Tuesday, December 16, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఎమ్మెస్‌ అగర్వాల్‌ పరిశ్రమలో ప్రమాదం

ఎమ్మెస్‌ అగర్వాల్‌ పరిశ్రమలో ప్రమాదం

- Advertisement -

ఇనుము కరిగించే బట్టీ పేలి కార్మికుడి మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం
పరిశ్రమను మూసేయాలంటూ గ్రామస్తుల ఆందోళన
పరిశీలించిన తూప్రాన్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్‌ ఆంజనేయులు

నవతెలంగాణ-మనోహరాబాద్‌
మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రంగాయిపల్లి గ్రామంలోని ఎమ్మెస్‌ అగర్వాల్‌ స్టీల్‌ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఇనుమును కరిగించే బట్టీ పేలడంతో ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాలకు నిలయంగా మారిన ఎమ్మెస్‌ అగర్వాల్‌ పరిశ్రమను మూసేయాలంటూ గ్రామ యువకులు, ప్రజలు పరిశ్రమ ఎదుట పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. రంగయ్యపల్లి గ్రామ శివారులో ఉన్న ఎమ్మెస్‌ అగర్వాల్‌ స్టీల్‌ పరిశ్రమలో వందలాది మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనులు చేస్తున్నారు.

సోమవారం మధ్యాహ్నం ఇనుమును కరిగించే బట్టీల వద్ద సుమారు 25 నుంచి 30 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. కరిగించిన ఇనుమును క్రేన్ల సహాయంతో తరలిస్తారు. మధ్యాహ్నం సమయంలో అధిక వేడి కావడంతో బట్టీ ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో క్రేన్‌ డ్రైవర్‌ అన్షు విశ్వకర్మ(38) పూర్తిగా కాలిపోయాడు. బట్టీల వద్ద పనిచేస్తున్న మరో ఇద్దరిపై కరిగిన ఇనుము ద్రవం పడింది. దాంతో బీహార్‌కు చెందిన రాజేష్‌ పాండే, జితేందర్‌ రారుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పరిశ్రమ ప్రతినిధులు అంబులెన్స్‌ రప్పించి ఇద్దరు కార్మికులను ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన అన్షు విశ్వకర్మ మృతదేహాన్ని తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆందోళన చేపట్టిన గ్రామస్తులు
బట్టీ పేలడంతో పెద్ద ఎత్తున శబ్దంతో భూమి కంపించినట్టైందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న ఇండ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయని, మరో ఇంటి గోడ కూలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమను మూసేయాలంటూ గ్రామస్తులు తరలివచ్చి పరిశ్రమ గేటు ముందు బైటాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులకు సమాచారం అందడంతో మనోహరాబాద్‌ ఎస్‌ఐ సుభాష్‌ గౌడ్‌ పరిశ్రమ వద్దకు వచ్చి గ్రామస్తులను సముదాయించారు. అలాగే తూప్రాన్‌ ఆర్డీవో జయచంద్రా రెడ్డి, మనోహరాబాద్‌ తహసీల్దార్‌ ఆంజనేయులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కార్మికుడి మృతి: తోటి కార్మికుల ఆవేదన
పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కార్మికుని ప్రాణం పోయిందని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే యాజమాన్యం స్పందిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. పరిశ్రమలో కార్మికులను బానిసలుగా చూస్తున్నారని, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరికీ చెప్పనీయకుండా తమపై ఆంక్షలు పెడుతున్నారని, చెబితే వేధింపులకు గురి చేస్తారని వాపోయారు. పరిశ్రమలో ఇంత పెద్ద ప్రమాదం జరిగినా.. అక్కడే పనులు చేయాలని ఒత్తిడి చేశారని, అనంతరం గ్రామస్తులు రావడంతో తమను అక్కడి నుంచి పంపించి వేశారని తెలిపారు. రెండు నెలల కిందట ఇదే పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడిపై నుంచి వాహనం వెళ్లడంతో మృతి చెందాడని, ఆ ఘటన బయటకు రాకుండా అడ్డుకున్నారని వాపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -