‘చలి వణికిస్తున్నా… ఎండ మాడ్చేస్తున్నా మేం పట్టించుకోము. ఇంట్లో మా బతుకులు ఇంతకన్నా దారుణంగా ఉన్నాయి. మా కడుపు మండిపోతుంది. మా శ్రమకు తగ్గ జీతం మాకు ఇవ్వాల్సిందే. లేదంటే కంపెనీలోకి ఒక్క అడుగు కూడా పెట్టం. రోడ్డుపైనే కూర్చుంటాం..’ ఇది నాచారం ఇండిస్టియల్ ఏరియాలోని షాహి ఎక్స్పోర్ట్ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నా వందలాది మంది మహిళా కార్మికుల కడుపుమంట. మహిళలే కదా! ఏం చేస్తారులే అనుకున్నారు. ఇన్నేండ్లు గాడిద చాకిరి చేయించుకున్నారు. కార్మికులు కూడా తమ జీతం పెరుగుతుందని నమ్మకంగా ఎదురు చూశారు. కానీ ఏండ్లు గడుస్తున్నా వారి ఆశలు అడాశలే అయ్యాయి. ఇక భరించలేకపోయారు. శ్రమకు తగ్గ ఫలితానికై గొంతెత్తి నినదిస్తున్న వారి మనోభావాలు నేటి మానవిలో…
ఆ మహిళా కార్మికుల సమస్యలు వింటే మనసున్న ఏ మనిషికైనా హృదయం ద్రవించకమానదు. నాకైతే 1936లో చార్లి చాప్లిన్ నటించిన ‘మోడ్రన్ టైమ్స్’ సినిమా గుర్తొచ్చింది. యంత్రాలు వచ్చిన కొత్తలో ఓ కంపెనీలో బెల్ట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. కార్మికులు లైన్లో నిలబడి పని చేస్తుంటారు. ఆ బెల్టు వచ్చి క్షణంలో వెళ్లిపోతుంది. ఆలోపు కార్మికుడు బోల్ట్ బింగించేయాల్సిందే. లేదంటే పని మొత్తం ఆగిపోతుంది. తిండి తింటానికి కాదు కదా కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా సమయం ఉండదు. కార్మికులు స్వయంగా తింటే టైం వేస్ట్ అని తిండి కూడా యంత్రాలే తినిపిస్తుంటాయి. ఇది 90 ఏండ్ల కిందటి సినిమా. కానీ ఇప్పుడు షాహీ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ కంపెనీ తీరు కూడా దీనికి కాస్త దగ్గరగానే వుంది.
ఊపిరి తీసుకోనివ్వరు
‘మేము టీంగా 70 మంది పని చేస్తాం. ఒక్కొక్కరం ఒక్కో భాగం కుట్టాలి. మేమందరం కలిసి గంటకు వంద షర్టులు ఇవ్వాలి. ఎనిమిది గంటల్లో రోజుకు 750 నుండి 800 వరకు పీసులు కుట్టాలి. ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఉండదు. మా పని మొత్తం చెయిన్ సిస్టమ్‌లా ఉంటుంది. చివరకు వాష్రూంకి వెళ్లినా ‘ఎంతసేపు పోతారు, నీ కోసం పని ఎంత సేపు ఆగాలి, మనుషులేనా అన్నం తింటున్నారా ఇంకేమైనా తింటున్నారా, చేతగానప్పుడు ఇంట్లో పండాలి, డ్యూటీలకు ఎందుకు వస్తారు’ అంటూ అసభ్యంగా మాట్లాడతారు. తినడానికి మాకు అరగంట ఇస్తారు. కానీ పది నిమిషాల్లో తినొచ్చి మిషన్‌పై కూర్చోవాలి. మంచినీళ్లు తాగడానికి కూడా టైం ఉండదు’ అంటూ లక్ష్మి అనే కార్మికురాలు ఆవేదన చెందుతుంది. ఇలా కష్టాలు అనుభవిస్తున్న కార్మికులు కడుపు మండి సమ్మెకు దిగారు.
దిక్కులేక రోడ్డెక్కాము
‘నేను గత పద్నాలుగేండ్ల నుండి ఇక్కడే పని చేస్తున్నాను. మా జీతం 9 వేలు. కంపెనీ మా కష్టాన్ని పట్టించుకోడంలేదు. ఇప్పటికే ఎన్నో సార్లు జీతం పెంచమని అడిగాము. కానీ ఒక్కళ్లు కూడా మమ్మల్ని లెక్క చేయడం లేదు. చివరకు దిక్కులేని పరిస్థితుల్లో ఇలా రోడ్డుపైకి వచ్చాము. ఒక జీఎం పోయేటపుడు వెయ్యి రూపాయలు పెంచారు. కానీ సెలవులు పెడితే ఏడు వందలు కట్ చేస్తారు. అటెండెన్స్ పైసలని ఐదు వందలు ఇస్తారు. నెల మొత్తం సెలవులు పెట్టకుండా వస్తే అవి వస్తాయి. అందులో ఒక్క సెలవు పెట్టినా రెండు వందలు కట్… ఇవి మా బతుకులు అంటూ మరో కార్మికురాలు కన్నీళ్లు పెట్టుకుంది.
సంపాదన సరిపోక…
నా పేరు ప్రభావతి… ఒక్కరోజు సెలవు పెడితే కొత్త పని అప్పగిస్తారు. సరిగ్గా చేయకపోతే మాటలతో హింసిస్తారు. కటింగ్‌లన్నీ పోను కనీసం మాకు పదిహేను వేల జీతం రావాలి. కానీ పద్నాలుగేండ్ల నుండి తొమ్మిది వేలే ఇస్తున్నారు. సుమారు రెండు వేల మంది మహిళలం ఇందులో పని చేస్తున్నాం. ఐరన్, ప్యాకింగ్, కటింగ్, కుట్టు ఇలా రకరకాల పనులు మాకు ఉంటాయి. నేను హెల్పర్‌గా పదేండ్ల నుండి చేస్తున్నాను. ఐరన్‌తో పాటు అనేక రకాల పనులు చేస్తాను. బోడుప్పల్ నుండి ఆటోలో వస్తాను. ఈ రూట్లో బస్సులు లేవు. ఆటోకు నెలకు వెయ్యిరూపాయలు పోతాయి. తినీ తినక ఓటీ చేసుకొని బతుకుతాం. మాకు ఇద్దరు పాపలు, ఒక బాబు. వచ్చే సంపాదన సరిపోక పిల్లల్ని గురుకుల హాస్టల్లో పెట్టాము.
మాకు నమ్మకంలేదు
నా పేరు రాణి.. రూం కిరాయి నాలుగువేలు. మల్లపూర్ నుండి వస్తా. నాకు భర్త లేడు. ఒక్కదాన్నే ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి. అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి, మా జీతం మాత్రం పెరగడం లేదు. ఇప్పుడు పది రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం పనిలోకి రమ్మంటున్నారు. రోడ్డు మీద ఉంటేనే పట్టించుకోని వాళ్లు పని నడుస్తుంటే పట్టించుకుంటారనే నమ్మకం మాకు లేదు.
ఎండీ చెబితేనే
నాపేరు స్వప్న.. సమ్మె ఆపేసి లోపలికి వెళితే ఎంతోకొంత డబ్బులు ఇచ్చి వాళ్లవైపుకు తిప్పుకుంటారనే భయం అందరిలో ఉంది. మాకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పనిలోకి వెళ్లం. మధ్యలో మాకు వెయ్యిరూపాయలు పెంచారు. కరోనా టైంలో నష్టాల్లో ఉన్నామని అవి ఆపేశారు. కరోనా పోయి రెండేండ్ల తర్వాత ఆ వెయ్యి రూపాయలు కలిపి ఇవ్వమంటే ‘నెలలో మూడు సెలవులు పెట్టకుండా వస్తేనా ఇస్తాము, లేదంటే లేదు’ అన్నారు. వచ్చే జీతమే చాలా తక్కువ. ఇలా కటింగ్‌లు పోతే ఎలా బతకాలి? అందుకే ఇన్నేండ్లు భరించాం. మా కడుపు మండి రోడ్డు మీదకు వచ్చాం. ఇప్పుడు రెండు రోజుల్లో వెళ్లిపోయే జీఎం వచ్చి పది రోజుల్లో మీ జీతాల గురించి ఆలోచిస్తాం అందరూ పనిలోకి రండి అంటున్నాడు. ఎండీ వచ్చి చెబితేనే మేము నమ్ముతాము.
జీతం పెంచితేనే…
2009లో కంపెనీ మొదలుపెట్టినప్పుడు చేశారు. అప్పుడు మా జీతం మూడు వేలు. అప్పటి నుండి ప్రభుత్వం ద్వారా డీఏ పెరిగింది తప్ప కంపెనీ వాళ్లు వంద రూపాయాలు కూడా పెంచలేదు. ఒక్క గంటలకు 150 పీసులు వాళ్ల చేతిలో పెట్టాలి. ఒక వేళ తగ్గితే ‘ఏమైంది ఎందుకు కుట్టలేదు’ అంటారు. మిషన్ సమస్య వచ్చినా మమ్మల్నే అంటారు. ఒక వేళ ఐదున్నర దాటితే పంచ్ కొట్టించి మళ్లీ కూర్చోబెడతారు. చిన్న చిన్న పిల్లలుంటారు. ఓటీ చేయలేమంటే అస్సలు ఒప్పుకోరు. గంటన్నర ఓటీ చేస్తే వంద రూపాయలు ఇస్తారు. ఇన్ని కష్టాలుప పడుతూ కూడా దిక్కు లేక ఇక్కడే పని చేస్తున్నాం. మా జీతం పెంచితేనే మేము పనిలోకి వస్తాం’ అంటుంది మరో కార్మికురాలు.
సీఐటీయూ అండతో..
ఒక్కొక్కరిది ఒక్కో దీన గాథ. ఒంటరి పోరాటం చేస్తున్న ఈ మహిళలకు కార్మిక సంఘాలు అండగా నిలబడ్డాయి. గత కొన్ని రోజులుగా రోడ్డుపైనే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులకు సీఐటీయూ వంటి సంఘాలు భోజన సౌకర్యం కల్పిస్తున్నాయి. అయితే కొంత మంది రాజకీయ నాయకులు ఆ మహిళా కార్మికుల్లోని ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. యాజమాన్యంతో కుమ్మక్కై, మహిళలను భయపెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేయజూస్తున్నారు. కానీ కార్మికుల న్యాయమైన డిమాండ్లకు సీఐటీయూ అండగా నిలబడింది. శ్రమకు తగ్గ ఫలితం దక్కే వరకు వారి పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తుంది.
– సలీమా
మహిళా కార్మికుల కడుపు మండితే..
- Advertisement -
- Advertisement -



