నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మీని సెమినార్ ఆల్ లో బోటనీ విభాగం ఆధ్వర్యంలో “హెర్బేరియం ప్రిపరేషన్ అండ్ గైడెడ్ నేచర్ వాక్‌లు” అనే హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. బోటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (బిఎస్ఐ), డెక్కన్ రీజినల్ సెంటర్, హైదరాబాద్‌కు చెందిన సైంటిస్ట్–ఈ మరియు హెడ్ ఆఫ్ ఆఫీస్ డా. ఎల్. రాసింగం ఈ కార్యక్రమంలో రెండు ప్రత్యేక ఉపన్యాసాలను చేశారు. ఎంఎస్సీ బోటనీ విద్యార్థులు, అధ్యాపకులు, గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మొదటి సెషన్‌లో, “బోటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (BSI): భారతదేశంలో టాక్సానమిక్ పరిశోధన & కన్జర్వేషన్‌లో పాత్ర” అనే అంశంపై డా. రాసింగం గారు ప్రసంగించారు. 1787లో కోల్కతాలో ‘కంపెనీ బగాన్’ స్థాపన నుండి స్వాతంత్ర్యానంతరం ప్రసిద్ధ శాస్త్రవేత్త డా. ఈ.కే. జనకి అమ్మాళ్ ఆధ్వర్యంలో BSI పునర్వ్యవస్థీకరణ వరకు జరిగిన చారిత్రక పరిణామాలను వివరించారు. ప్రస్తుతం బిఎస్ఐ దేశవ్యాప్తంగా 12 ప్రాంతీయ కేంద్రాలతో పనిచేస్తూ, 25 లక్షలకు పైగా మొక్కల నమూనాలను కలిగిన సెంట్రల్ నేషనల్ హెర్బేరియంను నిర్వహిస్తోందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాలకు సేవలందించే డెక్కన్ రీజినల్ సెంటర్ కార్యకలాపాలను వివరించారు. ఈ కేంద్రం విస్తృత ఫ్లోరిస్టిక్ సర్వేలు, డిజిటైజేషన్, హెర్బేరియం అభివృద్ధి వంటి పనుల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నదని చెప్పారు.ఫ్లోరా ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్, శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్, కావల్ టైగర్ రిజర్వ్, ఈస్టర్న్ ఘాట్స్ ప్రాంతాలపై చేసిన అధ్యయనాలు, 40కు పైగా కొత్త జాతుల గుర్తింపు, ఒక కొత్త జనస్ వివరణ, 130కి పైగా శాస్త్రీయ పత్రాల ప్రచురణ వంటి బిఎస్ఐ ప్రధాన విజయాలను కూడా ప్రస్తావించారు.రెండో సెషన్‌లో, డా. రాసింగం హెర్బేరియం టెక్నిక్స్ పై ప్రాయోగిక ఉపన్యాసం ఇచ్చారు.
మొక్కల నమూనాలను సేకరించడం, ప్రెస్ చేయడం, ఆరబెట్టడం, రసాయన శాస్త్రీయంగా సంరక్షించడం, మౌంటింగ్, లేబులింగ్ వంటి శాస్త్రీయ విధానాలను విద్యార్థులకు వివరిస్తూ ప్రదర్శనలు ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3,400కు పైగా హెర్బేరియా, 360 మిలియన్ల నమూనాల నెట్‌వర్క్ మరియు సిఎఎల్,ఎంహెచ్, బిఎస్ఐడి వంటి భారతదేశ ప్రముఖ హెర్బేరియాల ప్రాముఖ్యతను వివరించారు.
కార్యక్రమంలో బోటనీ విభాగాధిపతి డా. అహ్మద్ అబ్దుల్ హలీమ్ ఖాన్, సీనియర్ ప్రొఫెసర్ & బోస్ చైర్పర్సన్ ప్రొ. ఎం. అరుణ, ప్రొ. బి. విద్యావర్ధిని, డా. డి. శ్రీనివాస్, డా. వి. జలందర్ పాల్గొన్నారు. గిర్రాజ్ గవర్నమెంట్ కాలేజీ నుండి డా. టి. చంద్రశేఖర్, శ్రీ గంగాధర్ ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.



