Saturday, December 20, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు41 మంది మావోయిస్టుల సరెండర్‌

41 మంది మావోయిస్టుల సరెండర్‌

- Advertisement -

డీజీపీకి 24 ఆయుధాలు అప్పగింత
మిగతావారూ లొంగిపోండి..
లేకుంటే ఎన్‌కౌంటర్‌ అయ్యే ప్రమాదం
దండకారణ్యంలోని మావోయిస్టులకు డీజీపీ శివధర్‌రెడ్డి హితవు
ఫోన్‌ట్యాపింగ్‌ కేసుపై మాట్లాడబోనని స్పష్టం చేసిన డీజీపీ

నవతెలంగాణప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
దండకారణ్యానికి చెందిన 41 మంది మావోయిస్టులు శుక్రవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట ఆయుధాలతో సహా లొంగిపోయారు. తమ వద్ద ఉన్న 24 ఆయుధాలు, బుల్లెట్లు, మందుగుండు సామగ్రిని పోలీసులకు అప్పగించారు. అందులో ఒక ఎల్‌ ఎమ్‌జీ, 2 ఏకే 47లు, ఇతర ఆయుధాలున్నాయి. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులకు డీజీపీ తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ.25వేల చెక్కును అందజేశారు. అనంతరం డీజీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. దండకారణ్యంలోని మిగతా మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలో కలవాలని హితవు పలికారు. లేకుంటే ఎన్‌కౌంటర్‌లో చనిపోయే ప్రమాదముందని హెచ్చరించారు.

తమ ఎదుట లొంగిపోయిన వారిలో ఇద్దరు తెలంగాణ వాళ్లు, మిగతావాళ్లు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని తెలిపారు. వారిలో ఇద్దరు డివిజన్‌ కమిటీ సభ్యులు కాగా, మిగతా వాళ్లంతా మావోయిస్టు పార్టీ సభ్యులు, పీఎల్‌జీఏ, వివిధ కమిటీ సభ్యులున్నారని వివరించారు. తెలంగాణకు చెందిన వారిలో కామారెడ్డికి చెందిన రవి, మంచిర్యాలకు చెందిన ప్రభంజన్‌ ఉన్నారనీ, వారిద్దరూ మంచిర్యాల డివిజన్‌ కమిటీ సభ్యులని తెలిపారు. ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లాలనీ, కేంద్రం విధించిన గడువు అయిపోగానే పోలీసు గాలింపు చర్యలు ఆగిపోగానే తిరిగి కలుసుకుందామని మావోయిస్టు అగ్రనేతలు చెప్పారని లొంగిపోయినవారు తమకు చెప్పారని డీజీపీ వివరించారు. అలా చెప్పిన అగ్రనేతలు ఒక్కొక్కరు లొంగిపోవడం, కూంబింగ్‌ రోజురోజుకీ ఉధృతం అవుతుండటంతో లొంగిపోయామని మావోయిస్టులు తమకు చెప్పారన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 509 మంది మావోయిస్టులు లొంగిపోయారనీ, అందులో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, ఎనిమిది మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ఉన్నారని చెప్పారు.

తెలంగాణను మావోయిస్టు రహిత ప్రాంతంగా చేయడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నామనీ, ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు, ఆ దిగువన వివిధ నాయకత్వ స్థానాల్లో 54 మంది మావోయిస్టులు ఉన్నారని వివరించారు. ప్రస్తుతం మావోయిస్టు రాష్ట్ర కమిటీలో కేవలం ఆరుగురు మాత్రమే తెలంగాణ వారు ఉండగా మిగతా వారు ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతం వాళ్లని ఆయన తెలిపారు. వారంతా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తాము చేస్తామని హామీనిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర కమిటీ సభ్యులైతే రూ.5 లక్షలు, డివిజన్‌ కమిటీ సభ్యులకు రూ.4 లక్షలు, సభ్యులకు లక్ష చొప్పున పారితోషికాన్ని అందజేస్తామని తెలిపారు.

ఆయుధాలతో లొంగిపోయిన వారికి వాటి శక్తిని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.4 వేల వరకు కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇస్తోందని చెప్పారు. ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్రదాడికి కారకులైన సాజిద్‌ అక్రమ్‌ నగర వాసి అయినప్పటికీ అతనికి ఇప్పటివరకు రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు లేవని డీజీపీ శివధర్‌రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున మరో సిట్‌ ఏర్పాటుపై తానేమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ విజయ్ కుమార్‌, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ మహేశ్‌కుమార్‌ భగవత్‌, ఎస్‌ఐబీ ఐజీ సుమతి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -