ప్రభుత్వం ఏమాట చెప్పినా ఏ సంస్కరణ తీసుకొచ్చినా అది తీయగా ఉందనుకునే మధ్య తరగతి, అదీ చదువుకున్నవాళ్లు ఉన్నదేశంలో, ఫలానా మనిషి ఇస్తే వేపాకు తిన్నా కూడా మరీ తీపిగా ఉంది సారూ అనేవాళ్లున్న దౌర్భాగ్య దేశంలో మాటే మంత్రమౌతుంది. అదే తంత్రంగా అధికారం చలాయిస్తూ తమకిష్టమైన పనులు చేస్తూ పోయే ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి దశలో ముందస్తుగా అనుభవపూర్వకంగా చెప్పే మంచిమాటలు చెవికెక్కవు. స్లిప్పర్ వేసుకొనేవాళ్లు కూడా ఈ విమానమెక్కొచ్చు అంత తక్కువ ధరలుంటాయి అంటూ నాయకుల అండదండలతో పైకొచ్చిన ఇండిగోను ఇండి”గో” అనేలా పరిస్థితులెందుకు మారాయి?
కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఎవైనా ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు, ప్రదర్శనలు సచివాలయాలముందు, అసెంబ్లీ, పార్లమెంటుభవనాల ముందు కాకుండా ఎక్కడో మూలకుండే ధర్నా చౌకుల్లో చేసుకోవాలనే రూలు అన్నిచోట్లా ఉంది. మొన్న ఇండిగో విమానాలకోసం వేచిచూస్తున్న ప్రయాణీకులు అక్కడే విమానాశ్రయాల్లోనే ఊరేగింపులు, ప్రదర్శనలు, ధర్నాలు చేశారు. అదీ స్లిప్పర్లు వేసుకొని మరీ చేశారు. స్లిప్పర్లు వేసుకున్నవాళ్లు ఇండిగో విమానాల్లో ప్రయాణించగలగడం అటుంచి స్లిప్పర్లతో మార్నింగు వాకులు, ఈవినింగు వాకులు విమానాశ్రయాల్లో చేశారని మరచిపోకూడదు. పెద్దొళ్ల మాటలు ఎప్పుడూ తప్పుకావనుకోవాలా?
జాతిరత్నాలు సినిమాలో హీరో ” ఇప్పుడు మంత్రిని చంపడానికి ఎవరు కుట్రచేశారో బయట పడతారు” అన్నవెంటనే తనతో పాటు తన ఇద్దరు మిత్రుల ఫొటోలు చూపిస్తారు టీవీలో. ఇంకేముంది ముగ్గురు మిత్రులతో పాటు అందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే నేరాలు ఘోరాలు కార్యక్రమంలో వీళ్లపై కథనాలు మొదలవుతాయి. ఇప్పుడు సేం టు సేం అలాంటి పరిస్థితే వచ్చింది. విమాన సర్వీసుల రద్దు, ఇతర కంపెనీల ధరలకు రెక్కలెందుకొచ్చాయి అన్న విషయాలు ఉన్నది ఉన్నట్టు చెబితే ఎందరి పేర్లో బయటకొస్తాయి. జి.ఎస్.టి పెట్టి విపరీతంగా పళ్లూడేలా పన్ను పెంచి దాన్నే మళ్లీ తగ్గించి బచత్ అనగలిగేంతగా ఎదిగారు నాయకులు. ఆ బచత్‌కు పండుగలు చేసి మళ్లీ కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైపోయింది. పిల్లలతో వ్యాసరచనలు చేయించారు. ప్రభుత్వం, అధికారులు చెప్పారు కాబట్టి అన్ని స్కూళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఇండిగో విమానానాల రెక్కలు విరిచిందెవరు, ధరలెందకు పెరిగాయి, దీని వెనుక అసలు భాగోతమేమిటి అన్నదానిపై కూడా వ్యాసరచన పోటీలు పెట్టాలి. అప్పుడుగాని అన్ని విషయాలు బయటపడవు.
పీతలను పెట్టే గాజు బీకరుకు మూత ఉండనవసరంలేదని, ఎందుకంటే ఒకటి పైకి పోతుంటే ఇంకోటి కిందికి పడగొడుతుందని చెబుతారు. వ్యాపారవర్గాలకి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. కొన్ని ఛానళ్లలో, సోషల్ మీడియాలో ఇండిగోను అదానీ కొంటాడని అందుకే ఈ ప్లాను వేశారనీ, లేదూ అదానీ సంస్థలకు విమాన సర్వీసులు ఇస్తారని వదంతులొస్తున్నాయి. అదానీ సంస్థలు విమానాలు నడపవుగాని విమాన సర్వీసులకు, ఎయిర్‌పోర్టులకు సంబంధించిన ఇతర సేవలెన్నో చేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఆకోణంలో ఆలోచిస్తే ఇండి గో, అదానీ కం అని పెద్దలనుకుంటున్నారేమో అన్న అనుమానం మీడియాకు, విశ్లేషకులకు కలిగింది. తిరగలి ఎటువైపు తిరిగినా పిండి నావైపు పడితే చాలునని అన్నాడట ఓ తెలివైనోడు. అదో సామెతగా మారింది. తిరగలినే ఇసుర్రాయి, విసుర్రాయి, రాగల్రాయి అని వివిధ ప్రాంతాల్లో అంటారు. మనుషులు సమిష్టిగా శ్రమ చేస్తూనే సొంత ఆస్తి, సొంత కుటుంబాలు ఏర్పడుతున్న రోజుల్లో ఉండొచ్చు. అలాగే బంతిలో ఎక్కడ కూచున్నా వడ్డించేటోడు మనోడైతే మన కంచంలో అన్నీ పడతాయన్న సామెత కూడా ఇక్కడ గుర్తుచేసుకోవాలి. అదానీకి పిండిపడేలా, కంచంలో లడ్లు పడేలా చేయడం పెద్ద మాట కాదు, పాతమాటే.
ఇక ఆకాశం నుండి నేలమీదికొద్దాం. విమాన సేవలు, జాగ్రత్తలనుండి రహదారులు, వాహనాలు, డ్రయివర్లు, ప్రయాణీకుల గురించి కూడా మాట్లాడుకుందాం. ఆకాశంలో ఎగిరే లోహ విహంగాల్లో ప్రయాణికుల గురించి, పైలట్ల గురించి ఎంత జాగ్రత్త తీసుకోవాలో రోడ్లపై తిరిగే వాహనాల గురించి, ముఖ్యంగా ప్రయివేటు సర్వీసులపై ఉక్కుపాదం ఎందుకు మోపడం లేదన్న ప్రశ్న వేసుకోవాలి. మనుషులంతా ఒక్కటే అన్న సినిమా అన్న రామారావు తీసి యాభయ్యేళ్లవుతోంది. విమానాల్లో తిరిగేవాళ్లే మనుషులు కాదు. కింద తిరిగేవాళ్లు కూడా మనుషులే. ఏ నిబంధనలు విధించినా, ఏ జాగ్రత్తలు సూచించినా అవి ప్రజలకు మేలు చేసేలా ఉండాలిగాని వ్యాపారస్తులకు లాభాలు తెచ్చేవిగా ఉండకూడదు. వ్యాపారులెప్పుడూ లాభాలనే చూస్తారు. రాజకీయవ్యాపారులూ అంతే. జమిలిగా ఇద్దరూ కలిసిన ఈ వ్యవస్థను గోగో అందాం.
జంధ్యాల రఘుబాబు
9849753298


