పుంజుకుంటున్న తమిళనాడు, తెలంగాణ
వెనుకబడిన గుజరాత్, మహారాష్ట్ర
న్యూఢిల్లీ : దేశం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో నయా ట్రెండ్ కన్పిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడు, తెలంగాణ నుంచి గణనీయంగా ఎగుమతులు జరిగాయి. అదే సమయంలో ఉత్తరాదిలోని గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఎగుమతులు పడిపోయాయి. అయినప్పటికీ ఇప్పటికీ గుజరాత్ నుంచే అధిక ఎగుమతులు జరుగుతుండడం గమనార్హం. ఎగుమతి విలువలో తమిళనాడు 19.6 శాతం, తెలంగాణ 36.3 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. సంప్రదాయపరంగా చూస్తే మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ఎక్కువగా ఎగుమతులు జరుగుతుంటాయి. అయితే గత ఆర్థిక సంవత్సరంలో గుజరాత్ ఎగుమతుల విలువ 13.4 శాతం, మహారాష్ట్ర ఎగుమతుల విలువ రెండు శాతం పడిపోయింది.
మొత్తంగా చూస్తే ఇప్పటికీ ఎగుమతుల్లో గుజరాత్‌దే అగ్రస్థానం. ఆర్బీఐ డేటా ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఆ రాష్ట్రం నుంచి 116.3 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఎగుమతులు జరిగాయి. అయితే 2023-24లో జరిగిన 134.4 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఎగుమతులతో పోలిస్తే ఇది 18 బిలియన్ డాలర్లు తక్కువ. తమిళనాడు నుంచి 2023-24లో 43.6 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఎగుమతులు జరగ్గా గత ఏడాది ఏకంగా 52.1 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఎగుమతులు జరిగాయి. అంటే ఎగుమతుల విలువలో 17.6 శాతం వృద్ధి కన్పించింది. 2021-22లో ఆ రాష్ట్రం నుంచి 26.15 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఎగుమతులు జరగ్గా అవి క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి.
గడచిన ఐదు సంవత్సరాల కాలంలో తమిళనాడు నుంచి జరిగిన ఎగుమతుల విలువ దాదాపు రెట్టింపు అయింది. తమిళనాడు నుంచి ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతులు నిలకడగా పెరుగుతున్నాయి. మరో దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణ విషయానికి వస్తే 2023-24లో జరిగిన ఎగుమతుల విలువ 14 బిలియన్ డాలర్లు. అది గత ఆర్థిక సంవత్సరంలో 19.1 బిలియన్ డాలర్లకు…అంటే 36.3 శాతం పెరిగింది. 2020-21లో జరిగిన ఎగుమతుల విలువ 8.7 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువే. సంప్రదాయ ఇంజినీరింగ్ వస్తువులకు తెలంగాణ హబ్‌గా కొనసాగుతుండగా తమిళనాడులో ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన కొత్త పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి. ఎగుమతుల విషయానికి వస్తే తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మంచి పురోగతి సాధిస్తున్నాయి.
2023-24లో ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల విలువ 19.8 బిలియన్ డాలర్లు ఉండగా గత సంవత్సరం అది 20.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇదే కాలంలో కర్నాటక ఎగుమతులు విలువ కూడా 26.6 బిలియన్ డాలర్ల నుంచి 30.5 బిలియన్ డాలర్లకు చేరింది. కొన్ని దక్షిణాది రాష్ట్రాలు ఎగుమతుల విషయంలో మంచి పురోగతి సాధిస్తుంటే సంప్రదాయకంగా ఎగుమతులకు ప్రసిద్ధి చెందిన గుజరాత్, మహారాష్ట్ర వెనుకబడి పోతున్నాయి. 2023-24తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల విలువ గణనీయంగా పడిపోయిన రాష్ట్రాల్లో గుజరాత్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్, ఉన్నాయి. పెట్రోకెమికల్స్, రత్నాలు-ఆభరణాలు, వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన గుజరాత్‌లో 2023-24లో కూడా ఎగుమతుల విలువ తగ్గింది. ఎగుమతులకు పేరెన్నికగన్న మహారాష్ట్రలోనూ అది పరిస్థితి. అంతర్జాతీయ చమురు మార్కెట్లలో నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితుల కారణంగా గుజరాత్ నుంచి, ఇతర రాష్ట్రాలతో పోటీపడలేక మహారాష్ట్ర నుంచి ఎగుమతులు తగ్గుతున్నాయని నిపుణులు తెలిపారు.



