హిందీలో ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మంచి సినిమాలు వస్తున్నాయి. అయితే భారీ తారాగణం, భారీ వ్యయంతో తీసిన సినిమాల రణగొణల మధ్య అవి ప్రేక్షకులు గమనించక ముందే తెరమరుగున పడ్తున్నాయి. ఓటిటి సదుపాయం అభివృద్ధి చెంది ఉండకపోతే వాటి నిర్మాణానికి అర్ధమే ఉండేది కాదు. అలాంటి ఒక సినిమా ‘హోం బౌండ్’ (ఇంటివైపు ప్రయాణం). జోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులేల చరిత్రపై తీసిన ”ఫూలే’ తర్వాత హిందీలో నిర్మించిన గొప్ప చిత్రంగా ‘హోం బౌండ్’ ను భావించవచ్చు. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీస్ వగైరా మత విద్వేషం వెదజల్లే సినిమాలకు ప్రసార సాధనాల్లో విపరీత ప్రచారం లభిస్తోంది. దేశ ప్రధాని స్వయంగా ప్రచారం చేసి పెడ్తున్నారు. ”హోం బౌండ్”కు అలాంటి అవకాశం లేదు. అది ఒక వాస్తవ ఘటనపై తీసిన సినిమా.
పత్రికలో వచ్చిన వ్యాసం ఆధారంగా రూపొందిన చిత్రం. ఎంతైనా సినిమానే గనుక డ్రామా కోసం కొంత కల్పనను జోడించి ఉండవచ్చు. అయితే వాస్తవ పరిస్థితికి దూరంగా జరిగి తీసిన సినిమా కాదు. ఆ కఠోర వాస్తవం కంటతడి పెట్టిస్తుంది. ఉద్వేగ భరితం చేస్తుంది. అదీ అతి సున్నితంగా.
న్యూయార్స్ టైమ్స్‌లో వచ్చిన ఒక ఆర్టికల్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. పేరును బట్టి కరోనా కాలపు సినిమా అని అర్థమవుతూనే ఉంది. అయితే కరోనా కష్టాలకు మాత్రమే పరిమితమైన సినిమా కాదు. దేశంలో నిరుద్యోగం, కులవివక్ష, మత విద్వేష ప్రచారం. తల్లితండ్రుల ఆశలు, యువతలో ఆవహించిన నిరాశా నిస్పృహలు, ఎండమావుల చూసి పెంచుకొన్న ఆశలు, కరోనా సమయంలో వలస కార్మికుల ప్రాణాలు హరించిన ప్రభుత్వ నిర్ణయాలు వగైరాలను చూపిన సినిమా. వాస్తవికతను చూపినా ప్రేక్షకుడికి విసుగు తెప్పించకుండా చిత్రాన్ని నడిపించాడు దర్శకుడు నీరజ్ ఘయివాన్. ప్రధాన పాత్రల్లో ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వి కపూర్ నటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 26న ఈ సినిమా మనదేశంలో విడుదలైంది.
బష్రత్ సీర్ రాసిన ఆ ఆర్టికల్ శీర్షిక ”ఏ ఫ్రెండ్ షిప్, ఏ పాండమిక్ అండ్ ఎ డెత్ బిసైడ్ ది హైవే” (ఒక స్నేహితుడు, ఒక మహమ్మారి, హైవే పక్కన ఒక మరణం) 2025 కేన్స్‌లో ఈ సినిమాను ప్రిమియర్ షోగా వేసినప్పుడు ప్రేక్షకులు తమ సేట్లల్లోంచి లేచి తొమ్మిది నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు మోగించారట. మనదేశం నుండి ఆస్కర్ అవార్డుకు అధికారికంగా పంపిన సినిమా ఇది. అయితే ఈ సినిమాను భారతీయ ప్రేక్షకులకు పూర్తిగా చూపెట్టలేదు. సెన్సార్ పేర చాలా కత్తిరించి ప్రేక్షకుల ముందుంచారు. భారతీయ ప్రేక్షకులు తమకు తాముగా ఏది మంచో ఏది చెడ్డో నిర్ణయించుకోలేరన్న అభిప్రాయంలో సెన్సార్ బోర్డు వ్యవహరించిదని క్రిటిక్స్ విమర్శించారు. అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో ఇళ్లల్లో పలకలేని బూతులను సెన్సార్ వారు సర్టిఫై చేశారు. అలాగే భయంకరమైన జగప్స కల్గించే హింస పట్ల సెన్సార్ బోర్డ్‌కు పట్టింపు లేదు. హీరోలు మొహం మీద నెత్తుటి చారలు చేతిలో రక్తమోడుతున్న మారణాయుధాలతో పోస్టర్లలో కన్పిస్తుంటారు. కాని ఈ సినిమాలో బూతులు హింస లేకపోయినా సెన్సార్ వారు రాజకీయ కారణాలతో కట్లు వేశారు.
బూతులు, హింస వంటి ధోరణికి పూర్తి విరుద్ధమైనది ”హోం బౌండ్” ఒక గ్రామంలో మహ్మద్ సయూబ్, అమృత్ కుమార్ అనే యువకులు ఉంటారు. ఇద్దరూ మంచి స్నేహితులు. (సినిమాలో వారి పేర్లు మహ్మద్ షోయబ్, చందన్ కుమార్.) ఇద్దరివీ కాయకష్టం చేసుకొని బతికే అత్యంత నిరుపేద కుటుంబాలు. ఇద్దరూ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తుంటారు. ఫలితాలు రావడానికి నెలలు పడ్తుంది. పరీక్షలో చందన్ కుమార్ పాసవుతాడు. షోయబ్ ఫెయిల్ అవుతాడు.
చందన్ దళితుడు కనుక తనకు తెలియనివారి దగ్గర తన పూర్తి పేరు చెప్పకుండా దాచి పెడ్తుంటాడు. తాను కులం వల్ల అవమానానికి గురవుతానని అనుకొన్న చోట తాను కాయస్తుడని చెప్పుకొంటాడు. షోయబ్ ముస్లిం కావడం వల్ల అవమానాలు ఎదుర్కొంటారు. ఒక ఆఫీసులో ప్యూన్‌గా పని చేసే షోయబ్ చేతి నుండి నీళ్ల బాటిల్ తీసుకోవడానికి కూడా అక్కడి ఒక ఉద్యోగి ఇష్టపడడు. ఇద్దరు స్నేహితులకూ క్రిక్రెట్ అంటే పిచ్చి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఆఫీస్ స్టాఫ్ వల్ల షోయబ్ అవమానపడి, చెప్రాసీ ఉద్యోగం వదులు కొంటాడు.
కానిస్టేబుల్ నియామక పత్రం కోసం కళ్లు కాయలు కాసేలా వేచి చూసిన చందన్ నిరాశతో తన ఊరికి 1400 కిమీ దూరంలోని సూరత్‌లో ఒక బట్టల మీల్లుల్లో కార్మికుడిగా పని చేయడానికి వెళ్తాడు. షోయబ్ కూడా దుబాయి వెళ్లాలన్న ప్రయత్నానికి విరామమిచ్చి అదే మిల్లులో కార్మికుడిగా చేరతాడు. లాక్డౌన్ వల్ల మిల్లు మూతబడుతుంది. తినడానికి కూడా డబ్బులుండవు. చేసేది లేక ఇంటి ముఖం (హోంబౌండ్) పడ్తారు. ప్రభుత్వమేమో చేతులు ముడుచుకొని కూర్చుంటుంది. వలస కార్మికులను వారి ఖర్మానికి వదిలేస్తుంది. ఢిల్లీలో జరిగిన ఒక ముస్లిం మత సభవల్ల దేశంలోకి కరోనా ముస్లింలతో వచ్చిందన్న ప్రచారం అపోహ వల్ల పోలీసులు, జనం ముస్లింల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తుంటారు. ఈ స్థితిలో షోయబ్‌కు చందన్ హిందూ పేరు పెడ్తాడు.
కరోనా కాలం కనుక దారి పొడువునా సాటి మనుషుల అవమాననీయ ప్రవర్తనను వారు రుచి చూస్తారు. చందన్‌ను దారిలో జబ్బుపడి మరణిస్తాడు. నానా కష్టాలుపడి చందన్ శవాన్ని, అతను తన అమ్మ కోసం కొన్న చెప్పులను షోయబ్ ఊరికి చేరుస్తాడు. పగిలిన తన అమ్మ అరికాళ్లకు చెప్పులు కొనాలన్నది చందన్ చిరకాల కోరిక. చందన్ చనిపోయాక అతనికి అపాయింట్‌మెంట్ లెటర్ చేరుతుంది.
ఇద్దరు యువకులే కాదు సినిమాలో అందరూ సహజత్వాన్ని చాటే విధంగా నటించారు. నేటి నేపధ్య సగీతం అవసరానికి మించి సినిమాల్లో సంభాషణలు విన్పించనివ్వ కుండా చేస్తుంది. ఈ సినిమాలో అ బాధలేదు. అలా అని పాత పారలల్ సినిమాలా కీచురాళ్ల శబ్దాలుండవు. ‘మనలాంటి వాళ్లు తమంతట తామే లేచి చాప మీద నుండి కుర్చీ దాకా చేరాలి! వంటి అర్థవంతమైన డైలాగులున్నాయి.
మెల్లమెల్లగా క్లార్నెట్ లేదా వాయెలిన్ శృతి పెంచుతూ ప్రేక్షకులను విషాదంలోకి తీసుకెళ్లదు. హోం బౌండ్ వాస్తవ ఘటనలు, యువకుల సహజ నటన ప్రేక్షకుల్ని విషాదంలోకి తీసుకెళ్తాయి. కరోనా కాలంలో ప్రభుత్వం తన బాధ్యతను మరిచి నిర్దాక్షిణ్యంగా చేతులెత్తేయడంతో రోజు కూలీలు, పారిశ్రామిక కార్మికులు కోట్లమంది పడిన బాధలను చిత్రం గుర్తు చేస్తుంది. ధర్మ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. అందరూ తప్పక చూడాల్సిన చిత్రం.
– ఎస్. వినయ కుమార్,
99897 18311



