రాష్ట్రంలో పేదరికం, వివక్షతలను దూరం చేసేందుకు, అందరికీ విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంటును రూపొందించిట్టు గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ దార్శనిక పత్రం రాష్ట్ర భవితవ్యానికి రోడ్‌మ్యాప్‌గా పేర్కొన్నారు. రైతులు, మహిళలు, యువత సమస్యలు, పిల్లల ఇబ్బందులు, సామాజిక అవసరాలు, ఆకాంక్షలు తీర్చేలా డాక్యుమెంటు పరిష్కారం చూపిస్తుందని అభిప్రాయడ్డారు. ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానించడం తప్పుకాదు. అదే క్రమంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రభుత్వ, ప్రజాధనాన్ని ఏమేరకు ధారపోస్తున్నామనేది కూడా గమనంలో ఉండాలి. ప్రభుత్వ భూములు, వనరులను ప్రయివేటు పెట్టుబడిదారులకు అప్పగించే నేపథ్యంలో మన సమాజానికి ఎలాంటి ప్రయోజనాలు ఓనగూర నున్నాయో కూడా చూడాలి. విలువైన మౌలిక వసతులను కల్పిస్తున్న తరుణంలో అప్రమత్తత అవసరం. తెలంగాణ అన్‌స్టాపబుల్ అని సర్కారు చెబుతుంటే, అన్‌బీటబుల్ అని పారిశ్రామికవేత్తలు ఊదర గొడుతున్నారు. నిజంగా ఇవి నెరవేరాలంటే పేదల పట్ల ప్రేమ, కార్యాచరణలో చిత్తశుద్ధి తప్పనిసరి.
గత ప్రభుత్వాలతోపాటు తాజా సర్కారు కూడా ప్రపంచ ఆర్థిక సదస్సుల్లో పాల్గొని తెచ్చిన పెట్టుబడులు, వచ్చిన ఫలితాలను ప్రజల వివరించాలి. సర్కారు పారదర్శకత జనానికి అద్దంలా కనిపించాలి. ‘దూరపు కొండలు నునుపు’ అనే నానుడి మనకు కొత్తేమి కాదు. సమ్మీట్‌లో రూ.5.75 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని ముగింపులో ప్రభుత్వం ప్రకటించింది. సీఎం , మంత్రులు గత రెండేండ్లల్లో రెండేసి మార్లు పెట్టుబడుల ఆర్థిక వేదిక దావోస్‌కు వెళ్లొచ్చారు. అప్పట్లో వచ్చిన కంపెనీలు, ఉద్యోగాలు, ప్రయోజనాలను ప్రజలకు చెప్పి ఉంటే గ్లోబల్ సమ్మిట్‌కు మరింత విలువ పెరిగుండేది. దేశంలో ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలను ప్రయివేటీకరణ పేర మొత్తంగా తెగనమ్మేయడం చూస్తున్నాం. అప్పుడైతే కేంద్రం ఏకంగా ఒక మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేసింది. ప్రయివేటు పెట్టుబడిదారులకు భూములు, విద్యుత్, నీరు రూపేణా ఎంతమేర ఎదురిస్తున్నామనేది లెక్క లేయాల్సిందే. ఆ మేరకు స్థానిక ప్రజలకు మేలు జరుగుతుందా?
సమ్మిట్ ఆరంభ శూరత్వం కాకూడదు. ఆర్థవంతమైన సదస్సు కావాలి. ఎందుకంటే దేశంతోపాటు ప్రపంచం సాంతం పరిణామాలను పరిశీలిస్తే పెట్టుబడి, తదనంతర పరిస్థితులు ప్రజావ్యతిరేకంగా ఉంటున్నాయి. ఇండిగో విమానయాన సంస్థ వ్యవహారం ఆ కోవలోనిదే. మార్కెట్ లో అరవై ఐదు శాతం వాటాను చేజిక్కించుకుని ఆకాశాన్ని తమ ఇష్టానుసారం వాడు కుంటామని చెప్పకనే చెప్పింది, కేంద్ర పభుత్వాన్ని సవాల్ చేసింది. ప్రయాణికులను అనేక ఇబ్బందులకు గురిచేసింది. ‘నీరు పల్లమెరుగన్నట్టు పెట్టుబడి లాభమెరుగు’ అనేది ఇక్కడ అక్షరాలా నగసత్యం. లాభాల కోసం పెట్టుబడిదారులు ప్రజా ప్రయోజనాలను సైతం ఫణంగా పెట్టడానికి సిద్ధపడతారని చెప్పడానికి ఇండిగో కంటే ప్రత్యక్ష సాక్ష్యం మరొకటి అక్కర్లేదు. టెలికాం రంగంలో పట్టుసాధించేంతవరకు ఉచిత డేటాను ఇచ్చి ఆనక ఇష్టారాజ్యంగా ప్యాకేజీల రేట్లను పెంచి దండుకుంటున్న అంబానీల జియో సంగతీ అందరికీ తెలిసిందే. ఇందుకు ప్రతిచర్యగా ఒకేరోజు డెబ్బయి లక్షల మంది జియో వినియోగదారులు ఇటీవల తమ సర్వీసులను రద్దుచేసుకున్నారు.
ఒక్కో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కో నినాదాన్ని లేదా విధానాన్ని ఎంచుకుంటూ పరిపాలన సాగిస్తుంటాయి. ఇది సాధారణమే. కాగా ఆ పాలనలోని సారం ప్రజలకు ఏమాత్రం అందుతున్నదనేదే కీలకం. మన కండ్లముందున్న విజన్ 2020, బంగారు తెలంగాణ నినాదాల ఫలితాలను విశ్లేషించుకుంటే స్పష్టత వస్తుంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ వరకు ప్రభుత్వాల ప్రణాళికలు, స్వర్ణాంధ్ర, బంగారు తెలంగాణ వాటి అమలును గమనిస్తే ‘ఎక్కడ వేసిన గొంగలి అక్కడే’ అన్న చందంగా ఉంది. ప్రణాళికలు స్వల్పమైనా, దీర్ఘకాలికమైనా మన అడుగులు సక్రమంగా ఉన్నాయా? లేవా? అనేది గుర్తించాలి. ఇప్పటికే సర్కారు నెత్తిన రూ.8 లక్షల కోట్ల అప్పు ఉంది. పెట్టుబడిదారులకు కల్పించే మౌలిక వసతుల వెనక పేదల కష్టార్జితం మిళితమై ఉందనే సంగతిని మరిచిపోకూడదు. మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా రేవంత్ సర్కారు చేస్తున్న ఈ ఫీట్లు భవిష్యత్ తరాలకు శాపంగా మారకుండా విజ్ఞత ప్రదర్శించాలి. వ్యవసాయం, నీటిపారుదల, విద్యా వైద్యం, మౌలిక రంగాల్లో ప్రభుత్వం పెట్టుబడులు వస్తాయని మురిసిపోతున్న వాళ్లు, రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఎలాంటి హామీనిస్తారో స్పష్టం చేయాలి. దేశంలో రోజుకు వెయ్యి చొప్పున ఎంఎస్‌ఎఈలు, ఇతర సంస్థలు మూతపడుతున్న తరుణంలో కొత్త పెట్టుబడులతో కలగనున్న మేలేమిటో చెప్పగలగాలి.
విజన్ నిజమయ్యేనా..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



