ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న సీఈవో మల్లారెడ్డి
నవతెలంగాణ – కట్టంగూర్
మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో అవినీతి,అక్రమాలు చోటుచేసుకున్నాయని పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ కట్ట జానకిరెడ్డి ఆరోపించారు. బుధవారం కట్టంగూర్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు సహకారాన్ని అందించవలసిన బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం, ఆధిపత్య పోరుతో రైతాంగానికి బ్యాంకు వల్ల ఉపయోగం లేకుండా పోయిందన్నారు. ఏడాది క్రితం రైతాంగానికి వడ్డీ మాఫీ కింద వచ్చిన నిధులను రైతులకు తిరిగి చెల్లించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. పలుమార్లు బ్యాంకుకు వెళ్లి వడ్డీ మాఫీ నిధులు ఇవ్వాలని కోరిన చెల్లించలేదన్నారు.
బ్యాంకు లో సిబ్బంది పైరవీల మీద ఉద్యోగాలు పొంది తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. అర్హత లేకున్నా వారికి ఉద్యోగాలను ఇచ్చారని, అనర్హులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఉన్న శ్రద్ధ రైతాంగానికి సేవలు అందించడంలో లేదన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించే విషయంలో నిర్లక్ష్యం వహించి ప్రైవేట్ డీలర్లకు లాభం చేకూరే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సహకార సంఘంలోని అవినీతిపై గతంలో జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. సిబ్బంది పనిచేయడం లేదనే నేపంతో సీఈవో మల్లారెడ్డి ఇష్టా రాజ్యాంగా వ్యవహరిస్తున్నారని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. పై అధికారులు వెంటనే విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీఈఓ మల్లారెడ్డి వివరణ
ఈ ఏడాది మార్చి నెలాఖరున 120 మంది రైతులకు వడ్డీ మాఫీ నిధులు మంజురయ్యాయని వారు తమ సంఘంలో రుణాలను రద్దు చేసుకొని మరో బ్యాంకులో తీసుకున్నారు. దాంతో వారికి సకాలంలో డబ్బులు జమ చేయలేకపోయాం. తమ సంఘంలోని ఖాతాదారులు అందరికీ వడ్డీ మాఫీని అందించాం. ధాన్యం కొనుగోలు కేంద్రాల పనుల వల్ల ఆలస్యమైంది త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం.



