– మహిళా ఆధారిత అభివృద్ధికి గ్లోబల్, రోల్ మోడల్‌గా తెలంగాణ
– స్టార్టప్‌ల నుంచి సౌరశక్తి దాకా దూసుకెళ్తున్న మహిళా సంఘాలు
– 2047 నాటికి మహిళా శ్రామిక భాగస్వామ్యం 90 శాతమే లక్ష్యం : మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళలు స్వయం సమృద్ధితో ఎదిగితేనే ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతుందనీ, ఆ మార్పునకు తెలంగాణ నాయకత్వం వహిస్తోందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) నొక్కి చెప్పారు. మహిళా ఆధారిత అభివృద్ధికి గ్లోబల్, రోల్ మోడల్‌గా తెలంగాణ నిలుస్తోందన్నారు. సోమవారం ఫ్యూచర్‌సిటీలో ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో మంత్రి సీతక్క ప్రసంగించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏర్పాటైన మహిళా శక్తి క్యాంటీన్లు స్థిర ఆదాయ వనరులుగా మారాయన్నారు. స్కూల్ యూనిఫాం తయారీ, పాఠశాలల అభివృద్ధి పనులు, అద్దె బస్సుల నిర్వహణ, పెట్రోల్ బంకుల ఏర్పాటు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ మహిళలకు ఆదాయ మార్గాలను సృష్టిస్తున్నాయని వివరించారు. 32 జిల్లాల్లో మహిళల చేత ఏర్పాటు కాబోతున్న 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు దేశంలోనే తొలి ఉదాహరణగా నిలిచాయని వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు రూ.7,600 కోట్లను ఆదా చేసుకున్నారని తెలిపారు. మెప్మా, సెర్ప్‌లను ఏకీకృతం చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో జీడీపీలో మహిళల వాటా 40 శాతముంటే మన దేశంలో అది 20 శాతానికి కూడా చేరలేదని వాపోయారు. మహిళా శ్రామిక భాగస్వామ్యాన్ని 2047 నాటికి 90 శాతానికి పెంచడమే లక్ష్యంగా తమ ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతున్నదని చెప్పారు. పెట్టుబడిదారులు, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు తెలంగాణలో అవకాశాలు అన్వేషించాలనీ, పెట్టుబడులు పెట్టాలని కోరారు.
మార్పునకు తెలంగాణ నాయకత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



