నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్ బస్సు ట్రక్కును ఢీ కొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో జైపూర్-బికనీర్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఫతేపూర్ సమీపంలో ఒక స్లీపర్ బస్సు ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. మృతులతో పాటు 28 మంది గాయపడ్డారు, వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని ఫతేపూర్ ఎస్.హెచ్.ఓ మహేంద్ర కుమార్ వెల్లడించారు.
ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు యాత్రికులతో వైష్ణో దేవి యాత్ర ముగించుకుని, ఖాటు శ్యామ్ జీ వైపు పయనిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



