Tuesday, December 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో గ్రామ పాలన నిర్వీర్యం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో గ్రామ పాలన నిర్వీర్యం

- Advertisement -

ప్రజా సమస్యల పరిష్కారం ఎర్రజెండాతోనే సాధ్యం:
సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి
పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
జనగామ జిల్లా పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
నవతెలంగాణ-జనగామ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో గ్రామ పరిపాలన పూర్తిగా నిర్వీర్యమైందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జనగామ జిల్లాలోని పలు గ్రామాల్లో పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థుల తరపున జాన్‌వెస్లీ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రఘునాథపల్లి మండలం శ్రీమన్నారాయణపురం గ్రామపంచాయతీ సీపీఐ(ఎం) బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మినలాపురం మహేందర్‌, నిడిగొండ గ్రామపంచాయతీకి పోటీ చేస్తున్న వంగాల ఎల్లేష్‌, లింగాల ఘన్‌పూర్‌ మండలం కళ్లెం గ్రామంలో పార్టీ సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మబ్బు ఉపేంద్ర ఉప్పలయ్యను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో గ్రామాల సుపరిపాలన కుంటుపడిందన్నారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పోరాడి సాధించుకున్న వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం.. తదితర చట్టాలను నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలకే పరిమితమవుతున్నాయి తప్ప అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేక ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారని తెలిపారు. దాంతో వీధిలైట్లు, రోడ్ల సమస్య, మురికి నీరు తొలగింపు, డ్రయినేజీ తదితర సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామ సుపరిపాలన అందిస్తున్న కేరళ రాష్ట్రం దేశానికి ఆదర్శమన్నారు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్‌లో 50 శాతం నిధులను గ్రామాల అభివృద్ధికి కేటాయిస్తున్నారని, వాటిని ఖర్చు చేసే అధికారం గ్రామపంచాయతీలకే ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. అలాంటి స్వయంపాలన ప్రజలకు అందాలంటే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌, జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇర్రి అహల్య, రాపర్తి రాజు, బొట్ల శేఖర్‌, జిల్లా కమిటీ సభ్యులు జోగు ప్రకాష్‌, పల్లెర్ల లలిత, పందిర్ల కళ్యాణి, మండల కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామకంఠం భూములు ప్రయివేటీకరించొద్దు తక్షణమే లీజు ఒప్పందాన్ని రద్దు చేయాలి : సీపీఐ(ఎం)
రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 12వేల గ్రామ పంచాయతీలకు చెందిన గ్రామకంఠం భూములను 30 ఏండ్ల పాటు ఐవోఆర్‌ఏ ఎకోలాజికల్‌ సొల్యూషన్‌ ప్రయివేటు సంస్థకు అప్పజెప్పడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. పాలక మండళ్ళు లేని సమయంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం నిరభ్యంతర పత్రాలు తీసుకోవాలనడం అప్రజాస్వామికమనీ, వేలాది కోట్ల ఆస్తులను ప్రయివేటు సంస్థకు కట్టబెట్టడం వెనుక భారీ కుంభకోణం జరుగుతున్నదనే సందేహం వ్యక్తమవుతున్నదని పేర్కొంది. ఈ ఒప్పందం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగంలోని 73వ సవరణ స్పూర్తికి పూర్తి విరుద్ధమని ఎత్తిచూపింది. తక్షణమే ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. సోమవారం ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. హరిత సౌభాగ్యం ప్రాజెక్టు పేరుతో గ్రామ కంఠం భూములను ఢిల్లీకి చెందిన ఒక ప్రయివేటు కంపెనీకి కట్టబెడితే గ్రామపంచాయితీలు తమ హక్కులను, ఆదాయాలను కోల్పోతాయి. దీని వల్ల భవిష్యత్‌ తరాల కోసం ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశానవాటికలు, పేదల పునరావాసం, తదితర ప్రజా అవసరాలకు భూములు లేకుండా పోతాయి’ అని ఎత్తిచూపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. భూముల విలువ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామకంఠాలపై పూర్తి హక్కులు పంచాయతీలకే ఉండేలా చూడాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -