కండువా కప్పి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ప్రజాపాలనకు ఆకర్షితులై యువత స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన సుమారు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, డిసిసి అధ్యక్షుడితో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, టౌన్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, బ్లాక్ అద్యక్షులు సూర దేవరాజు కండువా కప్పి యువకులను పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజాపాలనకు ఆకర్షితులై యువత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని, అదే ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో భారీగా ప్రజాప్రతినిధులను గెలిపించుకునేలా పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తున్న తరుణంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తు ముందుకెళుతున్నామని చెప్పారు.
పార్టీ పట్టిష్టత కోసం నిబద్ధతతో పని చేయాలని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ నూతనంగా పార్టీలో చేరిన యువకులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్టీవో సభ్యులు సంగీతం శ్రీనాథ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డిమల్ల భాను, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్, యూత్ కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు పోగుల దేవరాజు, పట్టణ యూత్ మాజీ అధ్యక్షుడు చిందం శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీ ఆకేని సతీష్, నాయకులు కలిం, ఆడెపు ప్రసాద్, రాపల్లి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.



