నవతెలంగాణ-హైదరాబాద్: జైలులో ఉన్న జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ జర్నలిస్టుల రక్షణ కమిటీ (సిపిజె) ప్రధాని మోడీకి లేఖ రాసింది. డిసెంబర్ 10 (బుధవారం) అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జర్నలిస్టుల అంశంపై దృష్టిసారించాలని ఆ లేఖలో కోరింది.
” జర్నలిస్టులపై నిరంతర నిర్బంధం, వేధింపులు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మరియు మూడవ ప్రపంచ దేశాలకు ప్రముఖ స్వరంగా ఉన్న భారతదేశ ఖ్యాతిని దెబ్బతీసే ప్రమాదం ఉంది” అని సిపిజె పేర్కొంది. ”అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, భారత్‌లో ఖైదు చేయబడిన జర్నలిస్టులను వారి కుటుంబాలతో తిరిగి కలుసుకునేలా మరియు ప్రతీకార చర్యలకు భయపడకుండా వారి పనిని స్వేచ్చగా కొనసాగించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము” అని లేఖలో పేర్కొంది.
భారతదేశం భద్రత, ఉగ్రవాద వ్యతిరేక, రాష్ట్రస్థాయి క్రిమినల్ ఆరోపణలతో జార్ఖండ్‌కి చెందిన రూపేష్ కుమార్ సింగ్ అనే స్వతంత్ర జర్నలిస్టును బంధించింది. ఆయన పాట్నాలోని ఆదర్శ్ సెంట్రల్ జైలులో మూడేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనకు అధిక కొలెస్ట్రాల్, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వైద్యం అందించడం లేదని, తగిన ఆహారం ఇవ్వలేదని, బయటకు రాకుండా ఎక్కువ గంటలు సెల్‌లోనే నిర్బంధించారని కుటుంబసభ్యులు తెలిపినట్లు సిపిజె పేర్కొంది. మరో జర్నలిస్టు ఇర్ఫాన్ మెరాజ్‌ది అదే పరిస్థితని తెలిపింది. 2021-23 మధ్య భారతదేశంలో జైలు శిక్ష అనుభవిస్తున్న జర్నలిస్టుల సంఖ్య గరిష్టస్థాయి ఏడు నుండి తగ్గినప్పటికీ, 2014 నుండి సుమారు 15మంది జర్నలిస్టులపై ఉపా చట్టం కింద దర్యాప్తు జరిగిందని తెలిపింది. భారతదేశం అంతర్జాతీయ పౌర మరియు రాజకీయ హక్కుల ఒడంబడికపై సంతకం చేసిందని.. తన అంతర్జాతీయ మరియు దేశీయ మానవ హక్కుల బాధ్యతలను నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేసింది.
భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(ఎ) కింద వాక్‌స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇస్తుంది మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో స్వతంత్ర పత్రికా యంత్రాంగం పోషించే కీలక పాత్రను గతంలో వచ్చిన ప్రభుత్వాలు గుర్తించాయని పేర్కొంది. ప్రధానిగారూ.. ప్రజాస్వామ్యం మన డిఎన్‌ఎలోనే ఉందని, మొత్తం దేశం ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలపై నడుస్తుందని మీరు చెప్పారు. జర్నలిస్టులు ధైర్యంగా వాస్తవాలను నివేదించే హక్కుతో సహా ఈ విలువలను నిలబెట్టాలని మీ ప్రభుత్వాన్ని కోరుతున్నామని సిపిజె లేఖలో స్పష్టం చేసింది.
ఈ సంవత్సరం 100కి పైగా దేశాల నుండి 1,500 మందికి పైగా జర్నలిస్టులు సిపిజెకి సంఘీభావం ప్రకటించారు. ప్రపంచంలోని పలు ప్రభుత్వాలు, ముఖ్యంగా భారతదేశం జర్నలిస్టులపై క్రూరమైన చట్టాలను వినియోగించడాన్ని ఆపాలని, పత్రికలపై దాడులను అడ్డుకోవాలని, నిందితులకు శిక్ష విధించకుండా స్వేచ్చగా వదిలివేయడాన్ని అంతం చేయాలని కోరింది.



