జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రశాంతంగా మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. బుధవారం ఆయన మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ పలు గ్రామాలలో పరిశీలించి, మాట్లాడారు. పచ్చని మొక్కలు, పూల తోరణాలు, రంగుల ముగ్గులు, కొబ్బరి మట్టలతో, స్వాగత తోరణాల మధ్య ఓటర్లకు పూల మొక్కలతో, వృద్ధులకు శాలువాతో సత్కరించి, మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న నూతన ఓటర్లకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు స్వాగతం పలికారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి మండలంలో పర్యావరణహిత, గ్రీన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చెయ్యాలని కలెక్టర్ ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రీన్ మోడల్,ఆదర్శ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు విశేష ఉత్సాహంతో పాల్గొన్నారన్నారు.
బుధవారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో బాగంగా మూడవ విడత జరుగుతున్న పోలింగ్ సరళని చౌటుప్పల్ మండలం లోని ఆరెగూడెం గ్రామంలో పర్యావరణహిత పోలింగ్ కేంద్రాన్ని, నారాయణపురం మండలం చిమ్మిర్యాల గ్రామంలో ఆదర్శ పోలింగ్ కేంద్రం, మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రం, మోటకొండూరు మండలం చాడ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఓటర్లు ఓటు వేసేందుకు చేసిన ఏర్పాట్లను, పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లు ప్రశాంతంగా ఆహ్లాదకరమైన, పర్యావరణ హితమైన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని అన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో ఓటర్ల సంఖ్య, పోలింగ్ శాతాన్ని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశించారు. ప్రతి ఓటరు 2 బ్యాలెట్ పేపర్లు బాక్సులో వేస్తున్నారా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత లోనికి ఎవ్వరిని అనుమతించకుండా క్యూ లైన్ లో ఉన్న ఓటర్లకు మాత్రమే అవకాశం కల్పించాలన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియను సంబంధిత అధికారులు జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాల ముందు ఓట్లు లెక్కించే సమయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



