ఆవిష్కరించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన చేనేత శాలువాను శనివారం హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న తన నివాసంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్యూఆర్ కోడ్‌తో ‘పోగు బంధంతో ఫోన్ బంధం’అనే శీర్షికతో ఈ శాలువాను రూపొందిం చారని చెప్పారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాల వివరాలు కనిపిస్తాయని వివరించారు. సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. తెలంగాణ చరిత్రను తెలిపే శాలువాను 15 రోజులపాటు కష్టపడి నేసిన సిరిసిల్లకు చెందిన నేతన్న నల్ల విజయ్ కుమార్‌ను కేటీఆర్ అభినందించారు. రూపొందించారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు, ప్రముఖ కట్టడాలు, సంప్రదాయాలు, కేసీఆర్ చేసిన మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల గొప్పతనం తెలిసేలా శాలువాను రూపొందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ప్రధాన కార్య దర్శి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నేత జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ ప్రోత్సాహంతో మరిన్ని అద్భుతాలు ఆవిష్కరిస్తాం : విజయ్ కుమార్
క్యూఆర్ కోడ్‌తో శాలువాను తయారు చేయడం చాలా సంతోషంగా ఉందని నల్ల విజరుకుమార్ అన్నారు. గతంలో అగ్గిపెట్టెలో పెట్టే చీరను తమ నాన్న తయారు చేశారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో తాను కూడా అనేక రంగులు మారే చీర, అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేశానని అన్నారు. తనకు బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం వచ్చిందన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, తెలంగాణ వారసత్వ సంపద, దేవాలయాలను శాలువాపై క్యూఆర్ కోడ్‌తో రూపొందించాలన్న ఆలోచన వచ్చిందని చెప్పారు. కాళేశ్వరం, యాదాద్రి దేవాలయం ఈ క్యూఆర్ కోడ్‌లో రూపొందించామని అన్నారు. ఈ శాలువాను కేసీఆర్‌కు అందజేస్తానంటూ కేటీఆర్ చెప్పారని వివరించారు. కేటీఆర్ ప్రోత్సాహంతో మరిన్ని అద్భుతాలను ఆవిష్కరిస్తామనీ, ఆయన ఎల్లప్పుడూ అండగా ఉన్నారని చెప్పారు.



