నవతెలంగాణ – కంఠేశ్వర్
నేడు మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించుకుందామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ పిలుపునిచ్చారు. బుధవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కులాలకు అతీతంగా, బంధుత్వాలకు అతీతంగా, ప్రలోభాలకు అతీతంగా, మనస్సాక్షిగా బీసీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకుందాం, మన సత్తా చాటుదామని నరాల సుధాకర్ అన్నారు. జనాభాలో దాదాపు 60 శాతం ఉన్న మనకు 42 శాతం రిజర్వేషన్లు రాబోతుండగా అడ్డుకున్న కొందరు అగ్రవర్ణాల దుర్హంకారులకు బుద్ధి చెప్పాలంటే బీసీ కులస్తులందరూ కూడా ఏకమై కులాలకు అతీతంగా గెలిచే బీసీ అభ్యర్థులకు ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి సర్పంచులుగా బీసీ అభ్యర్థులను గెలిపించాలని నరాల సుధాకర్ అన్నారు.
బీసీ లందరూ ఏకమైతే దాదాపు 70% పంచాయతీలను వశం చేసుకోవచ్చని అన్నారు. మనం సింహభాగం పంచాయతీలను గెలుచుకుంటే అప్పుడు బీసీ ద్రోహులకు గుణపాఠం చెప్పిన వాళ్లమవుతామని అన్నారు. మనం ఎక్కువ గ్రామపంచాయతీలు గెలుచుకుంటే అప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరుచుకొని మనకు న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్లు దామాషా ప్రకారం ఇస్తాయని అన్నారు. భవిష్యత్తులో మనకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కాలంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో మన ప్రభావం చూపాలి కాబట్టి సెంటిమెంట్లకు, ఆర్థిక బలానికి, ఎమోషన్స్ మనోభావాలకు, ప్రలోభాలకు లొంగకుండా మన బీసీ జాతి కొరకు ఏకం కావాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నరాల సుధాకర్ తో పాటు ఆకుల ప్రసాద్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, వాసం జయ, బసవ సాయి, బాలన్న, సురేందర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.



