమని తెలిసినప్పటికీ కేంద్రం ఎందుకిలా చేసింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్(ఎఫ్‌డీటీఎల్) నిబంధనల నేపథ్యంలో ప్రస్తుత సంక్షోభాన్ని కావాలనే తెర మీదకు తీసుకొచ్చారా? ప్రభుత్వం బెదిరిపోయి రూల్స్ సడలించడం వెనుక కారణాలేంటి? గడిచిన వారం రోజులుగా కొనసాగుతున్న ఇండిగో సంక్షోభంపై ఇలా తలెత్తుతున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు?
దాదాపు ఇరవై ఏండ్ల కిందట ప్రారంభమైన ఇండిగో చౌకధరలతో ప్రయాణికులకు చేరువైంది. అదే సమయంలో అరకొర సిబ్బంది తోనే గొడ్డుచాకిరీ చేయిస్తుందన్న అపప్రదను మూటగట్టుకుంది. నాసిరకం సేవలు, ప్రయాణి కులతో దురుసు ప్రవర్తనపైనా గతంలో ఆ సంస్థపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిబంధనల అమలు పట్ల ఇండిగో తలబిరుసు తనంపై యంత్రాంగం ముందే కొరడా విదిల్చి ఉంటే ఈ సంక్షోభం ఇప్పుడొచ్చేది కాదు. ‘పైలట్ల కొరతతో పలు ఇండిగో విమానాలు రద్దయ్యాయి’ అనేది పైకి కనిపించే నిజం. కాని లోతుగా పరిశీలిస్తే తప్ప ఈ సంక్షోభానికి అసలు కారణాలు బోధపడవు. ప్రయాణ భద్రతను దృష్టిలో పెట్టుకుని పైలట్లు ఎంత సమయం విమానం నడపొచ్చు, ఎంత కాలం విశ్రాంతి తీసుకోవాలి, నైట్ డ్యూటీ తదితర అంశాలన్నిటితో ఎఫ్‌డిటిఎల్ నిబంధనలు డిజిసిఎ రూపొందిస్తుంది. సవరించిన ఆ నిబంధనలను 2024లో ప్రకటించి 2025 నవంబర్ ఒకటి నుండి అమలు చేయాలని గడువు విధించింది. వాటికి తగినట్టు కొత్తవారిని నియమించు కోని ఇండిగో నిర్వాకం వల్లే ఎయిర్‌పోర్టుల్లో ఈ ఆవేదనాత్మక పరిస్థితులు.
ప్రయాణికులను అష్టకష్టాల పాల్జేసిన ఆ సంస్థ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అటు కేంద్రం ఇంకా చిలక పలుకులు పలుకుతుందే తప్ప కఠిన చర్యలకు ఉపక్రమించడం లేదు. లక్షలాది మంది ప్రయాణికులకు మానసిక క్షోభను, నష్టాన్ని కలిగిచిన ఇండిగో పైకి క్షమాపణలు చెబుతూ మొసలికన్నీరు కారుస్తోందే తప్ప సంక్షోభానికి తెరదించేలా ఒక్క అడుగు కూడా వేయలేదు. వారంరోజుల తర్వాత తాపీగా స్పందించిన ప్రధాని మోడీ తన మంత్రి, మంత్రిత్వ శాఖ పనితీరును ప్రశంసించడం హస్యాస్పదంగా ఉంది. ఇంత జరిగినా కనీసం పశ్చాత్తాపం లేకుండా తిమ్మిని బమ్మిని చేస్తున్న ఫలితమిది. వేలాది మంది ప్రయాణీకులు కష్టాలు పడితేనేతప్ప నిజాలు బయటకు రాలేదు.
తన స్వార్థ ప్రయోజనాల కోసం దేశ పౌరవిమానయాన రంగాన్నే స్తంభింపజేసిన ఇండిగో… చివరికి నియమాల అమలు విషయంలో డీజీసీఏనే దిగొచ్చేలా చేయడం కార్పొరేట్ల గుప్పెట్లలో బంధీ అయిన వ్యవస్థల డొల్లతనాన్ని మరోసారి బట్టబయలు చేస్తుంది.ప్రభుత్వరంగంలో ఉండి ఉంటే ఈ పరిస్థితి దాపరించేది కాదు. హవారు చెప్పులు వేసుకు తిరిగేవారిని విమానం ఎక్కిస్తామని మోడీ ఎన్నోగొప్పలు చెప్పుకున్నారు. కానీ విమానాశ్రయంలో జనం చెప్పులు విసరడం మాత్రం సర్వత్రా కనిపించింది. ఇది ఇండిగో నేరపూరిత నిర్లక్ష్యానికి పరాకాష్ట. ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనం.
ఇండిగో సం’క్షోభం’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



