Wednesday, December 17, 2025
E-PAPER
Homeజాతీయంగంజాయి రహిత సమాజం నిర్మించాలి

గంజాయి రహిత సమాజం నిర్మించాలి

- Advertisement -

మాఫియాను రాజకీయాలకు దూరం పెట్టండి
పెంచలయ్య సంతాప సభలో
సిపిఎం పొటిల్‌బ్యూరో సభ్యులు వాసుకి

నెల్లూరు : గంజాయి రహిత సమాజాన్ని నిర్మించడానికి యువత, విద్యార్థులు ముందుకురావాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు యు.వాసుకి పిలుపునిచ్చారు. ఇటీవల గంజాయి ముఠా చేతిలో దారుణ హత్యకు గురైన కె పెంచలయ్య సంతాప సభ సిపిఎం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. నెల్లూరు టౌన్‌ హాల్లో నిర్వహించిన ఈ సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ అధ్యక్షత వహించారు. తొలుత పెంచలయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వాసుకి మాట్లాడుతూ పెంచలయ్య కుటుంబం వెంట పార్టీ ఉంటుందని అన్నారు. తన జీవితాన్ని సమాజ మార్పు కోసం త్యాగం చేసిన పెంచలయ్య లాంటి కార్యకర్తలను కాపాడుకోవాల్సి ఉందని తెలిపారు. సమాజ మార్పు కోసం ఆయన తన కళ ద్వారా ప్రచారం చేశారని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సాంస్కృతిక పోరాటంలో నిమగమై పనిచేశారని వివరించారు. గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా పనిచేసినందునే ఆయనను పొట్టన పెట్టుకుందని తెలిపారు. రాజకీయాల్లో గంజాయి, డ్రగ్స్‌ మాఫియాలకు అవకాశాలు ఇవ్వకూడదన్నారు. సిపిఎం అలాంటి వ్యక్తులకు ఎక్కడా స్థానం ఇవ్వదని, మాఫియా, గుండాలు, అరాచక శక్తులకు తమ పార్టీలో స్థానం ఉండదని రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు. మిగిలిన పార్టీలూ ఈ పద్ధతి పాటిస్తే మాఫియాను పూర్తిగా దూరం పెట్టొచ ్చన్నారు. శత్రువులు సిపిఎం నాయకులు, కార్యకర్తలను చంపినా, వారి గొంతు, ఆశయాన్ని మాత్రం ఏమీ చేయలేరని పేర్కొన్నారు. మతతత్వం, విద్వేష రాజకీయాలు ఎంతో ప్రమాదకరమైనవి, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సమాజ మార్పునకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. అందరూ సంతోషంగా ఉండాలని, అందులో మనం ఉండాలనే భావం కలిగి ఉండాలని, అలా కోరుకొనే కార్యకర్త పెంచలయ్య అని వివరించారు.

యూత్‌ ఐకాన్‌ పెంచలయ్య : వి.శ్రీనివాసరావు
నేటి యువతకు కె.పెంచలయ్య ఆదర్శమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. పెంచలయ్య లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. యువత ఎలా ఉండాలనే దానికి మార్గదర్శకం చూపారని వివరించారు. గంజాయి రద్దు కోసం యువత పోరాడాలని కోరారు. హత్య చేయించిన అరవ కామాక్షి ఒక్కరే కాదని, రాజకీయ పార్టీలు, కొందరు అధికారుల మద్దతుతోనే ఇది జరిగిందని అన్నారు. పెంచలయ్య కుటుంబానికి సిపిఎం పూర్తి అండగా ఉంటుందని, భవిష్యత్తులో మరింత సాయం చేస్తామని తెలిపారు. కందుకూరులో రాజకీయ గొడవల్లో చనిపోయిన వ్యక్తులకు ప్రభుత్వం సాయం చేసిందని, సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన పెంచలయ్య కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కోరారు. ఇటీవల కలెక్టర్‌ను కలిశామని, పెంచలయ్య భార్యకు ఉద్యోగం, నగదు, పొలం, ఇవ్వాలని కోరామని తెలిపారు. అందుకు ఆయన స్పందించారన్నారు. సిఎంను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. లేడీ డాన్లు విజృంభిస్తున్నారని సిఎం చెబుతున్నారని, అందుకు కారణం ఎవరని ప్రశ్నించారు. సిఎం చెప్పాల్సింది డాన్లు గురించి కాదని, వారిని ఎదుర్కొని ప్రాణత్యాగం చేసిన పెంచలయ్య గురించి అని అన్నారు. యువత స్కూలు, కాలేజీ స్థాయి వరకు గంజాయి మత్తులో తూలుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మావోయిస్టులను ఏరేస్తున్నామని చెబుతోన్న కేంద్రం… గంజాయిని ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. పెంచలయ్యలా మరొకరికి జరగకుండా చూడాలని, ఆయన స్ఫూర్తితో సామాజిక ఉద్యమాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ సభలో పెంచలయ్య సతీమణి కె.దుర్గ, మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రమణ్యం, సిపిఐ జిల్లా కార్యదర్శి అరెగెల సాయి, కాంగ్రెస్‌ పార్టీ సిటీ ఇన్‌ఛార్జి నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి, సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమొక్రసీ నాయకులు రాంబాబు, సిపిఐ ఎంఎల్‌ నాయకులు లక్మీరెడ్డి, ఎస్‌యుసిఐ నాయకులు బసవరాజు, ఒపిడిఆర్‌ నాయకులు శివశంకర్‌, టిడిపి నాయకులు భానుశ్రీ, బిఎస్‌పి నాయకులు జానకీ ప్రసాద్‌, ఐలు నాయకులు విజయమోహన్‌రెడ్డి, పౌరహక్కుల సంఘం నాయకులు అబ్బరురెడ్డి, గిరిజన సంఘం నాయకులు కెసి పెంచలయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.మోహన్‌రావు, మాదాల వెంకటేశ్వర్లు, గోగుల శ్రీనివాసులు, కె.అజరుకుమార్‌, ఎం.పుల్లయ్య, టి.గోపాల్‌, మూలె వెంగయ్య, షేక్‌ రెహెనా బేగం, సిపిఎం సీనియర్‌ నాయకులు చండ్ర రాజగోపాల్‌, కె.పెంచలయ్య పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

పెంచలయ్య కుటుంబానికి రూ.7.20 లక్షలు ఆర్థిక సాయం
సిపిఎం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి సేకరించిన రూ.7.20 లక్షలు ఆర్థిక సాయాన్ని పెంచలయ్య భార్య దుర్గకు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు యు.వాసుకి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అందజేశారు. ఇది తొలి విడత సాయమని, మళ్లీ సాయం అందిస్తామని తెలిపారు. నెల్లూరు సిటీ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.లక్ష అందజేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -