సర్పంచ్, వార్డు సభ్యులు సహా పోటిచేసిన అభ్యర్థులంతా వివరాలు ఇవ్యాల్సిందే
లేకుంటే గెలిచినా,ఓడినా చర్యలు తప్పవు
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
ఎన్నికల్లో పెట్టిన ఖర్చు ఏదైనా లెక్క చూపాల్సిందే తేడా వస్తే… గెలిచినా ఓడినా పోటీ చేసిన అభ్యర్థులకు తిప్పలు తప్పవు. తప్పుడు లెక్కలు చేప్పితే పూర్తి బాధ్యత వహించాల్సిందేనని అధికారులు అంటున్నారు. ప్రతి ఖర్చు ఆధారాలతో సహ అందజేయాల్సిందే అని అధికారులు చెబుతున్నారు. సర్పంచు, వార్డు స్థానాలకు పోటీ చేసే, చేసిన అభ్యర్థులు ఖర్చు వివరాలను పూర్తిగా, పక్కాగా నమోదు చేయాల్సిందే. ఆ వివరాలను ఎన్నికల అనంతరం 45 రోజుల్లోగా ఎంపీడీవోలకు అందించాల్సి ఉంటుంది. ఖర్చుల వివరాలను సమర్పించకపోతే, సదరు అభ్యర్థి గెలిచినా, ఓడినా రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటారు.
గెలిచిన అభ్యర్థులపై అనర్హత, ఇతర చర్యలు తీసు కునేందుకు ఎంపీడీవోల సిపార్సు మేరకు డీపీవో కలెక్టర్‌కు నివేదిక పంపుతారు. వారి నుంచి వచ్చిన వివరణ మేరకు కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. అలాగే ఓడిపోయిన సర్పంచు, వార్డు మెంబర్లు ఏ ఇతర ఎన్నిక ల్లోనూ పోటీ చేయకుండా వారిపై అనర్హత వేటు వేయనున్నారు. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. అంతర్గత ఖర్చులు తప్ప బహిరంగంగా కనపడే ఖర్చులు లేకుండా అభ్యర్థులు జాగ్రత్త పడుతున్నారు.
జనాభాను బట్టి ఎన్నికల ఖర్చు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఎంత ఖర్చు చేయవచ్చో ఎన్నికల వ్యయ పరిశీలకులు నిర్ణయించిన విషయం తెలిసిందే. జనాభా 5 వేల కంటే ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలలో సర్పంచు అభ్యర్థి రూ 2.50 లక్షల వరకు ఖర్చు చూపాలి. వార్డు సభ్యుడి స్థానానికి రూ. 50 వేలు మాత్రమే ఖర్చు చూపాలి. చేయకుంటే ఏమీ లేదు. చిన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచు అభ్యర్థికి రూ. 1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ. 30 వేలను ఎన్నికల అధికారులు నిర్ణయించారు.
2019లో 500 మందిపై అనర్హత
నారాయణపేట, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు, 2019లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అనంతరం 2019, ఫిబ్రవరి 17లో అప్పటి సీఎం కేసీఆర్ తన జన్మదినం సంబర్భంగా నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు మొత్తం 721 గ్రామాలకు గాను బండమీదిపల్లి, శంకరాయిపల్లి గ్రామాలకు ఎన్నికలు నిర్వహించలేదు. 719 గ్రామాలకు, 6,825 వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. అందులో 500 మంది వార్డు సభ్యులు, 25 మంది సర్పంచులు ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించలేదు. దీంతో వారు 3 ఏండ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు. ఈ సారి ఎన్నికల్లో ఎంత మంది అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాలను అందిస్తారో ఎన్నికల అనంతరం తెలుస్తుంది.
అంతు చిక్కని ఖర్చు
గ్రామాలల్లో సర్పంచు అభ్యర్థులుగా పోటీ చేస్తున్నవారి ఖర్చు చూస్తే కళ్లు తిరిగిపోతాయి. ముఖ్యంగా నోటిఫికేషన్ పడిన నాటి నుంచి ఎలక్షన్ దాకా వారు పెట్టిన ఖర్చు 20 లక్షల నుంచి కోటీ వరకూ ఉంటుందని చర్చ జరుగుతున్నది.
సామాన్యులు ఎన్నికల్లో గెలవలేరు : వెంకటయ్య, గుంతకోడూరు
నేను 15 ఏళ్లుగా ఈ గ్రామంలో వామపక్ష ఉద్యమ నిర్మాణం కోసం కృషి చేశాను. ఎవరికి ఏ ఆపద వచ్చినా దగ్గర ఉండి ఆదుకున్నాను. ఎన్నికలు ఏవైనా సామాన్యులు గెలిచే పరిస్థితులు లేకుండా పోయాయి. ప్రజలు సామాన్య కార్యకర్తలను గెలిపించి అవినీతికి దూరంగా ఉండేలా ప్రజలే నాయకుల విధానాలను మార్చేలా ఉండాలి.
ఎన్నికల సంఘం విఫలం : వావిలాల రాజశేఖర శర్మ, సామాజిక ఉద్యమకారుడు, నాగర్‌కర్నూల్
ఎన్నికలు సజావుగా జరపాల్సిన ఎన్నికల సంఘం పూర్తిగా విఫలం అయ్యింది. బహిరంగంగా వేలం ద్వారా గ్రామాలను దక్కించుకున్నారని సోషల్ మీడియాలో రావడం విచిత్రం. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు సైతం బయట పడ్డాయి. 5 వేల జనాభాకు 2.50 లక్షలు మాత్రమే అభ్యర్థులు ఖర్చు చేయాల్సి ఉంది. వేలం ద్వారా గ్రామాలను దక్కించుకున్న అభ్యర్థుల ఖాతాలో ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం లేదా. ఇదంత ఎన్నికల కమిషన్ దృష్టికి రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి.
పోటీ చేయగానే అయిపోలె..లెక్కలు పక్కాగా చెప్పాల్సిందే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



