నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వరద కాలువకు నీటిని విడుదల చేయడం ద్వారా రైతుల నీటి కష్టాలు తీర్చాలని కోరుతూ శుక్రవారం మండల కేంద్రానికి చెందిన పలువురు ఆయకట్టు రైతులు తహసిల్దార్ గుడిమేల ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. గాండ్లపేట వద్ద వరద కాలువకు గండిపడడం వల్ల కాలువలో నీళ్లు రావడంలేదని, సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని రైతులు విన్నవించారు. వరద కాలువలో అతి తక్కువ మొత్తంలో ఉండడం వల్ల కాలువ పక్కన ఉన్న బోరు బావులు అడుగంటి పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయకట్టు రైతులు వరద కాలువ నీటి పైన ఆధారపడి మోటర్లు పెట్టుకొని గత 15 సంవత్సరాల నుండి కాలువనీటితో పంటలు పండించుకోవడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం వరద కాలువలో నీరు లేకపోవడం వలన మొక్కజొన్న, జొన్న, వరి, పసుపు పంట పొలాలకు మీరు పెట్టుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. వరద కాలువకు పడ్డ గండిని బాగు చేయడం ద్వారా రైతులకు కాలువలో నీటిని విడుదల చేసి అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రైతులు పన్నాల రాజారెడ్డి, సంత రాజేశ్వర్, పార్శపు బాపయ్య, వెల్లుల్ల బాలకిషన్, గోవింద్ భూమన్న, తదితరులు పాల్గొన్నారు.



