నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాన సమాచార కమిషనర్ (CIC) ఎంపిక కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ బుధవారం సమావేశమవుతోంది. తదుపరి సీఐసీని నిర్ణయించేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఖాళీగా ఉన్న ఎనిమిది సమాచార కమిషనర్ల నియామకాలను కూడా కమిటీ నిర్ణయిస్తుంది.
సీఐసీలోని టాప్ పోస్టుల ఎంపికకు పీఎం సారథ్యంలోని కమిటీ బుధవారం సమావేశమవుతుందని కేంద్రం ఇటీవల సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 12(3) కింద చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్ నియామకాలకు పేర్లను ఈ కమిటీ ఎంపిక చేసి తమ సిఫార్సులను రాష్ట్రపతికి పంపుతుంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత నియామక ఉత్తర్వులు జారీ అవుతాయి.



