2 ఏండ్లలో 3.76 లక్షల మంది లబ్ధిదారులు
పేద, మధ్యతరగతి ప్రజలకు రూ.1,685 కోట్ల నిధులు
కాంగ్రెస్ పాలనలో మెరుగైన వైద్యం పొందుతున్న బాధితులు
బీఆర్‌ఎస్ హయాంలో ఏడాదికి సగటున రూ.450 కోట్లు ఖర్చు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) సాయం రికార్డు స్థాయిలో అందింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కువ మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ రెండేండ్ల కాలంలో 3,76,373 మంది లబ్ధిదారులు రూ.1,685.79 కోట్ల నిధులను పొందారు. ఇందులో లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌వోసీ) ద్వారా 27,421 మందికి రూ.533.69 కోట్ల ఆర్థిక సాయం అందింది. రీయింబర్స్‌మెంట్ కింద 2,48,952 మంది లబ్ధిదారులు రూ.1,152.10 కోట్లు పొందారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సహాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందించింది. మును పెన్నడూ లేనివిధంగా ఈ సేవలను విస్తరించింది. 2014 నుంచి 2024 వరకు పదేండ్ల కాలంలో బీఆర్‌ఎస్ హయాం లో సగటున ఏడాదికి రూ.450 కోట్లు సీఎంఆర్‌ఎఫ్ నిధులను ఖర్చు చేసింది. కాంగ్రెస్ పాలనలో ఈ రెండేండ్లలోనే రూ.1,685 కోట్లు ఆర్థిక సాయం చేసింది. అంటే ఏడాదికి సగటున రూ.850 కోట్లు అందించింది. అంటే బీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం రెట్టింపు స్థాయిలో సాయం అందించడం గమనార్హం. ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి నాయత్వంలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఈ ప్రభుత్వం అండగా నిలిచింది.
రెండు పద్ధతుల ద్వారా సీఎంఆర్‌ఎఫ్
సీఎంఆర్‌ఎఫ్ సాయాన్ని రెండు పద్ధతుల ద్వారా పొందడానికి అవకాశమున్నది. ఎల్‌వోసీ ద్వారా లబ్ధిదారుడు నిర్దిష్ట ప్రభుత్వ ఆస్పత్రుల్లో (నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, ప్రభుత్వ ఈఎన్‌టీ) చికిత్స కోసం చెల్లింపునకు హామీ ఇచ్చే అధికారిక లేఖను పొందొచ్చు. ఈ లేఖలో చూపిన ఆర్థిక సాయం రోగి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్స పొందడానికి అవకాశమున్నది. రీయింబర్స్‌మెంట్ ద్వారా వ్యక్తి ఏదైనా ఆస్పత్రి (ప్రభుత్వ, ప్రయివేటు, కార్పొరేట్)లో చికిత్స పొంది బిల్లులు చెల్లించిన తర్వాత ఖర్చు చేసిన మొత్తంలో కొంత భాగాన్ని తిరిగి చెల్లిం చాల్సిందిగా సీఎంఆర్‌ఎఫ్‌నకు దరఖాస్తు చేసు కోవడానికి వీలున్నది. ప్రభుత్వం ఆ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించిన మొత్తానికి చెక్కును లబ్ధిదారులకు జారీ చేస్తుంది.
ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి
ఎల్‌వోసీ ప్రత్యేక చికిత్స అందించే ప్రభుత్వ సంస్థలకు మంజూరు చేస్తుంది. దీంతో ప్రజలు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్యాన్ని పొందగలుగుతున్నారు. దీనికోసం ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. నిజాం ఆస్పత్రిలో 26,694 మంది, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో 316 మంది, ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రిలో 196 మందికి ఎల్‌వోస ీలను ప్రభుత్వం ఇచ్చింది. వినికిడి సమస్యలున్న పిల్లల కోసం శస్త్ర చికిత్సలు, పరికరాల అమరికతో సహా ఆర్థిక సాయం చేసింది.
దళారుల ప్రమేయాన్ని తగ్గించిన ప్రభుత్వం
సీఎంఆర్‌ఎఫ్ పొందడానికి దళారుల ప్రమేయాన్ని ప్రభుత్వం తగ్గించింది. పారదర్శకతను పెంచింది. అందుకోసం దరఖాస్తు ప్రక్రియను ఆన్‌లైన్‌లోకి మార్చింది. ఎలాంటి మోసాలకు తావులేకుండా ఆధార్ పరిశీలన జరిపి చెక్కుల మీద లబ్ధిదారుని పేరుతోపాటు బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ను ముద్రించడం జరుగుతున్నది. దీనివల్ల అవకతవలకు అవకాశం లేదు.
దరఖాస్తు ప్రక్రియ విధానం
దరఖాస్తులు ఇప్పుడు ప్రధానంగా అధికారిక తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో స్వీకరించబడు తున్నాయి. ప్రజాప్రతినిధి కార్యాలయం సీఎంఆర్‌ఎఫ్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ఫారాన్ని పూరించాల్సి ఉంటుంది. వాటితోపాటు ఫొటో, ఆధార్‌కార్డు, తెల్లరేషన్‌కార్డు, ఆదాయ ధృవీకరణపత్రం, మొబైల్‌నెంబర్, ఆస్పత్రి అంచనా లేదా అసలు బిల్లులు, డిశ్చార్జ్ సమ్మరీ, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీని జతచేయాలి. స్థానిక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ లేదా ఎంపీ నుంచి సిఫారసు లేఖ తప్పనిసరిగా ఉండాలి. ఈ నిధుల పంపిణీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పౌరులకు అందించే చికిత్సలు అదనంగా ఉంటాయి. మరింత సమాచారం కోసం దరఖాస్తుదారులు సచివాలయంలోని సీఎంఆర్‌ఎఫ్ కార్యాలయాన్ని లేదా 040-23455662 నెంబర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
తెలంగాణ వారికే సాయం
సీఎంఆర్‌ఎఫ్ పొందాలంటే దరఖాస్తు దారుడు తప్పనిసరిగా తెలంగాణ నివాసి అయి ఉండాలి. స్థానికులకే సీఎంఆర్‌ఎఫ్ సాయం అందుతుంది. వార్షిక కుటుంబ ఆదాయం రూ.1.60 లక్షలకు మించొద్దు. తెల్లరేషన్ కార్డు కలిగిన వారే అర్హులు.
సీఎంఆర్‌ఎఫ్ వివరాలు
కొలమానం నిధులు లబ్ధిదారులు
లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌వోసీ) రూ.533.69 కోట్లు 27,421
రీయింబర్స్‌మెంట్ కేసులు రూ.1,152.10 కోట్లు 3,48,952
పంపిణీ చేసిన సాయం రూ.1,685.79 కోట్లు 3,76,373
రికార్డుస్థాయిలో ‘సీఎంఆర్‌ఎఫ్’ సాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


