సొసైటీ అధ్యక్ష పదవికి కర్నాటి రామకోటేశ్వరరావు రాజీనామా
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని కలకోట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన అధ్యక్షుడిగా మారేపల్లి రాధాకృష్ణ ను పాలకవర్గం ఎన్నుకుంది. కలకోట సొసైటీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం బుధవారం జరిగింది. నేటి వరకు సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న మధిర ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు రాయన్నపేట కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో కలకోట సొసైటీ అధ్యక్ష పదవికి కర్నాటి రామకోటేశ్వరరావు రాజీనామా చేశారు. కర్నాటి రామకోటేశ్వరరావు రాజీనామా చేయటంతో నూతన అధ్యక్ష ఎన్నిక అనివార్యమైంది.
సొసైటీ ఉపాధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ కు చెందిన మారేపల్లి రాధాకృష్ణ ను నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. తనను నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మాజీ అధ్యక్షుడు కర్నాటి రామకోటేశ్వరరావు, పాలకవర్గం డైరెక్టర్లకు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పైడిపల్లి కిషోర్ కుమార్ కు మారేపల్లి రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కర్నాటి రామకోటేశ్వరరావు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలపాటు తనకు సహకరించిన పాలకవర్గ సభ్యులకు రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో సహకార సంఘ అభివృద్ధికి తన శక్తి మేరకు కృషి చేశాను అన్నారు. మారేపల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తన పదవీకాలంలో కలకోట సొసైటీ అభివృద్ధికి రైతుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. కర్నాటి రామకోటేశ్వరరావు ప్రారంభించిన అన్ని పనులను పూర్తి చేస్తానన్నారు.



