నేటి మహిళలు గతంలో వలె పెండ్లి తర్వాత ఇల్లు, కుటుంబానికే పరిమితం కావడం లేదు. విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. మరికొందరైతే రిటైర్‌మెంట్ వయసుకు వచ్చిన తర్వాత కూడా తమ అభిరుచులకు పదును పెడుతున్నారు. అలాంటి వారిలో మద్దాలి కృష్ణకుమారి ఒకరు. గృహిణిగా, తల్లిగా బాధ్యతలు నిర్వహించిన తర్వాత తన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. అది కూడా తనకు అభిరుచి ఉన్న రంగంలో రాణిస్తున్నారు. యాభై ఏండ్లు దాటిన తర్వాత నటనపై దృష్టిపెట్టారు. టీవీ సీరియల్స్‌లో, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ వయసుకి హాబీకి సంబంధం లేదని నిరూపిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
మద్దాలి కృష్ణకుమారి సంగీత, సాహిత్యాలకు ప్రాధాన్యం ఇచ్చే కుటుంబంలో పుట్టి పెరిగారు. పారుపల్లి రామకృష్ణయ్య గొప్ప సంగీతవేత్త. ఆయన చెల్లెలు ఓగిరాల సౌభాగ్యలక్ష్మి కృష్ణ కుమారికి బామ్మ. తల్లిదండ్రులు ఓగిరాల రాజ్యలక్ష్మి, రాధాకృష్ణమూర్తి. ప్రసిద్ధ రంగస్థలనటులు అద్దంకి శ్రీరామ మూర్తి భార్య ఈమెకి మేనత్త. అందుకే కృష్ణ కుమారికి సంగీత, సాహిత్యాలతో చిన్నతనం నుండే పరిచయం. అలా ఈమె కూడా కళారంగంలో నటిగా పైకివచ్చారు. సంగీత పాఠాలను కృతుల వరకు వంకమామిడి వీరరాఘవయ్యగారి వద్ద నేర్చుకున్నారు.
చిన్నవయసులోనే పెండ్లి
16వ ఏటనే మిలట్రీలో చేరిన ఆమె తండ్రి ఆ తర్వాత సుబేదారు మేజర్‌గా చైనావార్‌లో పాల్గొన్నారు. తండ్రి ఎక్కువగా దేశ సరిహద్దుల్లో ఉండేవారు. దాంతో కృష్ణకుమారి తన తల్లి, అన్న, తమ్ముడితో కలిసి విజయవాడలోని బామ్మ దగ్గర పెరిగారు. తండ్రికి ఔరంగాబాద్ బదిలీ అయిన తర్వాత ఆర్మీ క్వార్టర్స్‌లో ఉండి ఆర్మీ స్కూల్లో చదువుకున్నారు. తర్వాత తండ్రి కచ్ బార్డర్‌కి బదిలీ కావటంతో తిరిగి తల్లితో సహా విజయవాడ వచ్చేశారు. కృష్ణకుమారి పదో తగరతి పూర్తి చేసిందో లేదో ఇంట్లో వాళ్లు పెండ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. టైప్ హయ్యర్ పాసైన ఆమె ఉమ్మడి కుటుంబంలో మూడో కోడలిగా కొత్త జీవితం ప్రారంభించారు.
భర్త మరణంతో…
భర్తకి హెచ్.ఎ.ఎల్.లో ఉద్యోగం. దాంతో బెంగుళూర్‌లో కాపురం పెట్టారు. వీరికి ముగ్గరు కొడుకులు. కృష్ణకుమారి తమిళం, కన్నడ, హిందీ భాషలు అనర్గళంగా మాట్లాడుతారు. జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో 1996లో భర్త హఠాత్ మరణం ఆమెను కాస్త కుంగదీసింది. అప్పుడు పిల్లలు ముగ్గురు 8,9,10 క్లాసుల్లో ఉన్నారు. ఆ సమయంలో ఆర్థిక బాధలు వేధించినా పిల్లల్ని పోషించుకోవడం కోసం ఒక స్కూల్లో టైపిస్ట్‌గా చేరారు. ఆ తర్వాత చాలా ప్రైవేట్ జాబ్స్ చేసి పిల్లలందరినీ ఒంటిచేత్తో వృద్ధిలోకి తెచ్చారు. ప్రస్తుతం పెద్దబ్బాయి నేవీలో ఉద్యోగం చేస్తుంటే, మిగిలిన ఇద్దరు సాఫ్ట్‌వేర్స్‌గా స్థిరపడ్డారు.
ఓపిక ఉన్నప్పుడు పని చేయాలి
కృష్ణకుమారి ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఒక్క గదిలో ఉండి మిగతా ఇల్లు అద్దెకిచ్చి సంసారం నడిపారు. భర్త పెన్షన్ రావటంతో కాస్త కుదుట పడ్డారు. ప్రస్తుతం పిల్లల పెళ్లిళ్లు జరిగి మనవలు యు.ఎస్, ఢిల్లీ, పుణె వంటి ప్రాంతాల్లో హాయిగా ఉంటున్నారు. వీలు దొరికినప్పుడల్లా కొడుకులు, కోడళ్లు, మనవలతో కృష్ణకుమారి సదరాగా గడుతుంటారు. ఓపిక ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే 2010లో మ్యారేజ్ బ్యూరో పెట్టారు. భావనాత్మక వివాహ వేదికలో అనుభవం గడించి ఇంట్లోనే ‘స్పందన వివాహవేదిక’ నడుపుతున్నారు. మిగిలిన ఖాళీ సమయంలోనూ కూర్చోకుండా తనలోని టాలెంట్‌ని ఎలాగైనా మెరుగు పర్చుకోవాలని అనుకున్న సమయంలో 2020లో టీవీ సీరియల్ నటి నాగలక్ష్మి ప్రోత్సాహంతో బుల్లితెరకు పరిచయమయ్యారు. తన వయసుకు తగిన పాత్రల్లో రాణిస్తున్నారు.
నటిగా జీవితం…
ఐదు గంటలకు ఇంటి నుంచి బైలుదేరితే యూసఫ్‌గూడాలో అన్ని టీవీ ఛానల్స్ బస్సులు ఎక్కించుకుంటాయి. లొకేషన్ నుండి తిరిగి ఇల్లు చేరేప్పటికి 11 దాటుతుంది. కోఆర్డినేటర్స్ ద్వారా కృష్ణకుమారికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఈమె ఇప్పటి వరకు శతమానంభవతి, మనసంతా నువ్వే, దీర్ఘ సుమంగళి వంటి సుమారు పది సీరియల్స్‌లో నటించారు. అలాగే సుమన్ టీవీలో మందులు, బట్టల యాడ్స్, ఎన్నికల టైంలో నటించిన అనుభవాలు మరపురానివి అంటారామె. అంతేకాదు ‘సీనియర్ సిటిజన్‌గా యాక్టివ్‌గా ఉంటూ మనకాళ్లపై మనం నిలబడితే ఏదో ఒక హాబీతో జీవితం సాఫీగా సాగుతుంది’ అంటారు.
ఎంతో సరదాగా…
సీరియల్స్‌లోనే కాక సినిమాల్లోనూ ఆమె నటిస్తున్నారు. గుంటూరు కారం, సరిపోదా శనివారం, ఆదికేశవ, ఖుషి, ఐపీఎస్ ప్రవీణ్ వంటి సినిమాల్లో కృష్ణకుమారి కనిపించారు. ‘ఖుషి మూవీ షూటింగ్ కోసం మా అందరినీ రెండు బస్సులలో అన్నవరం తీసుకెళ్లారు. ఎక్కడ షూటింగ్‌కి వెళ్లినా చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరం కలిసి చాలా సరదాగా పడుపుతాము. ఒకే కుటుంబంలా ఉంటాము. ఖాళీ సమయంలో రీల్స్ చేసుకుంటూ, పాటలు పడుకుంటూ ఎంతో సరదాగా సమయం గడిచి పోతుంది. ఈ వయసులో ఇంతకు మించి ఇంకేం కావాలి’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.
అచ్యుతుని రాజ్యశ్రీ



