కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని ప్రచారం
పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన హక్కులు పరిష్కారమవుతాయా..? : కార్మిక సంఘాలు
న్యూఢిల్లీ : లేబర్ కోడ్స్ రూపంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చినవి స్వతంత్ర భారత చరిత్రలోనే అతి పెద్ద సంస్కరణలని నరేంద్ర మోడీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థపై అవి చూపించబోయే ప్రభావాన్ని గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసింది. పారిశ్రామిక కార్మికుల సంక్షేమానికి ఇవి బాటలు వేస్తాయని, ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తాయని, వ్యాపారాలను సులభతరం చేస్తాయని, నిబంధనలు-ఇన్‌స్పెక్టర్ రాజ్ నుంచి యాజమాన్యాలకు సాధికారత కల్పిస్తాయని…ఇలా ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయని ఊదరగొట్టింది. అయితే వాస్తవంలోకి వస్తే కార్మిక కోడ్స్ ఏ మేరకు ప్రయోజనకరమనే విషయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కార్మికుల్లో 90 శాతం మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారని ప్రభుత్వ పత్రమే చెబుతోంది. కాబట్టి నిబంధనలను పాటించేలా చూడడం అంత సులభం కాదు. ఒక పోర్టల్‌లో రిజిస్టర్ చేయించుకున్నంత మాత్రాన, రిటర్న్‌లు లేదా పత్రాలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాఖలు చేసుకున్నంత మాత్రాన వ్యాపారాలు చేయడం సులభతరం కాబోదు. జీఎస్టీ అమలు విషయంలో మోసాలు నిరాటంకంగా జరిగాయి. అదే విధంగా కార్మిక సంస్కరణల విషయంలో కూడా వ్యవస్థను మోసం చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఉదాహరణకు సిబ్బందితో రాజీనామా చేయించి నైపుణ్యాల శిక్షణకు నిధులు అందించాలన్న నిబంధన నుంచి తేలికగా తప్పించుకోవచ్చు. అలాగే తప్పనిసరి ఆరోగ్య పరీక్షలను తూతూ మంత్రపు తంతుగా మార్చేయవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలలో కార్మికుల ఆరోగ్యం, భద్రతకు ఎంత తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారో మనకు తెలిసిందే.
కష్టపడి పనిచేసే కార్మికుల సంక్షేమానికి సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ కనీస వేతన నిబంధన ప్రభావవంతంగా లేదు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులలో చాలా మందికి కనీస వేతనాలు అమలు కావడం లేదు. ప్రతి ఐదు సంవత్సరాలకు కనీస వేతన స్థాయిని అంచనా వేయాలన్న నిబంధన సరైనది కాదు. ఎందుకంటే జీవన వ్యయంలో తరచుగా గణనీయమైన నిర్మాణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం, ఏటా ఇంటి అద్దెలు పెరగడం, విద్య-ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరగడం వంటి పరిణామాలను గమనిస్తే ఐదు సంవత్సరాలకు ఒకసారి సమీక్ష జరిపే కంటే రాష్ట్రాల్లో చెల్లించాల్సిన కనీస వేతనాలను ఏటా సర్దుబాటు చేయడం అవసరం. కాగా అసంకల్పిత ఆరోగ్య తనిఖీలు కార్మికుల గోప్యతను హరిస్తాయి. యాజమాన్యాల ఖర్చును పెంచుతాయి. ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా కార్మికులను వేరు చేసే ప్రమాదం కూడా ఉంటుంది.
మన దేశంలో అధికారికంగా ఉపాధి స్థాయిలు పెరిగినప్పుడే కార్మిక సంస్కరణలు ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. ఉద్యోగ నియామక పత్రం పొందడం అనేది కేవలం ఉపాధిని అధికారికం చేసే ప్రక్రియలో మొదటి అడుగు మాత్రమే. ఉద్యోగులకు సకాలంలో జీతం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం లేదా యాజమాన్యాలపై ఉంది. అయితే ప్రభుత్వాలు సైతం తమ ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించని సందర్భాలు అనేకం ఉన్నాయి. దేశంలో కార్మికుల ఉత్పాదకత పెరిగినప్పటికీ 2000-2019 మధ్యకాలంలో ఆదాయంలో వారి వాటా పెరగలేదు. కార్మిక చట్టాలలో సంక్లిష్టతలను తగ్గించడానికి ప్రభుత్వం ఓ అడుగు వేసింది. అయితే ఈ ప్రయత్నాన్ని దేశంలోని యాభై కోట్ల మంది ఉద్యోగుల (వీరిలో 90 శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారే) ఆర్థిక వృద్ధికి, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి దోహదపడే సంస్కరణగా భావించలేము. కార్మిక సంస్కరణలను అమలు చేయడానికి బదులు మెరుగైన పని పరిస్థితులను కల్పించడం, తక్కువ పనిగంటలతో మూలధన ఉత్పాదకతను పెంచి జీవన నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.



