ఆయన పోగేసిన సంపద వివరాలివ్వండి
న్యాయ పోరాటానికి దిగిన పులిట్జర్ ప్రైజ్ బోర్డ్
వాషింగ్టన్ : మీడియా సంస్థలపై, వార్తా పత్రికలపై తరచూ న్యాయ పోరాటానికి దిగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు గట్టి చిక్కే వచ్చి పడింది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్న చందంగా ట్రంప్‌పై పులిట్జర్ ప్రైజ్ బోర్డు దావా వేసి ఆయనకు షాక్ ఇచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన జర్నలిజం బహుమతులను ప్రదానం చేస్తూ, పత్రికా స్వేచ్ఛకు పర్యాయ పదంగా నిలిచిన ఈ బోర్డు దేశాధ్యక్షుడినే ఇరకా టంలో పెట్టింది. ట్రంప్ వైద్య రికార్డులు అందజేయాలని, ఆయనకున్న అపారమైన వ్యక్తిగత సంపదకు సంబంధించిన సమా చారాన్ని సవివరంగా ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అంతేకాదు… ఆ సంపదను ఆయన ఎలా పోగేశారో కూడా తెలియజే యాలని కోరింది. ట్రంప్‌తో చట్టపరంగా ఢకొీంటున్నది పులిట్జర్ బోర్డు మాత్రమే కాదు. ట్రంప్ తనపై వేసిన పరువునష్టం దావాను సమర్థవంతంగా ఎదుర్కొంటానని బీబీసీ కూడా ప్రకటించింది. ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ గొంతు నొక్కేందుకు ట్రంప్ ఇలాంటి ఎత్తుగడలు పన్నుతున్నారని మండిపడింది. తాను వేస్తున్న వ్యాజ్యాలపై సంవత్సరాల తరబడి సుదీర్ఘమైన, ఖరీదైన విచారణలు జరుగుతాయని ట్రంప్‌నకు బాగా తెలుసు.
అందుకే ఆయన ఈ దారిని ఎన్నుకున్నారు. తద్వారా ఆయా సంస్థలపై ఒత్తిడి పెంచవచ్చునని ఆయన అభిప్రాయప డుతున్నారు. ది వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికను, దాని యజమాని రుపర్ట్ మర్దోచ్‌ను ట్రంప్ పది బిలియన్ డాలర్లు డిమాండ్ చేశారు. అయితే ఆ పత్రిక తన నివేదికకు కట్టుబడి ఒక్క పైనా కూడా చెల్లించలేదు. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు ట్రంప్ పంపిన పుట్టినరోజు కార్డుపై ఆ పత్రిక కథనాన్ని అందించిన విషయం తెలిసిందే. ట్రంప్‌తో సుదీర్ఘ న్యాయపోరాటం సాగించ లేని కొన్ని మీడియా సంస్థలు ఆయనతో రాజీ చేసు కున్నాయి. సీబీఎస్ ప్రసార సంస్థపై ట్రంప్ 20 బిలియన్ డాలర్ల దావా వేయగా 16 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు అది అంగీకరించింది. ఏబీసీ సంస్థ కూడా ట్రంప్‌తో రాజీ పడి 15 బిలియన్ డాలర్లు చెల్లించింది. కాగా సీఎన్‌ఎన్‌పై కక్ష తీర్చుకోవడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 1980వ దశకం నుంచి మీడియా సంస్థలపై ట్రంప్ 20 నుంచి 30 దావాలు వేశారు. మొత్తంమీద రెండు వేల నుంచి మూడు వేల వరకూ చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.



