Wednesday, December 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభవిష్యత్‌లో పోలీస్‌శాఖలో డ్రోన్ల పాత్ర కీలకం

భవిష్యత్‌లో పోలీస్‌శాఖలో డ్రోన్ల పాత్ర కీలకం

- Advertisement -

సమ్మక్క, సారక్క జాతరలో వినియోగిస్తాం : గ్లోబల్‌ సమ్మిట్‌లో డీజీపీ
నవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధి

నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరరక్షణ, ట్రాఫిక్‌ నియంత్రణ కోసం డ్రోన్లను వినియోగించనున్నామని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మీర్‌ఖాన్‌పేట్‌లో జరుగుతున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన పోలీస్‌ స్టాల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు డ్రోన్ల ఉపయోగాలను ఆయన ఆసక్తిగా పరిశీలన చేశారు. గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రాంగణంలో సైతం 10 డ్రోన్లతో ట్రాఫిక్‌ నియంత్రణ, పరిసరాలపై నిఘాను పర్యవేక్షించడం జరి గిందని అధికారులు డీజీపీకి వివరించారు. వాటి పనితనాన్ని పరిశీలించిన డీజీపీ ఇకముందు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల దర్యాప్తు, ట్రాఫిక్‌ నియంత్రణ విషయంలో డ్రోన్లను విరివిగా వినియోగించడానికి అవసరమైన అవకాశాలను అన్నింటినీ పరిశీలిస్తామని తెలిపారు. రాబోయే సమ్మక్క, సారక్క భారీ జాతరలో విచ్చేసే లక్షలాది మంది భక్తులను నియంత్రించే విషయంలోనూ, పరిసరాలపై నిఘా వేయడానికి డ్రోన్లను వినియోగిస్తామని ఆయన తెలిపారు. అలాగే నేరాలు జరిగినప్పుడు దర్యాప్తు అధికారులు ఆ ప్రాంతానికి చేరుకునేలోగా అక్కడి పరిస్థితులను, వాతావరణాన్ని వెంటనే అధికారులకు తెలియజేసేలా డ్రోన్లను వినియోగిస్తామని ఆయన తెలిపారు. మొత్తానికి పోలీస్‌ శాఖ విధుల్లో డ్రోన్ల ఉపయోగం భవిష్యత్తులో మరింత కీలకం కానున్నాయని శవధర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా పోలీస్‌ శాఖ స్టాల్‌ ను పరిశీలించాక ఆయన అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ ను సందర్శించారు. అక్కడ గ్లోబల్‌ సమ్మిట్‌కు ఏర్పాటు చేసిన బందోబస్తును సీసీ కెమెరాల ద్వారా ఆయన పరిశీలించారు. ముఖ్యంగా డ్రోన్‌ కెమెరాల నుంచి కమాండ్‌ కంట్రోల్‌కు ఏ విధంగా సమాచారం అందుతున్నది ఆయన పరిశీలించారు. మొత్తం 6 వేల మంది పోలీసులతో ఏర్పాటు చేసిన బందోబస్తు వివరాలను అధికారుల నుంచి డీజీపీ తెలుసుకున్నారు. కాగా, ఇటీవలనే రిక్రూట్‌ అయిన 115 మంది ప్రొబేషనరీ డీఎస్పీలను బందోబస్తులో వినియోగిస్తున్న తీరును కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా విదేశీ ప్రతినిధులకు లైజన్‌ అధికారులుగా 30 మంది ప్రొబేషనరీ డీఎస్పీలను నియమించడాన్ని ఆయన అభినందించారు. అలాగే ఈ బందోబస్తులో ముగ్గురు అదనపు డీజీలు, 10 మంది ఐజీలు, 10 మంది ఎస్పీ స్థాయి ఐపీఎస్‌ అధికారులను పర్యవేక్షణ అధికారులుగా నియమించడం జరిగిందని ఈ సందర్భంగా డీజీపీ తెలిపారు. రెండు రోజుల పాటు సాగిన అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రశాంతంగా ముగియడానికి పోలీస్‌ అధికారులు మొదలుకొని సిబ్బంది వరకు నిర్విరామంగా చేసిన కృషిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన వెంట శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌, రాచకొండ కమిషనర్‌ సుధీర్‌ బాబు తదితర అధికారులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -