మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ స్వామినాథన్‌ను అభిశంసించాలని ‘ఇండియా’ వేదికకు చెందిన 107 మంది పార్లమెంటు సభ్యులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. మదురై సమీపంలోని తిరుప్పరన్‌కుండ్రన్ కొండపై కార్తీకదీపం వెలిగించడానికి సంబంధించి ఆయన ఉత్తర్వులు సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం సవాలు చేసిన తరుణంలోనే ఈ అభిశంసన నోటీసు ఇవ్వవలసి వచ్చింది. మధురై హైకోర్టు జడ్జిపై ఎంపీలు నోటీసు ఇవ్వడాన్ని ఏపీ ఉప ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆక్షేపిస్తూ ప్రకటన చేశారు. మాజీ సిజెఐ గవారు విష్ణుమూర్తిపై వ్యాఖ్యలు చేస్తే సమర్థించిన వారు ఇప్పుడు ఇలా నోటీసు ఇవ్వడం కుహనా లౌకికవాదమని ఆయన తీవ్రభాషలో దాడిచేశారు.
ఆ విషయంలో మాజీ సిజెఐ గవారుపైన సుప్రీంకోర్టు ఆవరణలోనే చెప్పు విసరడానికి ఒక న్యాయవాది తీవ్ర ప్రయత్నం చేస్తే ఆయన ఆవేదనను అర్థం చేసుకోవచ్చని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం గుర్తుండే వుంటుంది. మరోవైపున ప్రస్తుత సిజెఐ సూర్యకాంత్ ఒక పిటిషన్ విచారణ సందర్భంగా రోహింగ్యాలను ఉద్దేశించి వేసిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయని హైకోర్టు మాజీ సిజెఐలు, జడ్జిలు, సీనియర్ న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు ఆయనకు బహిరంగ లేఖ రాశారు. ఇందుకు వ్యతిరేకంగా ఆయనను బలప రుస్త్తూ రెండు వందల మంది మాజీ న్యాయమూర్తులు మరో లేఖ విడుదల చేశారు. ఇక సిజెఐ సూర్యకాంత్ ఇలాంటి వాటిని తాను ఖాతరు చేయబోనని విచారణ సందర్భంలో తీవ్రంగా వ్యాఖ్యానించారు. కోర్టులోపలే గాక వెలుపల నుంచి వచ్చే ఇలాంటి వాటిపై ఎలా స్పందించాలో తనకు తెలుసునని ఆయన హెచ్చరించారు.
ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల అభ్యర్థిగా నిలబడిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన సల్వాజుడుం తీర్పు మావోయిజానికి ప్రోద్బలం కలిగించిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దాడి చేయడాన్ని విమర్శించిన వారికీ ఉద్దేశాలు ఆపాదిస్తూ ఇలాగే మరికొందరు ఎదురుదాడి చేశారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రాజకీయాలలోకి వచ్చిన తర్వాత వారు సమర్థించడం ద్వంద్వనీతి కాదా అని సవాలు చేశారు. సుప్రీం జడ్జిగా ఆయన ఇచ్చిన తీర్పు న్యాయపరమైనది, కాగా రాజ్యాంగ పదవికి పోటీ ఆయన ప్రాథమిక హక్కు. ఈ రెంటినీ కలగాపులగం చేయడం అర్థరహితమే. అక్కడ అమిత్ షా చేసిందీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిందీ అదే.రాజ్యాంగ పరిధిలో ఎవరిపైనైనా విమర్శ చేయవచ్చు.ఇప్పుడు సిజెఐ సూర్యకాంత్‌పైన, జస్టిస్ స్వామినాథన్‌పైన వచ్చిన విమర్శలు న్యాయపరిధిలో తప్ప రాజకీయం కాదు.
రెండు ధోరణులు
ఉన్నత న్యాయవ్యవస్థలో పెరిగిపోతున్న ఆందోళనకర పరిణామాలను ఎలా చూడాలన్నది నిజానికి పెద్ద సమస్య. మూడు వ్యవస్థలుగా న్యాయ, కార్యనిర్వాహక, శాసనవ్యవస్థల మధ్య రాజ్యాంగం చేసిన విభజనకు లోబడి చూడవలసి వుంటుంది. న్యాయం లేదా చట్టం వ్యవస్థపై ఆధారపడి వుంది గానీ వ్యవస్థ చట్టాలను బట్టి నడవదని ఎప్పుడో కారల్‌మార్క్స్ చేసిన వ్యాఖ్య ఇలాంటి సందర్భాల్లో గుర్తుకు వస్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో శ్రామికులు ప్రజల సంపదలు కార్పొరేట్ ఆధిపత్యాల వంటి అంశాలపై ఒక తరహా తీర్పులు రావడం చూస్తునే ఉన్నాం. ఇక రాజకీయ పాలనా వ్యవహారాల్లో సనాతన ధర్మం హిందూత్వ మతరాజకీయాలు ప్రబలిపోతున్న వేళ ఆ ప్రభావం పెరిగిపోతుందనడానికి చాలా తీర్పులు ధోరణులు సంకేతాలవుతున్నాయి.
మాజీ సిజెఐ చంద్రచూడ్ గుజరాత్‌లో ఒక ప్రాచీనాలయానికి వెళ్లి ఆలయ ధర్మధ్వజంలో తనకు రాజ్యాంగ ధర్మం కనిపిస్తున్నదని వ్యాఖ్యానించినపుడూ ఇలాంటి చర్చే మొదలైంది. దేవుణ్ని తలచుకుని తాను అయోధ్య తీర్పు రాశానని ఆయన మరో సందర్భంలో సెలవిచ్చారు. తీర్పులు రాజ్యాంగాన్ని బట్టి ఇవ్వాలి గానీ దేవుణ్ని తలుచుకుని ఇవ్వడమేమిటనే ప్రశ్నలు వచ్చాయి. ఇంటిదగ్గర వినాయక చవితి పూజకు ప్రధాని మోడీని ఆహ్వానించి మరో వివాదం మూటకట్టుకున్నారు.ఇప్పుడు వివాదాస్పదంగా మారిన జస్టిస్ స్వామినాథన్ గతంలోనే ఒక విచారణసందర్భంగా వేదాలను ప్రశంసిస్తూ, కులాలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు.
హర్యానాలో ఆరెస్సెస్ నిర్వహించిన ఓక ఈవెంట్‌కు హాజరైన జస్టిస్ స్వామినాథన్ ఈ రాజ్యాంగం 1935 బ్రిటిష్ ఇండియా చట్టం కాపీ తప్పమరేమీ కాదని తీసిపారేశారు. దాన్ని రూపొందించిన నాటితో పోలిస్తే దేశంలో జనాభా పొందిక మారిపోయిందని, ఇప్పుడు మనం భారతీయ సంప్రదాయాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు చేయాలని సూక్తులు చెప్పారు. ఒక కేసులో న్యాయవాదిని కించపరిచేలా మాట్లాడారు. లాయర్‌గా ఉన్నప్పుడు ఒక శాస్త్రిగారిని రోడ్డు ప్రమాదం కేసునుంచి కాపాడానని కూడా గొప్పలు చెప్పుకున్నారు.అదే మద్రాసు హైకోర్టులో పనిచేసి, జైభీమ్ వంటి చిత్రానికి స్పూర్తినిచ్చిన జస్టిస్ కె.చంద్రు దీనిపై విమర్శిస్తూ ‘జస్టిస్ స్వామినాథన్ ‘ఆరెస్సెస్ ప్రచార కార్యదర్శిలా కనిపిస్తున్నారని’ వ్యాసమే రాశారు. తాజాగా ఇప్పుడు మదురై సమీపంలో కోర్టుకు వచ్చిన తిరుప్పరన్‌కుండ్రన్ కొండ కేసులో కూడా ఆయన వైఖరి దాన్ని ధృవీకరించింది.
దక్షిణాది కమల వ్యూహం
మదురై సమీపంలోని తిరుప్పరన్‌కుండ్రన్ కొండమీద సుబ్రహ్మణ్య స్వామి (మురుగన్) గుడితో సహా కొన్ని ఆలయాలు, ఒక మసీదు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చాలా చోట్ల ఉన్నట్టు ఈ కొండలపైన బౌద్ధ,జైన మతాల కేంద్రాలు కూడా వున్నాయి. అందువల్లనే అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు వివాదాలు రాకుండా పాలనా యంత్రాంగం ఇంతకాలం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నది. తమిళనాడులో ద్రవిడ ఉద్యమం నేపథ్యంలో పరిస్థితి అదుపు తప్పలేదు. అయితే ఇటీవల బీజేపీ దేశంలో పెరిగిన కొద్ది ఎక్కడికక్కడ ఏవో వివాదాస్పద అంశాలు రగిలించడం రివాజుగా మారిన పరిస్థితే ఇక్కడా తలెత్తింది. పవన్ కళ్యాణ్ కూడా సందర్శనలకు ఫళని వెళ్లారు. కొండమీద కార్తిక దీపం వెలిగిస్తామని హిందూత్వ సంస్థలు వివాదం పెంచుతున్నాయి. గతంలో అనేకసార్లు న్యాయస్థానాలు తగు ఆదేశాలిస్తూ ప్రశాంతతను కాపాడాయి. అంతేగాక ఆ దీపం వెలిగించడానికి ఎన్నుకున్న స్తంభం ఆలయానికి సంబంధించిందా లేక బ్రిటిష్‌వారు పెట్టిన దీపస్తంభమా అనేది కూడా తేలలేదు. కానీ హైకోర్టు మదురై ధర్మాసనంలో ఉన్న జస్టిస్ స్వామినాథన్ తీర్పులో కొద్దిమంది వెళ్లాలని, పరిమితితో కార్తీక దీపం వెలిగించుకోవచ్చని ఆనుమతించారు.
కానీ వారు పెద్ద సంఖ్యలో వెళ్లడంతో వివాదం అవుతుందని అధికార యంత్రాంగం అనుమతించలేదు. తమ ఉత్తర్వు ఉల్లంఘించారని జస్టిస్ స్వామినాథన్ కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేశారు. ఈ పరిస్థితిలో దాన్ని స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. వేగంగా విచారణ చేసి తగు ఉత్తర్వులివ్వాలని కోరింది. అయితే సిజెఐ సూర్యకాంత్ అనుసరిస్తున్న నిబంధనల ప్రకారం మౌఖిక ప్రస్తావనకు అనుమతివ్వకపోవడంతో విచారణ మొదలవలేదు. ఈలోగా అమిత్ షాతో సహా బీజేపీ సంఫ్‌ు పరివార్ నేతలు ఈ ఆలయం విషయంలో వివాదం పెంచే వ్యాఖ్యలు కొనసాగిస్తూనే వున్నారు. ఈ కుటిల ప్రయత్నాలను తమిళనాడులోని వామపక్షాలు సంయుక్త ప్రకటనలో ఖండించాయి. అయోధ్య మినహా మిగిలిన అన్ని ప్రార్థనాస్థలాల వివాదాలలోనూ 1947 ఆగస్టు 15 నాటి యథాతథ స్థితికి కట్టుబడాలని పార్లమెంటు చట్టం చేసిన తర్వాత కూడా కాశీ,మధుర వివాదాలను తిరగదోడటాన్ని అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు అనుమతించడంతో తలెత్తుతున్న పరిస్థితి ఇది. ప్రత్యేకించి బీజేపీ ప్రధానశక్తిగా లేని దక్షిణభారత దేశంలో తిరు మల నుంచి శబరిమల వరకూ ప్రతిచోటా మత రాజకీయ వివాదాలను రగిలించడం జరుగుతున్నది.
సంకేతాల సారం?
గత కొన్నేళ్లలోనూ సుప్రీంకోర్టులో దాదాపు రెండేండ్లు పదవిలో ఉన్నది సిజెఐ రమణ, చంద్రచూడ్‌లు మాత్రమే. వారివారి తీరూ, తీర్పులూ మనముందున్నాయి. ఆ తర్వాత వారు ఏడాదిలోపు పదవీకాలంతో వరుసగా మారిపోయిన అనంతరం ఇప్పుడు సిజెఐ సూర్యకాంత్ పదిహేను మాసాలు కొనసాగబోతున్నారు. ఈ పదవీ కాలంపై న్యాయనిపుణులకు పలు అంచనాలున్నాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు వంటివి ప్రధానంగా తీసుకుంటారా లేక మరో వైఖరి అనుసరిస్తారా అని పరిశీలిస్తున్నారు. ఆయన మాత్రం పెండింగు కేసులు తగ్గించడమే తన ప్రాధాన్యత అని ప్రకటించారు. రాజ్యాం గంలో మూడు విభాగాలు పరస్పరం దోహద కారులుగా, సహాయకరంగా ఉండాలని, కలసి పని చేయాలని ఆయన తన విధానంగా హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో చెప్పారు. రాజ్యాంగరీత్యా అత్యంత కీలకమైన కేసులు ఆయన ముందున్నాయి. ఎన్నికల వ్యవస్థకు సంబంధించి ‘సర్’ పైన సిజెఐ వ్యాఖ్యలు మిశ్రమ సంకేతాలిస్తున్నా తుదితీర్పు ఎలా ఉంటుందో చూడాలి. మొత్తంపైన సర్ కొనసాగవలసిందేనన్న సూచననే ఎక్కువగా కనిపిస్తున్నది. ఇప్పుడు రోహింగ్యాల విషయం లోనూ ప్రశ్నలు అడగడం ఒకటైతే అసందర్భ వ్యాఖ్యలు చేయడం విమర్శకు కారణమైంది.
‘ప్రశ్నలు అడిగేందుకు మాకున్న హక్కుకు అడ్డు తగులుతారా?’ అని ఆయన ఆగ్రహిస్తున్నారు గానీ వారు ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయం వెలిబుచ్చారు తప్ప అడ్డుపడిందేమీ లేదు. బహిరంగలేఖ రాశారే గానీ తప్పుడు పద్ధతులకు, మాటలకు పాల్పడిందేమీ లేదు. పౌర సమాజంలో ప్రజాస్వామ్యంలో ఎవరికైనా బహిరంగలేఖ రాయడం ఒక ఆనవాయితీ. దీన్ని సోషల్ మీడియా అవాకులతో పోల్చలేము. అయితే సిజెఐ సూర్యకాంత్ కర్నాటకకు సంబంధించిన ఎమ్మెల్యే రేవణ్న లైంగికదాడి కేసు విచారణలో రోహింగ్యాల ప్రస్తావన తేవడం నిజంగా ఆశ్యర్యమే. అక్రమ చొరబాటు దారులు అన్న అర్థం వచ్చే రీతిలో ఆయన మాటలుండటమే అభ్యంతర కారణమైంది. కానీ ఆయన మరోలా స్పందించారు! ‘ప్రజలు మరీ సున్నితంగా తయారైపోయారు. కోర్టు ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే, ప్రశ్నలు వేస్తే వారు అడ్డుపడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.గతంలో సిజెఐలు సోషల్ మీడియాలో మీడియాలో వచ్చేవాటిపై తాము పెద్దగా స్పందించబోమని వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు సరదాగా కూడా వాటిని ప్రస్తావించేవారు తప్ప ఇంతగా ఆగ్రహించడం జరగలేదు.మరి ప్రస్తుత సిజెఐ సూర్యకాంత్ తమ హయాంలో విమర్శలకు పెద్దగా అవకాశం ఉండబోదని సూచిస్తున్నారా? వీటన్నిటి మధ్య న్యాయవ్యవస్థ గమనం ఎలా ఉండబోతోంది?
తెలకపల్లి రవి



