లోక్‌సభలో బిల్లు ఆమోదం
అదానీ సంక్షేమం కోసమే : సీపీఐ(ఎం) ఎంపీ సచ్చిదానందన్
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
దేశ అణు రంగాన్ని దేశీయ, విదేశీయ కార్పొరేట్లకు అప్పగించే ‘సస్టైనబుల్ హార్నెస్సింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్’ (శాంతి) బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) ఎంపీ సచ్చిదానందన్ మాట్లాడుతూ అదానీకి మేలు చేసేందుకే ఈ బిల్లును ఏకపక్షంగా ఆమోదింపజేశారని అన్నారు. ముఖ్యమైన ఈ బిల్లుపై కనీసం ఆరు గంటల పాటు వివరణాత్మక చర్చ జరపాలని, బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను తోసిపుచ్చారని తెలిపారు. అణు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు ప్రయివేటు అణు కంపెనీలు చెల్లించాల్సిన పరిహారంపై పరిమితిని ఎందుకు నిర్ణయించారని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన కీలకమైన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. అణుశక్తికి సంబంధించిన అంశాలు జాతీయ భద్రత, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్వహించాలని, మోడీ ప్రభుత్వం సాధారణ వాణిజ్య ప్రయోజనాల ఆధారంగానే అణుశక్తి రంగాన్ని నిర్వహిస్తోందని అన్నారు. ప్రమాదకరమైన ఈ బిల్లుతో కేంద్రం ముందుకు సాగకూడదని డిమాండ్ చేశారు.
ప్రయివేటుకు అణు రంగం
- Advertisement -
- Advertisement -



