Tuesday, December 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎర్రజెండానే కార్మికులకు అండ…

ఎర్రజెండానే కార్మికులకు అండ…

- Advertisement -


కార్మికుల విరాళాలతోనే మహాసభ : సీఐటీయూ మహాసభలో ఆహ్వాన సంఘం అధ్యక్షుడు చుక్క రాములు

మెదక్‌ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ ఎర్రజెండాయే అండ అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. ఆ సంఘం రాష్ట్ర ఐదో మహాసభల సందర్భంగా మెదక్‌ పట్టణంలోని రఘుపాల్‌, జీటీగోపాల్‌రావు (వినాయక పంక్షన్‌ హాల్‌) ప్రాంగణంలో సోమవారం ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా చుక్క రాములు ఎర్రజెండాను ఎగురవేశారు. ‘ఓ అరుణపతాకమా..నీకివిగో మా రెడ్‌ సెల్యూట్‌.. శ్రమజీవుల కేతనమా..నీకివిగో మా రెడ్‌ సెల్యూట్‌ …’ అనే గీతాలాపన సాగుతుండగా సీఐటీయూ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ కె హేమలత, తపన్‌సేన్‌, కోశాధికారి ఎం సాయిబాబు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌తోపాటు ప్రతినిధులందరూ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.
అనంతరం మహాసభల ఆహ్వాన సంఘం చైర్మెన్‌ చుక్క రాములు అధ్యక్షోపన్యాసం చేశారు. మెదక్‌ జిల్లా సీిఐటీయూ ఉద్యమం ప్రధానంగా అసంఘటిత రంగం, స్కీం వర్కర్లు, కొన్ని పారిశ్రామిక యూనియన్లతో కొనసాగుతున్నదని తెలిపారు. ఇక్కడి ఉద్యమం సంఖ్య రీత్యా చిన్నదైనప్పటికీ రాష్ట్ర మహాసభ నిర్వహణ బాధ్యతను తీసుకోవడం ద్వారా జిల్లాలో కార్మికులందరినీ కదిలించేందుకు దృఢమైన దీక్షతో కృషి చేసిందని చెప్పారు. జిల్లాలో కాళ్ళకల్‌, శివంపేట, తూఫ్రాన్‌, చేగుంట, చిన్న శంకరంపేట, నర్సాపూర్‌ ప్రాంతాల్లో పరిశ్రమలున్నాయని వివరించారు. ఇక్కడి పారిశ్రామిక ప్రాంతాల్లో దేశంలోని అనేక రాష్ట్రాల నుండి కార్మికులు వలసొచ్చి ఉపాధి పొందుతున్నారని చెప్పారు. రామాయంపేట, మెదక్‌, చేగుంట ప్రాంతాల్లో బీడీ కార్మికులు గణనీయంగా ఉన్నారని వివరించారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోకి పనుల కోసం కార్మికులు వెళుతున్నారని తెలిపారు. పారిశ్రామిక కార్మికులతో పాటు బీడీ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ రాష్ట్ర మహాసభల సందర్భంగా జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉన్న కార్మికులతో గ్రామ సమన్వయ కమిటీలు వేయడానికి పట్టుదలగా కృషి చేశామని వివరించారు. మొత్తం 492 గ్రామాల్లోకమిటీలు వేశామని తెలిపారు. కార్మికులు చూపిన ఈ చొరవ జిల్లా ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందన్నారు. అంగన్‌వాడీ, ఆశా, బీడీ, ఎలక్ట్రిసిటీ, గ్రామ పంచాయతీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో పాటు స్క్రీం వర్కర్లు, ఇండస్‌ మెడికేర్‌, కావేరి, నియోపోలీ, డైమండ్‌ హాచరి వంటి పరిశ్రమ యూనియన్లు మహాసభల నిర్వహణ కోసం విరాళాలు అందించాయని తెలిపారు. అంగన్‌వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ, బీడీ కార్మికుల వేతనాల నుండి వసూలు చేసిన నిధుల నుండే రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని చుక్క రాములు
ఈ సందర్భంగా చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -