– షెడ్యూల్ పరిశ్రమల కార్మికులకు కనీసవేతనాలివ్వాలి
– లేబర్‌కోడ్‌ల రద్దు కోసం ఐక్య ఉద్యమాలు
– వీటిని అమలు చేయబోమన్ని అసెంబ్లీలో తీర్మానం చేయాలి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ
– మహాసభలో ఆమోదించిన తీర్మానాలు వెల్లడి
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
కార్మికులకు నష్టం కలుగజేసే శ్రమశక్తి నీతి-2025ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఐదవ మహాసభల తీర్మానాలను రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములుతో కలిసి ఆమె వివరించారు. రాష్ట్ర మహాసభల్లో అనేక రంగాల సమస్యలు, ప్రభుత్వ విధానాల మీద భవిష్యత్తు పోరాటాలు ఎలా ఉండాలనే కొన్ని డిమాండ్లతో కూడిన తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు తెలిపారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రం నాలుగు లేబర్ కోడ్‌లుగా చేసి నవంబర్ 21వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు. ఈ లేబర్ కోడ్‌లను అమలు చేస్తామని కొన్ని రాష్ట్రాలు అమల్లోకి వెళ్లాయన్నారు. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లపై విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, రాష్ట్రంలోనూ లేబర్ కోడ్‌ల రద్దు కోరుతూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. అలాగే, శ్రమశక్తి నీతి-2025ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. 73 షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కోటీ 20 లక్షల మందికి కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాల జీఓలను సవరించాలని కేంద్ర కార్మిక సంఘాలన్నీ అనేక సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాయని, అయినా వేతనాలు పెంచకుండా పని గంటలు పెంచుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు మినిమం వేతనం రూ.176 ఇస్తే సరిపోతుందని ప్రధాని ప్రకటించారని, దాని ప్రకారం రూ.5000లోపే నెలకు వస్తుందని, దాంతో కార్మికుల జీవితాలు గడపడం కష్టంగా ఉంటుందన్నారు. కాబట్టి కనీస వేతనాన్ని రూ.26వేలకు పెంచాలని మహాసభలో తీర్మానం చేసినట్టు చెప్పారు. సీఐటీయూ కార్మికవర్గ ప్రయోజనాల కోసమే పనిచేస్తోందన్నారు.
కార్మికులను ఐక్యం చేసి ప్రభుత్వంపై పోరాటం : వంగూరు రాములు
సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు తెలిపారు. ప్రధానంగా అసంఘటిత కార్మికులపై మహాసభలో చర్చించినట్టు చెప్పారు. అసంఘటిత కార్మికులంటే ఒకే రకమైన పని అనేకమంది యజమానుల కింద చేసేవాళ్లన్నారు. భవన నిర్మాణ, హమాలీ, బీడీ, ట్రాన్స్‌పోర్టు, హౌటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసేవారు, తోపుడు బండ్లు, గ్రానైట్.. తదితర రంగాల అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత చట్టం కావాలని దశాబ్దాలుగా పోరాడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. 2008లో అప్పటి కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత చట్టాన్ని తెచ్చినా.. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దానికి రూల్స్ రూపొందించకుండానే ఆ చట్టాన్ని రద్దు చేశాయని అన్నారు. ప్రస్తుతం సామాజిక భద్రత అంశం లేబర్ కోడ్లలో కలిపేసిందన్నారు. భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో 30లక్షల మంది ఉన్నారని, వీరికి 1996 కేంద్ర చట్టం ప్రకారం రాష్ట్రంలో వెల్పేర్ బోర్డు ఏర్పాటు చేసిందని, కానీ వారికి ఎలాంటి ఉపయోగం లేదని తెలిపారు. ఈ సమస్యపైనా మహాసభలో తీర్మానం చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో సీఐటీయూ మెదక్ జిల్లా అధ్యక్షులు ఎ.మల్లేశం పాల్గొన్నారు.
శ్రమశక్తి నీతి 2025 రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



