వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్
మూజువాణితో శాంతి బిల్లు ఆమోదం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పౌర అణుశక్తి రంగాన్ని ప్రయివేటీకరించే ‘సస్టైనబుల్ హార్నెస్సింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా’ (శాంతి బిల్లు) బిల్లుతో జాతీయ భద్రతకు నష్టమని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెనక్కి తీసుకోవాలని లేదంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపాలని డిమాండ్ చేశాయి. గురువారం రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ శాంతి బిల్లును చర్చకు పెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగం అభివృద్ధికి కృషి చేయాలని, కాని ఈ రంగాన్ని ప్రయివేట్ రంగం స్వాధీనం చేసుకుంటే అది మన అణు కార్యక్రమాలకు నాయకత్వం వహించిన డాక్టర్ హౌమీ బాబా, విక్రమ్ సారాభారు వంటి శాస్త్రవేత్తల నమ్మకాలను విస్మరించడమే అవుతుందని అన్నారు. బయటి నుంచి వచ్చే ప్రయివేట్ కంపెనీలు చెప్పే దానిపై ఆధారపడకుండా, మన శాస్త్రవేత్తలు చెప్పేది దానిని మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
కానీ ఈ బిల్లుతో ప్రయివేట్ పెత్తనం పెరుగుతుందని, మన శాస్త్రవేత్తలకు తగిన ప్రాధాన్యం లభించదని పేర్కొన్నారు. డీఎంకే ఎంపీ విల్సన్ మాట్లాడుతూ ప్రయివేట్ నియంత్రణలో అణుశక్తిని విస్తరించడమంటే జాతీయ భద్రత, మానవ జీవితంతో జూదమాడటమేనని విమర్శించారు. ఈ బిల్లు చట్టబద్ధమైన భద్రతా సమస్యలను పరిష్కరించలేదని అన్నారు. ఆప్ ఎంపీ సందీప్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ విదేశాల నుంచి ప్రయివేట్ అణు నమూనాను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పడం దారుణమన్నారు. వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ ఈ బిల్లు రాష్ట్రాలకు ప్రయోజనాలు, అభివృద్ధి, స్థానికులకు పరిహారం, హామీ ఇవ్వదని అన్నారు. బీఆర్‌ఎస్ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ బిల్లులో పర్యావరణ బాధ్యత లేకపోవడాన్ని ఎత్తి చూపారు. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని, అలాగే పర్యావరణ కమిటీ దానిని నిరంతరం పర్యవేక్షించాలని ఆయన సూచించారు.
అణు సరఫరాదారుల ప్రయోజనానికే ఈ బిల్లు : సీపీఐ(ఎం) ఎంపీ ఎఎ రహీం
ఈ బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సీపీఐ(ఎం) ఎంపీ ఎఎ రహీం అన్నారు. అణు సరఫరాదారుల ప్రయోజనం కోసమే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని విమర్శి ంచారు. ఈ బిల్లులో ప్రజా ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాలు లేవని, కేవలం అణశక్తి రంగాన్ని ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించడమే లక్ష్యంగా ఉందని తెలిపారు.. ఈ బిల్లుతో అణుశక్తి రంగం ప్రయివేట్ నియంత్రణలోకి వెళ్తుందని పేర్కొన్నారు.
లోక్‌సభలో సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు
లోక్‌సభలో సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలు అరుణ్ నెహ్రూ, మనీష్ తివారీ ఈ బిల్లును వ్యతిరేకించారు. ఈ బిల్లు శాసన, కార్యనిర్వాహక, న్యాయ అధికారాలను ఒకే సెక్యూరిటీస్ బాడీతో కేంద్రీకరిస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ఈ బిల్లును మరింత పరిశీలన కోసం స్టాండింగ్ కమిటీకి పంపాలని కోరారు.



