Sunday, December 14, 2025
E-PAPER
Homeఆటలుగిల్‌, సూర్యకుమార్‌ రాణిస్తేనే…

గిల్‌, సూర్యకుమార్‌ రాణిస్తేనే…

- Advertisement -

నేడు దక్షిణాఫ్రికాతో మూడో టి20
రాత్రి 7.00గం||లకు

ధర్మశాల : ఐదు టి20ల సిరీస్‌లో భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ధర్మశాల వేదికగా ఆదివారం మూడో టి20 జరగనుంది. తొలి రెండు టి20ల్లో ఇరుజట్లు ఒక్కో మ్యాచ్‌ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో మూడు టి20లో గెలిచిన జట్టు సిరీస్‌ ఆధిక్యతలో నిలవనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో టి20 ప్రపంచకప్‌ ఉన్న క్రమంలో టీమిండియా పటిష్ట జట్టును సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌లో వైఫల్యం అభిమానులను కలచివేస్తోంది. మూడో టి20 జరిగే హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల మైదానంలో రాత్రిపూట మంచు దట్టంగా కురిచే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఛేదనకు దిగే జట్టు పరుగులు రాబట్టాలంటే కష్టపడాల్సిందే. దాదాపు 1500మీ. ఎత్తులో ఉన్న హిమాచల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌పిసిఎ) స్టేడియంలో రాత్రిపూట మ్యాచ్‌ యుద్ధభూమిని తలపిస్తుంది.

అందరి దృష్టి గిల్‌, సూర్యకుమార్‌పైనే…
టి20ల్లో శుభ్‌మన్‌ గిల్‌ చోటు ప్రమాదంలో పడింది. ఈ ఫార్మాట్‌లో అతడు ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోతున్నాడు. గత రెండు టి20ల్లో అతడు చేసిన పరుగులు 4(4 + 0). ఇక కెప్టెన్‌ సూర్యకుమార్‌ పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. కెప్టెన్‌ కాకముందు ఈ ఫార్మాట్‌లో పరుగులు వరద పారించిన అతడు.. కెప్టెన్‌ అయ్యాక ఘోరంగా విఫమవుతున్నాడు. టీమిండియాకు ఊరటనిచ్చే అంశమేమిటంటే అతడు సారథ్యం వహించిన 6 సిరీస్‌లలో టీమిండియా ఒక్క సిరీస్‌నూ చేజార్చుకోలేదు. దీంతో అతడు కేవలం టాస్‌కి మాత్రమే పరిమితమౌతున్నాడని మాజీ క్రికెటర్‌, విశ్లేషకుడు ఆకాశ్‌ చోప్రా చురక అంటించాడు. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టి20ల్లోనూ సూర్యకుమార్‌ చేసింది 17(12 + 5) పరుగులే. దీంతో వీరిద్దరి ప్రదర్శనపై అభిమానుల్లోనూ కొంత నిరుత్సాహం నెలకొంది. మరోవైపు ఆల్‌రౌండర్‌ దూబే కూడా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టి20ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో బ్యాటర్‌ ఆర్డర్‌ను బలోపేతం చేసుకోవాలంటే దూబే స్థానంలో సంజు శాంసన్‌ను రెగ్యులర్‌ బ్యాటర్‌గా తుది జట్టులో చోటు కల్పించాల్సిన అవసరం ఉంది.

జట్లు(అంచనా)…
ఇండియా : సూర్యకుమార్‌(కెప్టెన్‌), శుభ్‌మన్‌(వైస్‌ కెప్టెన్‌), అభిషేక్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌, దూబె, అక్షర్‌, జితేశ్‌(వికెట్‌ కీపర్‌), బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి, అర్ష్‌దీప్‌.
దక్షిణాఫ్రికా : మార్‌క్రమ్‌(కెప్టెన్‌), డికాక్‌(వికెట్‌ కీపర్‌), జోర్జి, బ్రెవీస్‌, డేవిడ్‌ మిల్లర్‌, యాన్సెన్‌, మహరాజ్‌, నోర్ట్జె, ఎన్గిడి, బార్ట్‌మన్‌, స్టబ్స్‌/హెండ్రిక్స్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -