Tuesday, December 16, 2025
E-PAPER
Homeదర్వాజ'ప్రతీక' కవిత్వం హృదయ స్పందన

‘ప్రతీక’ కవిత్వం హృదయ స్పందన

- Advertisement -

కవిత్వం కేవలం భాషా రూపమే కాదు, అది భావం, అనుభూతి, లయ, ప్రతీక, అంతర్లీనంగా వున్న అర్థాల సమ్మేళనం. కవిత్వం అంటే ఏమిటి అంటే కేవలం ఒక్క మాటలో చెప్పలేం. కొందరికి అది ఉప్పొంగిన ఆత్మవెలుగు. మరికొందరికి సామాజిక దుఃఖం. ఎవరి నిర్వచనమూ సంపూర్ణం కాదు. ఒకదానికొకటి విరుద్ధం కూడా కాదు. అనేక నదులు కలిసినట్టు అవన్నీ కలిసి కవిత్వం అనే ఒక విస్తారమయిన సముద్రం ఏర్పడుతుంది. కవి హృదయంలోంచి వెలిబుచ్చిన భావం,ఉద్వేగం, దుఃఖం ఆనందం ఆ కవిత పాఠకుడి మనసులో మ్రోగిన ప్రతిధ్వని అదే కవిత్వానికి అసలయిన నిర్వచనం.

కవి వ్యక్తీకరించిన ఒక భావం చదువరి అంతర్లోకాల్లోకి చేరాలంటే మొదట అది కళ్ళని తర్వాత మనసుని తాకాలి. అర్థం కావాలి, మనసుకు హత్తుకోవాలి తన లోపల అంతర్లీనం అవ్వాలి. ఇదంతా జరగాలంటే కవి తన కవిత్వాన్ని వివిధ సాధనాల ద్వారా వ్యక్తీకరిస్తాడు. అందులో ముఖ్యమయిన సాధనం ‘ప్రతీక’. ఆ ప్రతీక దశ్యరూపణ అనేది కవిత్వంలోని అత్యంత కీలకమైన కళాత్మక సాధనం. దానికి పాఠకుడి ముందు ప్రపంచాన్ని ప్రత్యక్షంగా నిలబెట్టే శక్తి వుంటుంది. నిజానికి కవి తన మాటలకు రంగులు వేసి, శబ్దాలు జోడించి, స్పర్శలు కలిపి పాఠకుడి ఊహాలోకంలో ఒక ప్రత్యేక అనుభవాన్ని నిర్మిస్తాడు. అందుకే Imagery అనేది కేవలం ‘చిత్రణ’ కాదు. అది కవిత్వ హదయ స్పందన. ప్రతీక కవితకు జీవం పోస్తుంది పాఠకుడిని భావానుభూతికి దగ్గర చేస్తుంది. కవిత అర్థాన్ని మాత్రమే కాదు అనుభూతినీ పంచుతుంది అంతేకాదు పాఠకుడిలోని ఊహాశక్తిని మేల్కొల్పుతుంది. కవిత్వాన్ని స్మరణీయంగా ఉంచుతుంది. కవిత్వం చదివిన తర్వాత మనం గుర్తుంచుకునేది కథ కాదు ఒక దశ్యం, ఒక భావం, ఒక రంగు, ఒక శబ్దం. ఇవన్నీ ప్రతీకల వల్లనే సాధ్యమవుతుంది.
కవిత్వం ప్రాథమిక లక్ష్యం భావాలను, అనుభూతులను, జీవిత అనుభవాలను అత్యంత సున్నితమైన రూపంలో వ్యక్తపరచడమే అయినప్పుడు ఈ భావాలు పాఠకుడి హదయానికి చేరడానికి, వాచకుడి ఊహా ప్రపంచంలో నిలవడానికి కేవలం పదాలు మాత్రమే సరిపోవు. కవి రాసే పదాలు ఒక దశ్యరూపాన్ని సష్టించినప్పుడు అంటే పాఠకుడి మనసులో ఒక ‘చిత్రం’ వంటి స్పష్టమైన అనుభూతి మెదిలినప్పుడు అదే ప్రతీక (దశ్యరూపణ లేదా Imagery). ఇది కవిత్వానికి ప్రాణభూతం, కళాత్మక రసాస్వాదనకి తొలి మెట్టు కూడా..
కవితలో భావాలను మనిషి లోపలి ఐదు ఇంద్రియాల ద్వారా అనుభవించేటట్లు చేసే స్పష్టమైన సాధనం ప్రతీక (Imagery). అది పాఠకుడి ఊహా శక్తిని రెచ్చగొట్టే వర్ణన.
సరళంగా చెప్పుకుంటే చూసే, వినే, ముక్కుతో పసిగట్టే వాసన, రుచి చూసే, స్పర్శించే అనుభూతులను పాఠకునికి కలిగించే భాషననే ప్రతీక అంటారు.
నిజానికి ఈ ఇమేజరీ కవి వ్యక్తం చేసే భావాలను అమూర్తం నుండి సాక్షాత్కారానికి తీసుకువస్తుంది. ఇంకొంచెం వివరంగా చెప్పుకుంటే కవిత్వంలో మొత్తంగా సాహిత్యంలో ప్రతీక అనేది భావాలను ప్రత్యక్ష దశ్యాలుగా మార్చే శక్తివంతమయిన కళా రూపం. ప్రకతిని వర్ణించినా, సంఘటనను చెప్పినా, ఒక వేదనను రేకెత్తించినా కవి పాఠకుడికి ‘చూపించడం’ లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఇలా దశ్యమానం చేసే సాధించే భాషా శైలిలో ప్రతీకలు ప్రధాన భూమికను పోషిస్తాయి.
ఉదాహరణకు:
”మంచుకొండల వెనుక సూర్యుడు రాగి రంగు నీటిపట్టిలా విరిగి పోయాడు.” అనే కవితా పంక్తిలో సూర్యాస్తమయం కేవలం ఒక సత్యం కాదు, అది మన కళ్లకెదురుగా తెరుచుకునే దశ్యం. అనేకమంది కవులు అనేక రకాల ప్రతీకలని వాడుతారు. తమ ఊహలకు ఆలోచనలకు అనుభూతులకు రూపాన్నిస్తూ ప్రతీకలని తమ రచనల్లో ధ్వనిస్తారు. కవిత్వంలో ప్రతీక అనేది కేవలం దశ్యానుభూతికి మాత్రమే పరిమితం కాదు. మనం ఐదు ఇంద్రియాలతో అనుభవించే ప్రపంచాన్ని భాషలో ప్రతిఫలించే పద్ధతి ఇది. వాటిల్లో 7 ప్రధానమయినవి. వాటిని గురించి వివరంగా పరిశీలిస్తే…
మొదటిది దశ్య ప్రతీకలు (Visual Imagery) మన కంటికి కనిపించే దశ్యాలను పదాలతో చిత్రించడం తెలుగు ఆధునిక కవుల్లో శివారెడ్డి, శేషేంద్ర, ఇస్మాయిల్‌ ఈ శైలిని విస్తతంగా వినియోగించారు.
ఒక ఉదాహరణ చెప్పుకుంటే… ”పెద్ద బండ రాయి పైన పడ్డ/ ఆ నీడ ఎవరిది?/ అలా నడిచిపోతున్న కాలానిదా”. ”ఇంటిముందు వేపచెట్టు/ స్కూలు రోజుల్లో/ ఉదయాన్నే గుడ్మార్నింగ్‌/ సాయంత్రం గుడ్‌ ఈవెనింగ్‌/ రాత్రి గుడ్‌ నైట్‌ చెప్పి తానూ నిద్రపోయేది..”
ప్రతీకలలో రెండవది ‘శ్రవణ అనుభూతి’ (Auditory Imagery). మన చుట్టూరా వినబడే శబ్దాల్ని, స్వరాల్ని, నినాదాల్ని కవితల్లో వర్ణించడం.
ఉదాహరణగా చూస్తే: ”వానజల్లులలో పిల్లల నవ్వులు తట్టుతట్టుమంటూ పలికాయి.”
మరో కవి ఇట్లా అంటున్నాడు… ‘గది నిండా నిశ్శబ్దం/ మది నిండా మౌనం/ అందులో నీ పేరు ధ్వనిస్తోంది’.
మరో కవి శ్రవణ ప్రతీకలని ఇట్లా వాడాడు… ”అట్లా చూస్తూ చూస్తూ ఉండగానే/ కళ్ళు చెమర్చాయి/ కన్నీటిలో ముంచిన అక్షరాల్ని కాగితం పై నాటుతూ పోయాను/ పచ్చని పైరు మొలకెత్తింది/ కాగితం పరవశించింది/ వాక్యం నత్యం చేసింది”
ఇక్కడ కాగితం పరవశించడం, వాక్యం నత్యం చేయడం శ్రవణ ప్రతీకలే.
ఇక మూడవ రకం ప్రతీక ‘స్పర్శ అనుభూతి’ Tactile Imagery ఇది చలితో, వేడితో, మదుత్వంతో లేదా ఏదయినా స్పర్శతో కలిగే భావన. ఉదాహరణ: ”గాలి విసురుగా తాకింది/ చెట్టు గజ గజా వణికింది/ నా మనసు విల విల లాడింది”.
ఇక నాలుగవది వాసన/ సువాసన అనుభూతి (Olfactory Imagery): కవితల్లో గుభాలించే పూల వాసన, నేల వాసన, వంటింటి వాసన మొదలైనవి. ఉదాహరణ: ”మొదటి వర్షపు చినుకుల్లో మట్టి మురిపెం వాసన”
మరోటి.. ”అందమయిన ఒక గుబాళింపు/ మొక్క గుర్తుపెట్టుకుంది/ మనమే మర్చిపోతాం”. ”పక్కింట్లో కొత్త జంట ఎడమొఖంపెడ మొఖం/ ఇద్దరినడుమా/ ఓ సుగంధపు ఆగరొత్తీ వెలిగించాలి”
అయిదవ రకం ప్రతీక ‘రుచుల అనుభూతి (Gustatory Imagery): తీపి, నీరసం, పులుపు, చేదు ఇలాంటి రుచుల ఆధారంగా రాసిన కవితలు.. ఉదాహరణ: ”పండిన మామిడి తీపి పెదవులపై కరిగిపోయింది”. ”చిగురుటాకుల పచ్చి వాసన గాలిలో నిండిపోయింది”. ”పాత జ్ఞాపకం గుర్తుకు రావడంతో అతని హదయం ఒక్కసారిగా బిగుసుకుంది”. ”ఊపిరాడని దాహం/ ఆకాశంలో మేఘం పేలింది/ నేల ఫక్కున నవ్వింది”
ఆరవ రకం ప్రతీక చలనం లేదా చలన శక్తి (Kinesthetic Imagery): కవులు తమ రచనల్లో ఆటలు, పరుగులు, కదలికలు లేదా వేగం లాంటివి ఉపయోగించడం. ఉదాహరణ: ”గాలిని చీల్చుకుంటూ చిన్నపాప పరిగెత్తింది.”
మరికొన్ని….. ”పచ్చీసు అష్టాచెమ్మా / చార్‌ పత్తా ఒనగుంటలు/ ఒటీటీ సిక్సర్‌ కొట్టింది”. ”బతుకు ప్రయాణంలో /ఎందరో స్నేహితులు/ ఎవరి స్టేషన్లో వాళ్ళు దిగి పోయారు”
ఇక ఏడవ రకం ప్రతీక ‘అంతర్గత భావాల ప్రతీకలు’ (Organic Imagery): భయం, ఆకలి, నొప్పి, అలసట, తియ్యని ఆనందం ఇవన్నీ కవితాంశాలే అవుతాయి.
ఉదాహరణ: ”తనలోనెక్కడో ఒక ముడిపట్టు వేదన తిరిగి కదిలింది.” మరో ఉదాహరణ… ”కాలం తోసుకెల్తుంది/ తీరం ఆహ్వానిస్తుంది/ అలలు సుఖదుఃఖాల్లా పరామర్శిస్థాయి”. ఇలా ప్రతిభావంతులయిన అనేకమంది కవులు తమ కవితల్లో ప్రతీకలని అదుÄతేంగా హ ద్యంగా వాడతారు.
ఇంత గొప్ప ప్రతీకలు ఎట్లా వస్తాయి మీకు అని ఓ కవిని అడిగితే ‘ఇవేవీ మన చుట్టూ ఉండేవే.. అందరూ చూసేవే ఎండా, వెన్నెల, పువ్వులు పర్వతం సంతోషం దుఃఖం అన్నీ అందరమూ చూస్తున్నవే కాని వారిని మనం ఎట్లా స్వీకరిస్తున్నాం అన్నదే ప్రధానం. చంద్రున్ని ఆకాశాన్నే అందరమూ చూస్తాం కానీ అవి ఎప్పుడూ ఒకేలా వుండవు. ఏ రోజుకా రోజు మారి పోతూవుంటాయి. కవి అనేవాడు ఆ మార్పును గమనించాలి, ఫీలవ్వాలి. అంతేకాదు ఆ భావాన్ని కాగితం మీద పెట్టాలి. అదే ప్రతీకలని స్వీకరించడం ఫలితంగానే కవితలు గొప్పవి అవుతాయి’ అన్నాడు. రాయాలనుకున్న వాళ్ళు తమ మెదడుని మనసుని విశాలంగా విప్పార్చి ఉంచాలి అప్పుడే మంచి ప్రతీకాత్మక కవిత్వం వస్తుంది.

వారాల ఆనంద్‌, 9440501281

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -