Wednesday, December 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎలా ఓడామబ్బా.!

ఎలా ఓడామబ్బా.!

- Advertisement -

అంతర్మథనంలో…అభ్యర్థులు
నవతెలంగాణ – మల్హర్ రావు

మూడవ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కొంత మంది అభ్యర్థుల అంచనాలు తలకిందులయ్యాయి.ఎన్నో ఆశలు పెట్టుకున్న పలువురు ఓటమిపాలై నైరాశ్యంలో మునిగిపోయారు. బుధవారం రాత్రి వచ్చిన ఫలితాల్లో గెలిచిన అభ్యర్థులు సంబరాల్లో మునిగి తేలగా ఓటమి పాలైనవారు,వారి మద్దతుదారులు నిరాశతో కనిపించారు. గ్రామాల్లో ఆయా పార్టీల నాయకులు రిజర్వేషన్లు కలిసి రావడంతో పంచాయతీ బరిలోకి దిగారు.గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డారు. అయినా గెలుపు అంచులకు చేరుకోలే కపోయారు. దీంతో ఎలా ఓడిపోయామా అని అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఆలోచనలో పడ్డారు. ఎక్కడ పొరపాటు జరిగింది..ఏం తక్కువ చేశాం..ఓటర్లు ఎందుకు విశ్వసించలేదనే ఆలోచన ఒకవైపు..ఖర్చుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలా అని మరోవైపు అంతర్మథనంలో మునిగిపోయారు.

ఎవరి అంచనాలకు అందని విధంగా ఆయా గ్రామాల్లో ఓటర్లు తీర్పిచ్చి షాకిచ్చారు.ఎక్కడా ఓటర్లు తమకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపించలేదని, అయినా ఎలా ఓటమి పాలయ్యామా అని పలువురు అభ్యర్థులు విశ్లేషణ చేస్తున్నారు. కొందరైతే ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో స్థాయికి మించి ఖర్చు పెట్టారు.చేతిలో డబ్బులు లేని వారు ఆస్తులను తాకట్టుపెట్టి, వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ సర్పంచ్ గా పోటీ చేశారు.ఓటమి పాలు కావడంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే ఆయా గ్రామాల్లో ఓటమి పాలైన అభ్యర్థులు పలువురు కంటతడి పెట్టారు. 

ప్రలోభాలకు గురిచేసినా..
నాయకులంతా ఏకమై ప్రత్యర్థిని ఒంటరి చేసిన అనేక గ్రామాల్లో ప్రత్యర్థి వైపే ఓటర్లు నిలబడి గెలిపించారు. హంగు ఆర్భాటాలు, విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీకి ఎక్కడా ఓటరు అనుకూలంగా తీర్పు వెల్లడించలేదని ఈ ఫలితాలతో రుజువయ్యింది. డబ్బులు, మద్యం పంచి ఎలాగైనా గెలవాలనుకుని ప్రలోభాలకు గురి చేసినా ఫలితం లేక పోవడం చెంపపెట్టుగా మారింది. కొన్నిచోట్ల ఇద్దరు అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటు వేయాలనుకున్న వారికే వేసి.. తీర్పు ఇవ్వాలనుకున్న వారికే ఇచ్చారు. కొన్ని పంచాయతీల్లో అయితే వార్డు సభ్యులకు ఒకవైపు సర్పంచ్ లకు మరో వైపు అన్నట్లుగా ఫలితాలు వచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -