Thursday, December 11, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిస్థానిక సంస్థల అధికారాలు- ఆదర్శ కేరళ

స్థానిక సంస్థల అధికారాలు- ఆదర్శ కేరళ

- Advertisement -

స్వాతంత్య్రానంతరం దేశంలో గ్రామీణాభివృద్ధి కోసం కొన్ని పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా వి.టి కృష్ణమాచార్య కమిటీ చేసిన సిఫారసుల మేరకు 1952 అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా దేశంలోని 55 పంచాయతీ సమితిలలో ప్రారంభించిన పథకాలూ ఆశించిన ఫలితాలివ్వలేదు. దాంతో 1953లో బల్వంత్‌ రాయ్‌ మెహతా అధ్యక్షతన ఏర్పాటుచేసిన కమిటీ, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ పేరుతో 1957 నవంబర్‌లో నివేదిక సమర్పించింది. 1958 జనవరిలో జాతీయాభివృద్ధి మండలి ఆ కమిటీ సిఫారసులను ఆమోదించింది. పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం పెంచడానికి మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను నెలకొల్పాలని సూచించింది.

గ్రామస్థాయిలో గ్రామపంచాయతీ, బ్లాక్‌ స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా యూనిట్‌గా జిల్లా ప్రజాపరిషత్‌ లను ఏర్పర్చాలని నివేదికలో పొందుపరిచింది. ఈ సూచనల ఆధారంగా 1959 అక్టోబర్‌ 2న మొట్టమొదటిసారి రాజస్థాన్‌ రాష్ట్రంలోని నాగోర్‌ జిల్లాలో, తదుపరి సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కూడా నాటి ప్రధాని నెహ్రూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున పంచాయతీరాజ్‌ వ్యవస్థను ప్రారంభించారు. ఈ విధానంలో కొన్ని రాష్ట్రాలు జిల్లా ప్రజాపరిషత్‌కు ప్రాధాన్యమిస్తే మరి కొన్ని రాష్ట్రాలు పంచాయతీ సమితిలకు ప్రాధాన్యమిచ్చాయి. మరికొన్ని రాష్ట్రాలు పంచాయతీరాజ్‌ సంస్థలకు అసలు ప్రాధాన్య మివ్వకపోవడం, నిర్ణీత కాలంలో ఎన్నికలు జరగకపోవడంతో స్థానిక సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

చట్టం అమలులో పాలకవర్గాల నిర్లక్ష్యం
ఈ నేపథ్యంలో 1977 డిసెంబర్‌లో జనతా పార్టీ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థలోని లోపాలను పరిశీలించింది. దాన్ని పునర్వ్యవస్థీకరించి పటిష్టం చేయడానికి అశోక్‌ మెహతా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ 1978 ఆగస్టులో 132 సిఫారసులతో ఒక నివేదికను అందజేసింది. జనతా పార్టీ అధికారం కోల్పోయాక ఏర్పడిన ప్రభుత్వాలు ఈ నివేదికను పట్టించుకోలేదు. మళ్లీ 1986లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎం.ఎల్‌ సింఘ్వీ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. సకాలంలో ఎన్నికలు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గ్రామ పంచాయతీలను వ్యవస్థీకరించాలని, ప్రజలకు భాగస్వామ్యం ఉండే విధంగా గ్రామసభ ఏర్పాటు, మరిన్ని ఎక్కువ నిధులివ్వాలని సిఫారసు చేసింది. ఈ క్రమంలో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా 1993 ఏప్రిల్‌ 20న రాష్ట్రపతి ఆమోదం పొంది, ఏప్రిల్‌ 24 నుంచి అమల్లోకి వచ్చింది.

1994లో 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీ చట్టాలను సవరించింది. ఈ సవరణల ద్వారా గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాఇష్టాలపై కాకుండా రాజ్యాంగబద్ధమైన సంస్థలుగా ఉనికిలోకి వచ్చాయి. దీని ప్రకారం విధిగా ప్రతి ఐదేండ్లకు ఒకసారి ఎన్నికలు జరపాలి. శాసనసభ, లోకసభ, రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినపుడు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆరు మాసాలలో ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇదే విధంగా గ్రామపంచాయతీ, స్థానిక సంస్థలకు ప్రతి ఐదేండ్లకు ఎన్నికలు జరపాలనే లక్ష్యంతో ఈ సవరణ తెచ్చింది. ఈ సవరణ చట్టం అమల్లో ఉన్నప్పటికీ పాలకవర్గాలు వారి రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఎన్నికలు జరపడం లేదు.

మే 2024తో మన రాష్ట్రంలో గ్రామపంచాయతీల కాలపరిమితి ముగిసింది. కానీ 2025 డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో ఆమోదం పొందిన బిల్లును గవర్నర్‌ అంగీకారం తెలపకుండా రాష్ట్రపతికి పంపారు. ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ స్థితిలో గ్రామపంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్‌లో జరపాలని ఆదేశించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కానీ 42 శాతం బీసీ రిజర్వేషన్‌ను పార్లమెంట్‌ ఆమోదించకపోవడంతో మూడు మాసాలు ఎన్నికల జాప్యం జరిగింది. చివరికి గతంలో అమల్లో ఉన్న యాభైశాతం రిజర్వేషన్‌ను అతిక్రమించకుండా మొదటి దశలో 4,236, రెండో దశలో 4,332, మూడో దశలో 4,158 మొత్తం 12,726 గ్రామపంచాయతీలకు, 1,12,222 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.

అధికారాలకు కేంద్రం కత్తెర
రాజ్యాంగబద్దంగా ఏర్పాటైన పంచాయతీరాజ్‌ వ్యవస్థ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారం స్థానిక సంస్థలకు కల్పించింది. స్థానిక పాలనా వ్యవస్థలకు సంబంధించి, 29 అంశాలను గ్రామ పంచాయతీలకు బదలాయిస్తామని 2005లో నాటి కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డితో ఒప్పందం చేసుకున్నారు. అయితే అవి ఇంతవరకు అమలు జరగలేదు. గ్రామ పంచాయతీల హక్కులన్నీ రాష్ట్రాల వద్దనే ఉన్నాయి. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు తగినన్ని విధులు విడుదల చేయడం లేదు. కారోబార్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలివ్వలేని దుస్థితి నెలకొన్నది. గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదనే సాకుతో తెలంగాణకు రావలసిన 3500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయకుండా కేంద్రం తొక్కి పట్టింది. 15వ పంచవర్ష ప్రణాళిక 2026 మార్చి నెలతో ముగుస్తుంది. అప్పటికి ఈ నిధులు మంజూరు కాకుంటే మురిగిపోతాయి.

సర్పంచులకు ఇప్పటికే 400 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది. బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను అడుక్కునే స్థితికి దిగజార్చింది. ఇప్పుడు స్థానిక సంస్థల అధికారాలను క్రమక్రమంగా కత్తిరించే పనిలో ఉంది. ఈ దుస్థితి వల్ల గ్రామ స్వరాజ్యం గురించి గాంధీజీ కన్న కల కల్లగానే మిగిలి పోయింది. పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలహీనంగా తయారైంది. ఈ వ్యవస్థకు మూలస్తంభమైన గ్రామ సభలు రికార్డులకే పరిమితమ య్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలు, తమ మౌలిక వసతులు, అభివృద్ధికి సంబంధించి గ్రామసభల ద్వారా తమ ప్రాధాన్యతలను వివరించడానికి చట్టబద్ధంగా అవకాశం ఉంది. కానీ ప్రభుత్వాల అలసత్వం వల్ల గ్రామాలలో ఎక్కడ కూడా గ్రామసభలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. నిధుల కేటాయింపు కొరవడి గ్రామీణాభివృద్ధి పడకేసింది. ఇరుగుపొరుగు గ్రామాల మధ్య, గ్రామాల నుంచి మండల కేంద్రానికి రాకపోకలకు రోడ్లు లేవు. అనేక గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలకు తగిన వసతి సౌకర్యాలు లేవు. గ్రామపంచాయతీలుగా ఏర్పడిన గిరిజన తండాల్లో కార్యాలయాలకు వసతి లేదు.

ఆదర్శ కేరళలో పంచాయతీలే కీలకం
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోకెల్లా, పంచాయతీరాజ్‌ వ్యవస్థను పటిష్టంగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం కేరళ. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన 29 అధికారాలను గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు నిర్వర్తించడానికి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణ దేశంలోని అన్ని రాష్ట్రాలు మార్గదర్శకంగా స్వీకరించాలి. కేరళలో 941 గ్రామ పంచాయతీలు, 87 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లు (మొత్తం 1,034) నిజమైన స్థానిక ప్రభుత్వాలుగా పనిచేస్తున్నాయి. కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణ పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు 73వ రాజ్యాంగ సవరణకు ఊపిరి పోసింది. అత్యంత పేదల గుర్తింపులో భాగంగా కేరళ వామపక్ష ప్రభుత్వం, ఈ కార్యక్రమాన్ని స్థానిక పాలన వ్యవస్థ ద్వారానే చేపట్టింది.

దీర్ఘకాల అనారోగ్యం, అంగవైకల్యం, వృద్ధాప్యం, నివాస వసతి లేకపోవడం, జీవనోపాధి ఇబ్బందులు, పౌష్టికాహార లోపం వంటి ప్రామాణికాలతో దుర్భరంగా జీవనం గడుపుతున్న అత్యంత పేద కుటుంబాలను గుర్తించే కార్యక్రమం పకడ్బందీగా అమలు చేసింది. అధికారులు, కుటుంబశ్రీ కార్యకర్తలు, స్థానికులతో కూడిన కమిటీలు, స్థానిక సంస్థల సహకారంతో ఇంటింటి సర్వే చేసి 87,158 కుటుంబాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. తదుపరి ఇందులో అన్ని విధాల అర్హులైన 73,747 కుటుంబాలను అత్యంత పేదల క్యాటగిరీ కింద వర్గీకరించి గ్రామసభల ఆమోదానికి పంపించడం, వారిలో 64,006 కుటుంబాలు అత్యంత పేదరికంలో మగ్గుతున్నట్టు గ్రామ సభలలో ప్రజలు తీర్మానించారు. ఈ మేరకు వారి సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5415 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్త్రీ క్లినిక్స్‌ పేరుతో నిర్వహిస్తున్నారు. ఉపాధ్యా యులు డాక్టర్లు పారామెడికల్‌ సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తున్నారు. ప్రసూతి మరణాల సంఖ్య జాతీయ సగటు 1000కి 28 ఉంటే కేరళలో ఆ సంఖ్య ఐదు మాత్రమే ఉంది. జాతీయ సగటు ఆయుష్షు 70.77 కాగా కేరళలో 77.28గా ఉంది. అక్షరాస్యత 96 శాతంగా నమోదైంది. పేదరిక నిర్మూలనతోపాటు విద్యా, వైద్య రంగాలలో కూడా ఆ రాష్ట్రం ముందంజలో ఉంది. అక్కడి వామపక్ష ప్రభుత్వం ప్రతి సంవత్సరం పదకొండు శాతం ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. జాతీయ సగటు కంటే ఇది ఎక్కువ. యేటా 12 శాతం వృద్ధితో కేరళ బడ్జెట్‌ సగటున రూ.రెండు లక్షల కోట్లు దాటుతోంది. మహారాష్ట్ర గుజరాత్‌ తెలంగాణ వంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే కేరళలో భారీ పరిశ్రమలు లాంటివి లేవు. అయినప్పటికీ మానవ అభివృద్ధిలో సుస్థిరాభివృద్ధి సూచికలో అగ్రగామిగా నిలుస్తోంది.

క్రమంలో కేరళ వామపక్ష ప్రభుత్వం చేపట్టిన అత్యంత పేదరిక నిర్మూలన పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలను మార్గదర్శకం కావాలి. రాజ్యాంగంలో పొందుపరచిన విధంగా స్థానిక ప్రభుత్వం అంటే పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రజల ఆకాంక్షలకు, అభివృద్ధికి అసలు సిసలు ప్రతీకగా పనిచేయడంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కేరళ రాష్ట్ర వామపక్ష ప్రభుత్వం ఆదర్శంగా పంచాయతీ రాజ్‌ వ్యవస్థ సంపూర్ణ అధికారాలతో, నిధుల కేటాయింపుతో ప్రగతి పథంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. అలాగే పంచాయతీ ఎన్నికల్లో తమపక్షాన బలమైన గొంతు వినిపిస్తూ గ్రామీణ ప్రజల అభివృద్ధి కోసం నిలబడే పార్టీ అభ్యర్థులను ఎన్నుకోవాలి. గ్రామాభివృద్ధి కోసం, రోడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల కోసం, ప్రలోభాలకు లోనుకాకుండా సరైన అభ్యర్థులను సర్పంచ్‌గా, వార్డు మెంబర్లుగా ఎన్నుకోవడం ఎంతైనా అవసరమని ప్రజలు గుర్తించాలి.

జూలకంటి రంగారెడ్డి
9490098349

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -